Saturday, January 8, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:హరి కాంభోజి


నెమలికి ఇచ్చావు నాట్యము

పికముకు ఇచ్చావు గాత్రము

పిట్టకు సైతం ఇచ్చావు గ్రాసము

వరముగ ఇచ్చావు వాటికి స్వేచ్ఛా జీవితము

ప్రసాదించావు ముమ్మాటికి ఆనందమయ లోకము

ఏల స్వామీ  నీకు ఏక పక్షము-పక్షివాహనా ఈ పక్షపాతము


1.నరసింహుడవై ప్రహ్లాదుని గాచినావు

రఘురాముడివై హనుమని బ్రోచినావు

ధర శ్రీ కృష్ణుడివై రాధని వలచినావు

శీతకన్ను వేసితివే నాపై వేంకటాచలపతి

నా రాతనిలా రాసితివే తిరుమల శ్రీపతి

ఏల స్వామీ  నీకు ఏక పక్షము-పక్షివాహనా ఈ పక్షపాతము


2.త్యాగరాజు ఒసగినాడ ఏదైనా లంచము

అన్నమయ్య అందించిన దే బహుమానము

నాకైతే మాటలొ పాటలో నీతోడిదె  ప్రపంచము

శిఖరము చేరేంతలొ లోయలోకి తోయాలా

తీరము దాపులొనె నావముంచి వేయాలా

ఏల స్వామీ  నీకు ఏక పక్షము-పక్షివాహనా ఈ పక్షపాతము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నేత్రాల కెంత ఆతృత-అరవిందాలై విప్పారగ

ముంగురులకెంత తొందర-మధుపాలై అధరాల వాలగ

పోతపోసి చేసాడు నిను ఆ విధాత

నువు అపరంజి చందనాల కలబోత

నినుగన్న  కనులకు ఆనందనందనం

నినుగన్న జననికిదే నా అభివందనం


1.చంద్రికయే కొలువుదీరు నీ హాసాన

ఇంద్రధనుసు విరిసేను నీ మేనున

చిలకలు కులుకులీను నీ పలుకుల

అలకనంద స్ఫురించేను నీ నడకల

నినుగన్న  కనులకు ఆనందనందనం

నినుగన్న జననికిదే నా అభివందనం


2.గొంతెండిన దాహార్తికి నీవే చలివేంద్రం

మైత్రీ బంధానికి నువు అనురాగ సంద్రం

ఆదరణతొ అలరించును నీ విశాల హృదయం

నీ చేరువలోనున్నంత గురుతురాదు సమయం

నినుగన్న  కనులకు ఆనందనందనం

నినుగన్న జననికిదే అభివందనం