Monday, May 31, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గండుకోయిలే తలదించుతుంది

నిండుగ నువు పాడుతుంటె

పారిజాతమే ఇలరాలుతుంది

పరవశాన నువు నవ్వుతుంటె

 ప్రియా గానమే ప్రాణము నీకు నాకు

కలిసి చనెడి దొక మార్గమే ఇరువురకు


1.ఇలవంక వచ్చినారు నారదతుంబురులు

నీ కడ పాటనేర్చేందుకు

నీకొరకే వెతుకుతున్నారు దేవ గంధర్వులు

నిను గురువుగ ఎంచుతూ

కఛ్ఛపి వీణియకున్న జతులు గతులు నీవి

అనాలంబ మధురిమలా నీ గాత్రపు నెత్తావి


2.తరియించగ నీగాన లహరే అల ఆకాశ గంగయై

నను పావన మొనరించు

ఎలుగెత్తిన నీ గళ రావమే కడు ఉత్తేజభరితమై

నను ఉరకలు వేయించు

సాటిరారు భువినెవ్వరు నీసరితూగ

సంగీతపు చిరునామా ఎప్పటికీ నీవవగ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నెత్తిమీద శివ గంగ నీకంట

ఎత్తిపోతల శోకంగ నా కంట

నివురు గప్పి ఉండె నీ నుదుటి కంటి మంట

ఎగసిపడుతున్న గుండె మంటతొ మేమంట

చిక్కని చిక్కుతొ మిక్కిలి తంట విధిరాతంట

త్వమేవాహం త్వమేవాహం  శివోహమేనంట


1.చంద్ర వంకనీకు అలంకారము

బ్రతుకు వంక నాకు బాధాకరము

గొంతైతే దిగకుంది నీకు కాలకూటము

ఒళ్ళంత పాకింది విషము నాకెంత కష్టము

చిక్కని చిక్కుతొ మిక్కిలి తంట విధిరాతంట

త్వమేవాహం త్వమేవాహం  శివోహమేనంట


2.మరుభూమే నువు మసలేటి స్థానము

మా ఇల్లు సైతం వల్లకాడుతో సమానము

బొచ్చె గలిగియున్న  బిచ్చగాడివి నీవాయే

తెరిచిన జోలెతొ వరములడగుతూ నేనాయే

చిక్కని చిక్కుతొ మిక్కిలి తంట విధిరాతంట

త్వమేవాహం త్వమేవాహం  శివోహమేనంట

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తరగని గని ప్రియా నీ అందం

నవరత్నాలకు అది భాండారం

నా వెంటే నీవుంటే జీవితాంతం

కొదవనేది ఉండనే ఉండదు సాంతం


1.ఇంద్రనీల మణులే కనులు

కెంపులు నీ ఇంపైన చెంపలు

పగడాలే  అరుణాధరాలు

పలువరుసే ముత్యాల పేరు

పలుకుల్లో రతనాలు రాలు


2.వజ్రమే కమనీయ కంఠము

మరకతమే  బిగుతు పేరణము

పుష్యరాగమే నీ కౌశేయము

గోమేధికమే నీ మధ్యవృత్తము

వైఢూర్యమే ప్రియా నీ మేనిఛాయ