Wednesday, March 16, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తలుపులు మూయగలవేమో-తలపుల చొరబడ అడ్డేది

కలవగ వాలాయించెదవేమో - కలలో కలయికెలా చెడేది

ఊపిరిలో ఊపిరినౌతా - ఎదచేసే సవ్వడినౌతా

తప్పుకోగలవా నానుండి - తప్పనిసరే నాతో నీముడి


1.మెడకు పడిన పామైనా కరవకుండునేమో

అడుగు పెడితె ముల్లైనా గుచ్చకుండునేమో

పసుపు తాడునై నీతో జతపడి పోతా

నుదుట కుంకుమనై నేనతుకు పడతా

మనసులో భావమవుతా మాటలో స్పష్టమవుతా

తప్పుకోగలవా నానుండి - తప్పనిసరే నాతో నీముడి


2.నీడైనా ఎపుడైనా నిను వీడిపోవునేమో

నీవైనా ఎన్నడైనా నీ ఆజ్ఞ మీరుదువేమో

తనువు చాలించినా నిను వదలని తోడౌతా

నువు గీచిన గీతనెపుడూ దాటని నీ దాసుడనౌతా

పెదవి మీద నవ్వునౌతా పదముల సిరిమువ్వ నౌతా

తప్పుకోగలవా నానుండి - తప్పనిసరే నాతో నీముడి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ సొమ్మేం జారిపోతుంది 

ఒక్కసారి నాకు నువ్వు హాయ్ చెప్పితే

నీ సోకేం కరిగిపోతుంది 

గుడ్ మార్నింగంటూ పలకరించితే

గజ గమనా ఘనజఘనా నీకిది తగునా

లలనా  మనగలనా నిముషమైన నువు వినా


1.నా అంతట నేనుగా కుదుపాలి నిన్ను

కవితగా నిను మలచగ కదపాలి పెన్ను

పొలమారునట్లుగా తలచాలి నిన్ను ప్రతిపొద్దు

కలనెరవేరేట్లుగా దాటవేల నువ్వు ప్రతి హద్దు

గజ గమనా ఘనజఘనా నీవేలే నా మనమున

లలనా  మనగలనా నిముషమైన నువు వినా


2.గాజుముక్కలే పూలరెక్కలు నీ చూపుల కన్నా

గండశిల సైతం అతిసున్నితం నీ కరకు గుండెకన్నా

నావైపుగా ఆరాటమెంత ఉంటే ఏం ప్రయోజనం

అర్పించినా కరుణించవాయే హృదయ నీరాజనం

గజ గమనా ఘనజఘనా నువ్వే లేక నే కవినా

లలనా  మనగలనా నిముషమైన నువు వినా

 రచన,స్వరకల్పన&గానం: డా.రాఖీ


ఇమ్మని అడుగలేదు ఏనిధిని-ఇస్తే చాలు సాయీ విబూదిని

కోరానా షిరిడీలో నీ సన్నిధిని-తొలగిస్తే మేలు నా దీర్ఘవ్యాధిని

చాలించు ఏకాదశ సూత్ర సోదిని-పరిమార్చు చిరకాల మనాదిని

పట్టించుకోనప్పుడు సాయిబాబా మరి తిట్టించుకొనగ నువ్వు సిద్దపడు


1.గొప్పలకేం కొదవలేదు సన్యాసివైనా

ఘనతకేం తక్కువని అవధూతవైనా

నీ గురించే నీ ధ్యాస చూడవేల మా దెస

ఎందరినినో బాగు చేసావే నాపై సీతకన్ను వేసావే

పట్టించుకోనప్పుడు సాయిబాబా మరి తిట్టించుకొనగ నువ్వు సిద్దపడు


2.మహిమలంటు ఉన్నాయా నిజముగనీకు

లీలలు చూపావంటే  నమ్మశక్యమా నాకు

కనికట్టులు చేసావు గారడీలు చూపావు

వందిమాగధులతో వింతగు ప్రచారాలు నెరిపావు

పట్టించుకోనప్పుడు సాయిబాబా మరి తిట్టించుకొనగ నువ్వు సిద్దపడు