Friday, May 28, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అభిసారికవో అభినవ రాధికవో

రసమయ నవ గీతికవో మదనుని సుమ వేదికవో

విరహవేదనతొ గుమ్మమానుకొని వేచితివో

మధుర కలయికల ఊహచేసుకొని సైచితివో


1.జాము గడచినా జాడలేని ప్రియుడి చింతన

జాలిమాని ఆ జాబిలేలనో తారకల చెంతన

జన్నమాయే నీ మేని సెగలతో వాడ వేడినొందె

జంగమయ్య జగదంబ మెదల మనసు కలత చెందె


2. మరుమల్లెలే ఉరులోసినా కురులకందమిచ్చె

నీ గాజులే విదిలించినా మంజులమై రవళించే

ఉక్కబోసి తడిసిన రవికె మత్తును మరిపెంచే

జారుతున్న పయ్యెద సైతం జావళీలు ఆలపించె

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంత సొబగు నీది నువు పాలరాతి శిల్పమే

ఎంత సొగసు నీది తూచితే అనల్పమే

ఎదుటికొచ్చి నిలిచిన కవి కల్పనవే

కనులకు మిరుమిట్లుగొలుపు సౌదామినివే


1.ప్రాగ్దిశ గళాన అరుణ స్వరానివే

పూరెక్కన ప్రత్యూషపు తుషారానివే

పూనికతో కూర్చిన మౌక్తిక హారానివే

అయాచితంగ నా కందిన అమరవరానివే


2.అపరాణ్ణమందున పూర్ణ వటచ్ఛాయవే

 మీరిన తపనలకై మలయ సమీరమీవే

బీడును పులకింపజేయు దివిజలధారవే

హాయిగొలుపు పికగానపు పూలకారువే