Friday, October 22, 2021

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:శివరంజని

తిరుమలేశ శరణాగతి నీ దివ్య చరణాలే
మరువలేని అనుభూతి నిన్నుగన్న క్షణాలే
పరసౌఖ్యము నీ సన్నిధి లోనున్న తరుణాలే
వరమీయర హరించగ నాకు జరా మరణాలే
గోవింద గోవింద గోవింద పాహిమాం 
గోవింద గోవింద గోవింద రక్షమాం

1.నీకు తెలుసు నాకు తెలుసు నే చేసిన దోషాలు
ఎరిగెదము ఇరువురము నే వేసిన వేషాలు
మరీచికలు కోరికలు తీర్చుకొనట కెన్నెన్ని మోసాలు
సరిపోవడమిక ఉంటుందా సంపదలు సరసాలు
నా కళ్ళు తెరిపించు గోవింద పాహిమాం
నాదారి మళ్ళించు గోవింద రక్షమాం

2.అవగతమైనట్టే ఉంటుంది నీ జగన్నాటకం
బోధపడినట్టే ఉంటుంది సృష్టే ఒక బూటకం
భలేగా తగిలిస్తావు స్వామి బంధాల పితలాటకం
రుచులకు మరిగేలా వండేవు బ్రతుకు వంటకం
నీ మాయలు చాలించు గోవింద పాహిమాం
నీ మత్తులొ నను ముంచు గోవింద రక్షమాం

 "అంకిత గీతం"


మొండికేసే గుండె ఏనుగుల మావాటి

దిక్కుతోచని నెత్తురు ధారకు మార్గదర్శి

మూసుకున్న  నాడుల తెరిచే నైపుణ్య శిల్పి

పెదవుల మీద నిరతము పారే నవ్వుల జీవఝరి

హృదయపు భాషనెరిగిన డాక్టర్ మన శ్రీధర్ కస్తూరి


1.ఇంటి పేరులోనే కస్తూరి పరిమళం

డాక్టర్ శ్రీధరంటేనే ఆత్మీయ ప్రతిరూపం

వృత్తిలో ప్రవృత్తిలో మానవీయ దృక్పథం

వాణిజ్య కోణమెలేని నిలువెత్తు నిజ వైద్యం

పెదవుల మీద నిరతము పారే నవ్వుల జీవఝరి

హృదయపు భాషనెరిగిన డాక్టర్ మన శ్రీధర్ కస్తూరి


2.వృత్తినే దైవంగా భావించే నిబద్ధత

పేషంట్లే బంధువులనుకొను హృదయవైశాల్యత

సవాళ్ళనే అలవోకగ గైకొనే కార్యదక్షత

వ్యక్తిగా వైద్యునిగా జీవన సాఫల్యత

పెదవుల మీద నిరతము పారే నవ్వుల జీవఝరి

హృదయపు భాషనెరిగిన డాక్టర్ మన శ్రీధర్ కస్తూరి


3.తలిదండ్రుల పుణ్యాల పంటగా జన్మించాడు

దశదిశలా ధర్మపురి కీర్తి నినుమడించినాడు

కుటుంబ బాధ్యతలన్ని బహుచక్కగ నెరవేర్చాడు

హృద్రోగనిపుణుడిగా విశ్వవిఖ్యాతి నొందినాడు

పెదవుల మీద నిరతము పారే నవ్వుల జీవఝరి

హృదయపు భాషనెరిగిన డాక్టర్ మన శ్రీధర్ కస్తూరి