Tuesday, December 15, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మౌనం మన మధ్యన పారే జీవనది

భావనా యానానికి అక్షర వారధి

ప్రత్యక్ష సావాసమె మన పరమావధి

ఉవ్విళ్ళూరుతోంది తలవగ నామది


1.మాటలతో కట్టేస్తా మహారాణీ నీకో కోట

నందనవనాలే నీ నగవులు విరియు చోట

స్వప్న లోకాలలో సరదా విహారమేనంట

స్వర్గసీమలే మనకు వేసవి విడుదులంట


2. స్నిగ్ధ సౌగంధికా పుష్ప చందమే నీ తనువు

కేతకి పొదల ఎదల సుగంధమే నీవున్న తావు

పరిపక్వ ఆమ్ర ఫల రసానందమే నీతో చనువు

అముక్తమాల్యద ప్రబంధమే నీతో నా మనువు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నవ్వడం నేర్చుకుంది నినుచూసి నవ్వు

పురులు పొదువుకుంది నినుగని పువ్వు

తొలకరి నేలకైన అబ్బురమే నీ మేని తావి

సుధకు మధుర మలరింది తాకినంత నీ మోవి


1.ఉరకల నెరిగాయి నినుగాంచి సెలయేళ్ళు

పరవశాలు మరిగాయి నిను తలంచి నెమళ్ళు

వర్ణాలను వెతికింది నిను తూగగ హరివిల్లు

ధన్యత నొందింది నిను తడుపగ చిరుజల్లు


2.వికలమైంది  నిను నుతించి మరి లిఖించ కవికలం

విరమించుకుంది కుంచె మరి దించక నీ  చిత్రణానంతరం

పలువిధముల నిను పాడి మరిపాడక మౌనవించె పికగళం

సాహసించదే ఏ ఉలి  ఏమరి మలచగ  నీ దివ్య శిల్పం

 

https://youtu.be/iAU_znayN28?si=SMbAPo3xVn3fdZiV

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


యుగయుగాలుగా చిరంజీవిగా

తరతరాలుగా మా ఇలవేలుపుగా

ఇలవెలసిన శివతేజా మారుతి రాజా

స్మరియింతు నిన్ను వీరాంజనేయా

భజియింతు నిన్ను భక్తాంజనేయా


1.వ్యక్తి కన్న రామనామమే శక్తివంతమని

నిరూపణే చేసితివి ఎదుర్కొనగ శ్రీరాముని

సీతమ్మకు శ్రీరాముడు వశమైన మిష నెరిగి

సిందూర ధారణతో  రాముని మది గెలిచితివి

ధ్యానించెద నిన్ను అభయాంజనేయా

ప్రస్తుతించెదనూ  ప్రసన్నాంజనేయా


2.భీముడు నీ అనుజుడు కదపలేడు నీ వాలము

మహాబలుడ వీవే మోయగ సంజీవనీ శైలము

ప్రత్యక్ష దైవమా స్వామి  నిను ఎన్నగ జాలము

శరణంటిమి కరుణించగ  నీ ఎదయే విశాలము

నమో సంస్థుతాయ నృసింహాంజనేయా

ప్రభో ప్రపత్తిదాయ పంచాననాంజనేయా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కలవడమే కలైతే ఎలా-

కలకాలం ఇలా'నే బలా

కలయిక కల ఇక యని కలతలు రేపగ

కలభము నైతిని నిను దీనత వేడగ


1.కలవని తలవనా కల'వని తలవనా

కలయో వైష్ణవమాయో యని ఎంచనా

కలగాపులగమాయె చెలఁగిన భావనలు

కలరవమాయేనో కలికి నీ సాంత్వనలు


2.కలవరింతలే రేయీ పగలు

కలకంఠి మాన్పవె నా దిగులు

కలకండ నీ జిలిబిలి పలుకులు

కలబోస్తివి చెలి నీ మిసమిసలు


3.కలవరమే కలిగె నా ఎదలో

కల'వరమే ఔనా ఈ జన్మలో

కలహమా నాతో కలహంస గమన

కలమే నీ పరమై కదిలే ఈ తీరున


PIC courtesy: Radha Mohan Rangu

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సృష్టిలో స్రష్ట చాతుర్య సృజనే అద్భుతం

నా దృష్టిలో నీ శ్రేష్ఠ సౌష్ఠవమే అత్యద్భుతం

అందానికి పరాకాష్ట నీ సౌందర్యం

అదృష్టవంతుడనే నీతో నా సహచర్యం

చెలీ సఖీ ప్రేయసీ ప్రియతమా

నేను నీవుగా మారిన జీవితమా


1.గడ్డిపూవు చాకిరేవు ఇంద్రధనువు అందమే

హిమశిఖరం పిక స్వరం నీలాంబరం అందమే

పొద్దు పొడుపు మెదటి వలపు కలల రేపు అందమే

అలల కడలి నెలజాబిలి చెలికౌగిలి అందమే

కనువిందుచేయగ ప్రకృతి సాంతం అందమే

నందింపజేసెడి జగతియంతా మహదానందమే

చెలీ సఖీ ప్రేయసీ ప్రియతమా

నేను నీవుగా మారిన జీవితమా


2.పద మువ్వలు పసి నవ్వులు గుడిదివ్వెలు  అందమే

నిశి తారలు జలధారలు రుచి కూరలు అందమే

గులాబీలు జిలేబీలు పంటచేలు అందమే

సామవేదం యక్షగానం వేణునాదం అందమే

కనువిందుచేయగ ప్రకృతి సాంతం అందమే

నందింపజేసెడి జగతియంతా మహదానందమే

చెలీ సఖీ ప్రేయసీ ప్రియతమా

నేను నీవుగా మారిన జీవితమా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చెలి మేని బ్యూటీ హైదరాబాదు సిటీ

చెలి పలుకుల స్వీటీ నవ్వుల్లో  నాటీ

భాగ్యనగరమే చెలి తనువుకు నగలా 

విశ్వనగరికి దీటుగా చెలి విశ్వసుందరిగా


1.హెడ్ పై క్రౌనుగా అలరారును చార్మినారు

మకుటాన ఎమరాల్డే భాగ్యలక్ష్మి అమ్మవారు

లాంగైన  హేయిరేమో నల్లని మూసీరివరు

తురిమిన మల్లెపూలే నయాపురానా పూలు

నీ ఐసే ఐమాక్సు నీ లుక్సే మల్టీప్లెక్సు

నీ నోసే ఐనాక్సు నీ చిక్సే ఇనార్బిట్సు


2.కోటీ టూ ఆబీడ్సు జవరాలి కంఠసీమగా

ఎల్బీస్టేడియమే విశాలమైన చెలి ఎదగా

ప్లానిటోరియం బిర్లాటెంపుల్ కొండలే పాలిండ్లుగా

నక్లెస్ రోడ్డే నాజూకైన నడుముకు వడ్డాణంగా

ప్యారడైజే ప్రియురాలి నాభికి తార్కాణంగా

 మెట్రోరైలు ఫ్లయ్యోవరే నూగారుకు నిదర్శనంగా


3.బంజారా జూబ్లీ హిల్సే ప్రియురాలి కోకారైకలు

సాఫ్ట్ వేర్ గుట్టంతా హైటెక్సు గచ్చిబౌడిగా

హ్యాండ్ బ్యాగేమో కృష్ణానగరు ఫిల్మ్ సిటీలు

రామోజీ ఫిల్మ్ సిటీ ప్రేయసి అందాలగొడుగు

హుస్సేను సాగరే చెలి చెమటల మడుగు

ప్రియురాలి సావాసమే ఆశలేవో తొడుగు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అతివైనా దాసోహమె సాటి సుదతి అందానికి

మతినిండా మోహమే అసూయ చెందడానికి

తమకము తీరక అరమరికలు అసలు లేక 

అల్లుకపోతారు లతలై లతాంగులు సుందరాంగులు


1.జలకములాడునపుడు వలువలు దాల్చునపుడు

పరస్పరం సంగమ సంగతుల పరాచికాలాడునపుడు

బిడియము వదిలివేసి,సిగ్గు తెరల తొలగించ

ఎంచలేనంతగా ఒకరినొకరుమించి ఆనందించ

అల్లుకపోతారు లతలై లతాంగులు సుందరాంగులు


2.వావివరుసలేవైనా వయసులు వ్యత్యాసమైన

మనసువిప్పి చెప్పుకొనగ మగువలు స్వతంత్రులు

నెలసరికి ప్రసూతికి మహిళకు మహిళే గురుసదృశంగా

సందేహ నివృత్తిలో సాంత్వన ప్రవృత్తిలో పడతులాదర్శంగా

అల్లుకపోతారు లతలై లతాంగులు సుందరాంగులు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాయలమారి ప్రేమపేర ఒకపోరి

మరుపురాని గురుతుల గోదావరి

యవ్వనమంతా వరదల విరహాలు పారి

చెలి చేజారి విషాద కడలి పంచన నే జేరి


1.గలగలా రావాలు కనుమరుగాయే

స్ఫటికమంటి నీరంతా మురుగాయే

ప్రహాహమిపుడు కదలక మడుగాయే

జ్ఞాపకాల బరువుతో గుండె చెఱువాయే


2.కులాల కుళ్ళుతో కలుషితమాయే

మూఢనమ్మకాలవల్ల కల్మషమాయే

ఏ గొంతు తడుపుటకో ఏరు ఎడారాయే

సర్దుబాటు బాటలో నా కంట గోదారాయే