Saturday, September 28, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సాకి:ప్రపంచాధినేతైనా నీకడ తల వంచాల్సిందే
తలకట్టున్నోళ్ళంతా నీమాట వినాల్సిందే

పల్లవి:మెత్తగా వాడుతావు కత్తిని సైతం
శిల్పిలా చెక్కుతావు జుత్తును మొత్తం
వికృతమౌ వికాసాన్ని సంస్కరిస్తావు
నిబిడీకృత అందాలు వెలికితీస్తావు
క్షరకర్మ కార్మికా విశ్వకర్మ రూపుడవు
అవిశ్రాంత ఓర్మికా మయబ్రహ్మ వారసుడవు

1.వినియోగదారుల స్వాగతిస్తావు
ప్రేమమీర పలకరించి ఆసీనులజేస్తావు
జాప్యమున్నగానీ జారుకోనీయవు
కుశలోపరులడుగుతూ ఆకట్టుకుంటావు
నాయీ బ్రాహ్మణుడా నీపలుకే ఒకవేదం
శిరోజాలంకృతుడా మానవతే నీ వాదం

2.కర్మసిద్ధాంతాన్ని నిష్ఠగా నమ్ముతావు
వృత్తిమీద నిశితంగా దృష్టినిపెడతావు
ఖాతాదారు తృప్తిని కొలతగ భావిస్తావు
రాజుపేద ఎవరైనా సమతకు స్ఫూర్తినీవు
మంగళదాయకా నీకు వేనవందనాలు
శుభాశుభైక పాలకా నిత్యనీరాజనాలు

3.చీదరించు బొచ్చునైన ఆదరంగచూస్తావు
వెలిసిన సొగసులను పునరుద్ధరిస్తావు
మారణాయుధాలకైన మమతను నేర్పేవు
కేశాలదోషాలను పరిహరించివేస్తావు
బడుగువర్గ సోదరా భవ్యరీతి వర్ధిల్లు
నీవులేక బ్రతుకేదిర అనవరతము శోభిల్లు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఒక శోకం శ్లోకమైంది,రఘువంశమైంది
ఒక మైకం మౌనమైంది,అనుభవైకమైంది
ఒక భావం కవనమైంది,బృందావనమైంది
అనురాగం యోగమైంది,సహయోగమైంది

1.నిదురెలావస్తుంది ఎద నీవె నిండిపోతె
తనువెలా మోస్తుంది తలపులన్ని దండివైతె
ఎదురుగానీవుంటే ఎనలేని స్వప్నాలు
కుదురుగా ఉండక మనలేని జీవనాలు

2.భావనలు నీవైనా స్పందనలు నావి
ప్రతిపాదనలు నావైనా  అనుభూతులు నీవీ
నిజమేమిటంటే నీవీ నావీ వేరేలేవు
నాతో పాటేనీవు నీతో బాటేనేనూ

3.కాలమూ లోకమూ అన్నీ మనవి
మనవిని విని మననంచేయగ నేనే కవిని
పదేపదే లయమౌదాం నిరంతరం బాహ్యంగా
కొత్త చరిత మనమూ రాద్దాం అనూహ్యంగా
శవాలపైని పేలాలు"

అవినీతికి అదునైన మూలాలెన్నో
అవకాశ పదవికి వేలాలెన్నో
గీతానికి ఎగబడే తోడేళ్ళెన్నో
డబ్బుకు గడ్డి కఱచు ఇంద్ర జాలాలెన్నో

1.లంచం జన్మహక్కైన శాఖలెన్నో
ఆమ్యామ్యాకాశపడే గుంటనక్క లెన్నో
అధికారం ముసుగులో ఆరితేరిరెందరో
దర్జాగల దొంగలనక వీరినేమందురో

2.మందుపార్టీలకు మోజుపడే దొకరకం
పొందుచిందు కోరుకునేదింకోరకం
కానుకలను ఆశించేదొక అవినీతి
పలుకుబడికి తలవంచేదొక అవినీతి

3.శ్రమకు మించి లభించితే అక్రమార్జనే
తేరగా దొరికితే అదీ పరుల సొమ్మే
జీతందొబ్బితింటు పీడించడమెందుకు
విధిలేక కక్కిన వాంతి నాకుడెందుకు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

పాపాలను తొలగించే శ్రీ వేంకటేశ
ఐశ్వర్యమునొసగేటి శ్రీశ్రీనివాసా
నరులను పరిపాలించే శ్రీ తిరుమలేశా
ఏమని నినుకోరను నన్నెరుగనివాడవా
అడిగిపొందలేనప్పుడు మదిసుమాలు వాడవా
జయ జయ జయ అలమేలు మంగా విభో
జయ జయ జయ పద్మావతీ సతిప్రభో

1.నిత్య కైంకర్యాలు బ్రహ్మోత్సవాలు
కనుల పండగే స్వామీ నీ వైభవాలు
తండోప తండాల భక్త సందోహాలు
మెండైన సేవలు నిండుగుండు నీలాలు
ఇంతటి ఈ సందడిలో నా సంగతి మరచెదవా
కొండలు కోవెల విడిచి నా గుండెన నిలిచెదవా
జయ జయ జయ అలమేలు మంగా విభో
జయ జయ జయ పద్మావతీ సతిప్రభో

2.వైకుంఠం వదలి వచ్చి తిరుపతిలో నిలిచావు
ఏడుకొండలెక్కిమరీ వేడ్కతోడ వెలిసావు
నను రమ్మని పిలునీకు రాగమే కనరాదు
నీకై మొహంవాచినా చూచుయోగమేలేదు
కనులుమూసుకుంటాను కనికరించి కనిపించు
ఉఛ్వాసనిశ్వాసలొ నీ నామమె తలిపించు
జయ జయ జయ అలమేలు మంగా విభో
జయ జయ జయ పద్మావతీ సతిప్రభో