Friday, June 25, 2021



ఇలా నిర్ణయించావా నా జాతకం

బలిచేయనెంచావా నా జీవితం

ఏ మలుపు తిరిగేనో నీచేత నా కథనం

గాలివాటు పతంగమాయే నా భవితవ్యం

అరవిందాననా తిరుమల శ్రీ రమణ

అడుగంటెనా  స్వామి కడలంత నీ కరుణ


1.నిన్ను అడుగు వాడిలలేడు

నీకు సాటి మొనగాడెవ్వడు

నీనోటి మాటనే ఒక వేదమంత్రం

నీ ఆదేశమే అది రాజ శాసనం

నీదే ఈ సామ్రాజ్యం మా విలువే శూన్యం ఎంత దైన్యం

అరవింద నయన  తిరుమల శ్రీ రమణ

అడుగంటెనా  స్వామి కడలంత నీ కరుణ


2.కంచే చేన్ను కాచకుంటే దిక్కెవ్వరు

రెప్ప తప్పుకుంటుంటే కన్నుకు చుక్కెదురు

రాజుతలుచుకున్నాడంటే దండనే దండన

దైవం కన్నెర్రజేస్తే బ్రతుకు సుడిగుండాన

నీవే దయగాంచు నీవె ఆదరించు నన్నుద్ధరించు

అరవింద చరణ  తిరుమల శ్రీ రమణ

అడుగంటెనా  స్వామి కడలంత నీ కరుణ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చెఱకు గడవు నీవు ఎటుతిన్నా తీయదనమె

ఇంద్ర ధనువు నీవు ఎటుకన్నా ప్రన్నదనమె

వర్ష ఋతువు నీవు పుడమంతా పచ్చదనమె

హేమంత ఉషస్సువు తనువంతా వెచ్చదనమె

కవిలోని చైతన్యము పిక మంజుల గీతము

నీవే నీవే ప్రియతమా నీవే నీవే


1.తెలుగు మాట నీవు అగుపించును తేటదనం

బ్రతుకు బాట నీవు తలపించును నందనం

వలపు తోట నీవు మేను విరుల సవరదనం

ప్రగతి మీట నీవు  నా మనోరథ ప్రచోదనం

కవిలోని చైతన్యము పిక మంజుల గీతము

నీవే నీవే ప్రియతమా నీవే నీవే


2. అంతులేని ప్రేమ నీవు నీతోనే జీవనం

అనవరతం నీ సన్నిధి అపర బృందావనం

ఆహ్లాదము నీ తలపే అది కమ్మని భావనం

అపురూపము మనకలయిక ఇల కడు పావనం

కవిలోని చైతన్యము పిక మంజుల గీతము

నీవే నీవే ప్రియతమా నీవే నీవే