Wednesday, April 29, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

(సినిమా కోసం వాడుకోవచ్చు-రచయిత అనుమతితో)

కాటుక మురిసిపోతున్నది
నీ కళ్ళతో జతపడి సార్థకమైనందుకు
తిలకం గర్వమొందుతున్నది
నీ నుదుటన మెరిసిపోతున్నందుకు

ముంగురుల భ్రమరాలే భ్రమిసిపోతున్నాయి
నీ వదన కమలాన్ని ముద్దాడినందుకు
చిరునవ్వుల మల్లియలే ముదమొందుతున్నాయి
నీ పెదవుల నలరించినందుకు

నాదెంత అదృష్టమో నెచ్చెలీ
నీతో సావాసమున్నందుకూ
అనుబంధం పెనవేసినందుకూ

1.పరవశించి పోతున్నది గానము
నువు గాత్ర మాధురిని అద్దుతున్నందుకూ
పలవరించుతున్నది ప్రౌఢ పికము
నీ పాటే మాదిరిగా దిద్దుతున్నందుకూ
నాదెంత అదృష్టమో నెచ్చెలీ
నీతో సావాసమున్నందుకూ
నీ గీత మకరందం గ్రోలుతున్నందుకూ

2.తృప్తిపడుతున్నది భారతీయము
కట్టుబొట్టులో ప్రతీకవే నీవైనందుకూ
చాటిచెప్పుతున్నది మనదైన తెలుగుదనము
సాంప్రదాయ బద్ధమైన నీ నడతకూ
నాదెంత అదృష్టమో నెచ్చెలీ
నీతో సావాసమున్నందుకూ
నూరేళ్ళూ ముడివడి ఉన్నందుకూ
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అంటే అంటావుగాని
ఆ కొంటె చూపులెందుకంటా
తిడితే తిట్టావుగానీ
ఆ చిలిపి నవ్వులెవరికంటా
ఆకంటా ఈకంటా నువు పడకుంట
నిన్ను దాపెట్టగ నా కెంతటిదో ఈ తంటా

1. కళ్ళేమో బెల్లాలు నోరూరే తాయిలాలు
ఎదకవి గొళ్ళాలు ఎర వేసిన గాలాలు
పోరే పెడుతున్నాయి మిగిలిన నీఅందాలు
కురులు కెంపుల చెంపలు ఊరించే పెదాలు
రెప్పవాల్చలేని తిప్పలు నాకెన్నో
చెప్పనలవి కాని గొప్పలు నీకెన్నో

2.కచ్చ తీర్చుకోనేల రెచ్చగొడుతు నన్ను
అలసిపోతుందే చూస్తూనె ఉంటె నా కన్ను
ఋజువన్నది లేకుండా చంపగలవె నువ్వు
కత్తికన్న పదునే పరువాలు చిలుకు నీ తనువు
ఛస్తే మాత్రమేమి నిన్నే పొందగా
బ్రతికొస్తా పదేపదే అందాలనందగా