Thursday, March 29, 2018


గెలుపు వైపే సాగుదాం
మలుపులెన్నో దాటుదాం
అలుపు లేకా సొలుపు లేకా
గమ్యమికపై చేరుదాం
గగనమైనగాని తాకుదాం

1.విజయమెపుడు తేరగా నీ ఒళ్ళొవచ్చి వాలదు
కలుపుకున్న ముద్ద సైతం తనకు తానై నోటికందదు
కృషితొనాస్తి దుర్భిక్షమన్నది నాటి నుండి నానుడి
సమయాన్నికపై ఒడిసిపట్టు
మచ్చికగు నీ ఒరవడి

2.విలాసజీవిత మెప్పుడో తను కాక తప్పదు నీకు సొంతం
విద్యార్థిదశలో అనుభవిస్తే
విచారమే ఇక బ్రతుకు సాంతం
లక్ష్యసాధన దృష్టి మరల్చక
కొట్టగలిగెదవెట్టి ఉట్టి
నెగ్గగలవు ప్రతి సవాలు
నిబ్బరముతో జట్టుకట్టి


మండే ఎడారుల్లో ఎండేటి గొంతులకెదురయ్యే ఒయాసిస్సులాగా
నా సేదదీర్చావు నన్నాదరించావు శరణంటు నినువేడగానే స్వామీ  నినువేడగానే

1.తెఱచాప చిఱిగి చుక్కాని విరిగి  సుడిలోన అల్లాడు నావలా
ఏ తోడులేక ఏకాకిలాగా బెంబేలు పడుతున్న వేళ
నువుదారి చూపి నారేవు చేర్చి గండాలు దాటించినావే నను గట్టుఎక్కించినావే
నానేస్తమైనావు నా ఆత్మవైనావు శరణంటు నిను వేడగానే స్వామీ నినువేడగానే

2.చెలరేగుతున్న దావానలం కూడ దహియించ లేదు నువు దయచూస్తే
గాఢాంధకారాలు పటాపంచలయ్యి విరిసేను జాబిల్లి నువు కరుణిస్తే
మోళ్ళైన చిగురించు బీళ్ళైన పులకించు నువు ప్రేమజల్లే కురిపించగానే
ననుగన్నతండ్రివలే ఉద్ధరించు గురువల్లే చేయి పట్టి నడిపించినావు తిమిరాలు పరిమార్చినావు

3.భవబంధమేది బంధించకుండా సంసార సంద్రం నను ముంచకుండా
ఏఈతి బాధలు బాధించకుండా ఏమోహ మాయలో నేచిక్కకుండా
ఎదిరించు ధైర్యం నాలోన పెంచు నువ్వున్న దిక్కు నన్నింక నడుపు నువ్వే ఏకైక దిక్కు
దిక్సూచిలాగా ధృవతారలాగా సన్మార్గమిక నాకు చూపు  సారించు నాపై నీ చూపు

Wednesday, March 28, 2018

🌳🦋🌹విలంబి ఉగాది    💐💐💐💐💐శుభాకాంక్షలు🌹🦋🌳


రచన:రాఖీ,గానం:S.నరేంద్ర శర్మ

మామిడి కొమ్మమీద
కొలువైంది కోయిలమ్మా.
కిసలయముల రుచినే గ్రోలే
ఈ పాటలమ్మా

1.ఉగాదికే స్వాగతమంటూ
హుషారుగా రాగం తీసీ
మధురమైన తన గాత్రంతో
ఆహ్లాదపు జల్లులు కురిసీ
జగములోని జనులందరికీ తరగని ఆనందం పంచే

2.వనమంతా పూవూ పూవూ
వసంతపు విలాసమైంది
చిత్రమైన ప్రకృతి కాంత హరితవర్ణ వికాసమైంది
చిరుగాలి విరితావిని పంచీ
నేస్తమల్లె అలరించింది.

3.ఆరు రుచుల అంతరార్థమే
జీవిత పరమార్థం నేస్తం
నీ కృషినే నమ్ముకుంటే
సహకరించు నీ గ్రహచారం
సాధనతో సఫలీకృతమౌ
ఉన్నతమగు నీ ఆశయము


Listen to మామిడి కొమ్మ మీద by rakigita9 #np on #SoundCloud

వేడుక చూస్తున్నావా
వేదనలిస్తున్నావా
వేడిననూ మొరవినవా
వేంకట రమణా బిగువా

1.నీలా ఎవరిల లేరనీ
తలనీలా లిత్తురు నీకు
నీల మేఘశ్యామా
నిర్లక్ష్యము తగదిక స్వామీ

2.కోరినదీయవు మానే
అడగని వెతలిచ్చెదవేల
లంపటముల తగిలించీ
ఇగిలించెదవేల స్వామీ

3.ఏడుకొండలూ నడిచీ
ఎక్కెదరెందుకు వగర్చీ
నువు పిల్లాపాపల కాచే
దయగలతండ్రిగ ఎంచీ

Thursday, March 22, 2018

ప్రేమైక లోకంలో 
అరవిరిసే అందాలు అనుబంధాలు ఆనందాలు
అరవింద నందనంలో 
మది మురిసే చందాలు సుమగంధాలు మకరందాలు

కాలమనే పళ్ళెం లో ఋతువులన్నీమారు 
నోరూరు రుచులు షడ్రుచులు అభిరుచులు
ఆమని కమ్మని మామిడి కిసలయ కలవడు 
కోయిల కూజిత మకరందాలు

వేసవి ఎండలు గ్రీష్మపు తపనలు మాడ్చే 
వడగాడ్పలు ప్రతీకారా కారాలు
తీరే దాహాల తీరులు స్వేదాలనార్పే 
పవన ఓదార్పులుమజ్జిగ నీళ్ళు మకరందాలు

ఉరుములు మెరుపులు మేఘ వర్షాలు 
మట్టి హర్షాలు లవణమిళిత సెలయేరులు
వడగళ్ళు నాగళ్ళు పల్లెటూళ్ళు 
పురివిప్పి నర్తించే నెమళ్ళు కాకక్క పెళ్ళిళ్ళు
 
తారల చెలియలు వెన్నెల చెలిమెలు 
చెలియతొ ఏకాంతాలు నిశాంతాలు
శరదృతుమత్తులు మన్మధ గమ్మత్తులు 
అగరొత్తులు వగరు పెదవి మకరందాలు

వింతలు కవ్వింతలు ఇంతని లేని 
ఇంతుల కాంతుల పలు చింతలు
హేమంత కౌగిలింతల వలపు పులుపు 
గెలుపు పందాల మకరందాలు

లేని రాని రాలేని రాయలేని అనుభూతులు 
తీరని విరహ శిశిర పత్రాలు
వసంతాలు ఆసాంతాలు ఆకాంక్షల చేవ్రాలు
వేదనలు మరి'చేదే మకరందాలు

Friday, March 9, 2018

దయగనరా నను నరహరి బిరబిర
కరుణను బ్రోవర శ్రీహరి వేగిర
ధర్మపురీశా ధర నిజ భక్తపోషా
ప్రహ్లాద వరదా ఆర్తత్రాణ బిరుదా

1.ఊహ తెలిసినాడే ఊరి దేవుడవంచు
శేషప్ప పద్యాల నీ గుణగణముల వినుచు
పొద్దూమాపు నిను దరిశించుకొంటూ
నిను నెఱనమ్మితి ననుగాతువంటూ

2.ఏ సుఖములు బడసె నీదాసులు
ఎపు డానందించిరి నీ సిసువులు
బ్రతుకంతా నిను బ్రతిమాలుకొనుడే
మతిమాలి గతిలేక నిను స్తుతించుడే

3.నీ మైమలు మాకూకదంపుడే
నీ లీలలు ఇల పుక్కిటి గాథలే
ఋజువు పరచుకో ఇక నీ ఉనికిని
స్పష్టపరచు స్వామీ కలవని కలవుకావని
రాతి గుండె నాతి
ఎరుగలేము నీ రీతి
కవ్వింతలు నీకాన వాయితి
చితి పేర్చుటే పరిపాటి

1.చిరునవ్వుకె దాసులై
కరస్పర్శకె బానిసలై
చూపులవలచిక్కి చేపలై
ఆకర్షణజ్వాలన శలభాలై
బలిచేసుకునే అర్భకులు
ఈ పురుష పుంగవులు

2.స్నేహ మనే మాయలో
ప్రేమయనెడి భ్రమలో
తడిలేని వింతబంధాలలో
వృధా క్షణికా నందాలలో
కాలంమంత కరగదీయు మగవారు
బ్రతుకంత వేదనలో మునుగుతారు

3.ఏ చరిత్ర చూసినా
భామా బాధితులే
దేవదాసు మజ్నూలు
వనితోపహతులే
లేమయన్నదెవ్వరీ శిలాహృదయను
నఖశిఖపర్యంతము కనలేము దయను
విద్దెల తల్లి ఓ పాలవెల్లి
ముద్దు సేయవే నను వద్దనక
నీ బాలుడనే పలుకుల నెలత
నను దయగనవే గొనవే చేజోత

1.మదిలో మెదిలిన సుద్దులనన్ని-ఒద్దికగా నుడివించవే
మతిలో చెలగెడి చింతనలన్ని-సుగతినెప్పుడు నడిపించవే
పెదవులు దాటెడి పదముల-నొడుపుగ సడిసేయవే
తలపుకు మాటకు పొంతన నెఱపి-తెఱకువ నీయవె

2.తేనియలొలికే సుతినే-స్వరమున వరమీయవే
నయమును గూర్చెడి అనునయ బాసను-దయసేయవే
చెవులకు చవులూరు నాదము గొంతున-వెలయించవే
కవితా పాటా పాటవమున-నొప్పారగా దీవించవే

Friday, March 2, 2018



శారదా...కవన గాన జ్ఞానదా
స్మరియింతును మదినిను సదా సర్వదా

1.అర్దశతయుత షడక్షర సమన్విత
ఆంధ్ర వాఙ్మయ విభూషిత
గణిత విజ్ఞాన తర్క విరాజిత
అభ్యసింతునిను అనవరతముగా

2.షడ్జమ రిషభ గాంధార
మధ్యమ పంచమ ధైవతనిషాద
సప్తస్వర వర సంగీత సమ్మోహిత
సాధనజేతునే నిరవధికముగా