Thursday, December 13, 2018

కళ్యాణి రేవతి మధ్యమావతి
ఏరాగమైతేమి నీ దివ్యగీతి
మోహనము  వలజి తోడి
నిన్ను గానాభిషేకాల కొలిచి
తరియించెదము  మారుతి
నీ ధ్యానమున మేనుమరచి

అభయాంజనేయా శుభ హారతి
ప్రసన్నాంజనేయా ప్రియ హారతి
వీరాంజనేయా జయ హారతి
భక్తాంజనేయా మంగళ హారతి

1.మా భాగ్యనగరాన దయ మీరుపేటన
సుఖశాంతులకు తావైన ప్రశాంతి మలన
నెలకొని యున్నావు కనికరముతోడ
పిలిచినంతనే బదులు పలికేటి వాడ

అభయాంజనేయా శుభ హారతి
ప్రసన్నాంజనేయా ప్రియ హారతి
వీరాంజనేయా జయ హారతి
భక్తాంజనేయా మంగళ హారతి

2.ఉరుకుపరుగుల జరుగు మా జీవితాన
పాపపుణ్యము మరచు ప్రజల పక్షాన
కల్పవృక్షమువోలె  మమ్మాదుకుంటావు
అభయహస్తముతోడ కాపాడుతుంటావు

అభయాంజనేయా శుభ హారతి
ప్రసన్నాంజనేయా ప్రియ హారతి
వీరాంజనేయా జయ హారతి
భక్తాంజనేయా మంగళ హారతి

3.నోములు వ్రతములకు తావు నీకోవెల
పండుగలు పర్వాల నెలవు నీ సన్నిధి
భక్తి తత్వము మాలొ ఉప్పొంగునట్లుగా
ఆయత్తపరచుము అనుదినము మమ్ము

అభయాంజనేయా శుభ హారతి
ప్రసన్నాంజనేయా ప్రియ హారతి
వీరాంజనేయా జయ హారతి
భక్తాంజనేయా మంగళ హారతి
వేదనా బాధలూ అనాధలు
ఎవరైనాఏవగించుకొనే గాధలు
నేనాదరించుతానని-అక్కునజేర్చుకుంటానని
నా పంచన చేరాయి-ప్రపంచమింక మించి
నన్నల్లుకపోయాయి-నా ప్రేమనాశించి

1.తానుకూడ దూరింది దురదృష్టము
తోడువీడలేకుంది అనారోగ్యము
కన్నీటి వానలతో ఇల్లంతా వరదలు
విధిరేపే జ్వాలలతో గుండెల్లో మంటలు
అగ్ని నీరు చిత్రంగా నా కడనేస్తాలు
పరస్పర ప్రేరణతో ఇనుమడించు కష్టాలు

2.జన్మహక్కు తనదంటూ ఆక్రమించె దరిద్రము
ప్రతిపనిలో తలదూర్చకమానదు అవమానము
ప్రయత్నాన్ని పరిహసించు ఆదిలోనె అపజయము
అనునిత్యం తలుపుతట్టు అలసిపోక పిరికి తనము
బెదిరిపోదు చెదిరిపోదు బ్రతుకు పట్ల నమ్మకము
ఏశక్తీ హరియించదు చిరంజీవి ఆనందము-నా ఆనందము

తరగని గని నీ అందం
ఆమని వని అలరారు చందం
విరిసిన విరి మకరందం
వలపన్నును వలపుల బంధం

1.కోయిల  ఇల గానపు వైనమై
చిలుకల కల తెలిపే చిత్రమై
పురివిప్పిన మయూరి నృత్యమై
కలహంసల కదలికల కల వయారమై
ఎదన దించినావే మదన శరములు
కలను చెలగు మరువని కలవరములు

2.నీ మేను  హరివిల్లుకు ఈర్ష్యగా
నీ హొయలే ఖజురహో మార్గదర్శిగా
నీ కన్నులు వెన్నెల పుట్టిల్లుగా
నీ నవ్వులు ముత్యాల విలాసంగా
ఇంద్రజాలమే చేసి బంధించుతావు
చంద్రతాపమే రేపి పొందీయరావు