Saturday, December 25, 2010

“మా ’నవ’ కోయిలా!”

“మా ’నవ’ కోయిలా!”

అనుపమా! అభినవ పికమా!
అనుపమా!సార్థక నామధేయమా!!
సరస్వతే నీకు నేస్తము
సంగీతమే నీ సమస్తము

1. కలవరించగా
చేష్టలు నిలువరించగా
హరి నీ హృదయమే హరించీ వరించెగా
నీ సగభాగమై అవతరించగా తరించెగా

సరస్వతే నీకు నేస్తము
గానల’హరి’యే నీ సర్వస్వము

2. జ్ఞాన దాయిని
విజ్ఞాన వాహినీ
మేధావినే తొలుత నీ గర్భాన ఉద్భవించే
సుమేధ్ గా ప్రమోదమై ఆవిర్భవించే

సరస్వతే నీకు నేస్తము
ప్రజ్ఞా ’పాట’వాలే నీ సొంతము

3. వరవీణా మృదుపాణీ
సకల కళాస్వరూపిణీ
శ్రీవాణియే మలి నీ తనువున ఉదయించే
సుస్వరమే సుకృతిగా ప్రభవించే

సరస్వతే నీకు నేస్తము
సుమధుర గాత్రమే నీ అస్త్రము

Friday, December 24, 2010

“ఏదో రాయి”

“ఏదో రాయి”

రాయివై పోయినావా
చెలీ పరాయివై పోయినావా
నట్టనడి సంద్రాన నా బ్రతుకు నావా
ముంచేసినావా-నను వంచించినావా

1. సూదంటురాయిలా ఆకట్టుకొన్నావే
గీటురాయి మీద గీసి నాడి పట్టుకొన్నావే
తూనికరాయితొ మనసును సరితూచుకొన్నావే
కలికితురాయిలా సిగ దాల్చుకొన్నావే

నట్టనడి సంద్రాన నా బ్రతుకు నావా
ముంచేసినావా-నను వంచించినావా

2. కొక్కిరాయిదొంగజపం చేస్తావని అనుకోలేదు
కీచురాయిలా కఠోరంగ రొద చేస్తావనుకోలేదు
కల్తీ సారాయిలాగ ముప్పుతెస్తావనుకోలేదు
ప్రేమ పావురాయి గొంతు నులిమేస్తావనుకోలేదు

నట్టనడి సంద్రాన నా బ్రతుకు నావా
ముంచేసినావా-నను వంచించినావా

Thursday, December 2, 2010

ప్రే-మ-(మ)-ర-ణం

https://youtu.be/Xd_oPljBdLk?feature=shared

రచన :రాఖీ ॥ ప్రే-మ-(మ)-ర-ణం

నీ చెంత నీ మనసు ఉందనీ-కాసింత నాకు చోటుందనీ
తిరిగాను భ్రమరంలా-తికమకగా భ్రమలోనా

ఇవ్వడానికేమీ లేదనీ-నవ్వడానికే నీవనీ
జాలిగ నే చూసానా- జాగు నే చేసానా..

ప్రేమా..ప్రేమా నీవింత కౄరమా..
నిన్ను కోరు కోవడమే నా నేరమా...

1.ఎరుగలేక పోయాను-దొరకని దానికై వెతుకుతున్నానని
తెలుసుకోక పోయాను-కన్నుమిన్ను గానక బతుకుతున్నానని

తొలిచూపులోనే పడిపోయానని-పడిలేచే లోగా కోల్పోయానని
కోల్పోయినదెప్పుడు తిరిగిపొందలేమని-పొందలేని దెప్పుడూ తీయనైనదేనని

ప్రేమా..ప్రేమా నీవింత క్రూరమా..
నిన్ను కోరు కోవడమే నా నేరమా...

2.అయిపోయిన పెళ్ళికినే బాజా వాయిస్తూ-కరిగిపొయిన కలనే కలవరిస్తూ
పగిలిన నా హృదయం అతికించేస్తూ-అతకలేక అంతలోనె అస్తవ్యస్తమనిపిస్తు

చెప్పడానికేమీ..లేనే లేదనీ-లేదనే మాటకూ..అర్థం శూన్యమనీ
శూన్యమనే దున్నప్పుడు లేనిదెలా అవుతుందని-అవ్వాల్సినదెన్నడూ కాక తప్పలేదనీ

తప్పలేని దేదీ తప్పించు కోలేమని-తప్పైనా ఎప్పటికో తప్పదనీ..అయినా అది గొప్పదనీ
ఎరిగిన నామనసే పిచ్చిదనీ-అమాత్రం తెలియకుంటె మరీ వెర్రిదేననీ..నేననీ నీవనీ..లేమనీ

ప్రేమా ప్రేమా ధిక్కారమా..ఇది క్రూరమా..పరిహాసమా..పరితాపమా..
ఇవ్వడానికేమీ లేదనీ-నవ్వడాని కే నీ వ నీ......


Listen to నీ చెంత నీ మనసు ఉందనీ by rakigita9 #np on #SoundCloud
https://soundcloud.com/rakigita9/5thdjjpzpob5

Wednesday, December 1, 2010

“ మరో మొహింజదారో ”

“ మరో మొహింజదారో ”
(చలో ఎక్ బార్ ఫిర్సే అజ్నబీ బంజాయె హమ్ దోనో...స్పూర్థి తో..పల్లవి లో రెండు పంక్తులు)

చెలీ ఒకసారి మనమే -అపరచితులవుదాము ఈ క్షణమే
తప్పులను సవరించ గ’మనమే - జీవితం బృందావనమే

1.మోడువారిన కొమ్మ సైతం- తొలకరికి చిగురించేను
బీడు వారిన నేలసాంతం- చినుకులకు పులకించేను
పడిలేచే కడలి తరంగం-అలుపె‘రుగునా నింగి కోసం
సుడితిరిగే వాగు పయనం-ఆపునా అడ్డుంటె మాత్రం
నేస్తమా..ఎందుకనుమానం-నమ్మికకు ఏది కొలమానం
సహజమే బేధ భావనం-సర్దుకొనగలిగితేనె పూవనం

2.మనసునెరిగి మనలేకుంటే- ప్రత్యక్ష నరక యాతన
అంకింతమై మసల కుంటే- ప్రతిక్షణం తీవ్ర వేదన
నీవు నేను వేరనుకోంటే- వ్యధలన్నిటి కదె మూలం
నీలో లయమైనాను నేస్తం-నిగ్గు తేల్చాలి ఇక కాలం
ఈ స్థితికే నాదే దోషం-చేసుకోనిక నన్ను మోసం
తలను వంచాను నీ ముందు-ఇంతకంటె నేనేమందు