Friday, June 18, 2021

 రెచ్చగొట్టగలుగుతుంది పుట్టుమచ్చ సైతం

పిచ్చి పిచ్చి ప్రేమలకు పచ్చబొట్టె ఊతం

వలవేసిపడుతుంది క్రీగంటి ఆలోకితం

వలపుల ముడివేస్తుంది అధరస్మితం


1.కొండలకెగ బ్రాకుతుంది కొంటెచూపు జలపాతం

మంటలనెగదోస్తుంది నడుం ముడత నవనీతం

స్వేదమునే రేపుతుంది నూగారు హిమపాతం

వడగళ్ళలొ మునుగుతుంది ఎద ఎడారి ప్రాంతం


2.అహ్వానం పలుకుతుంది పంటినొక్కు శుకము

ఆదరించ పూనుతుంది  చుంబన కపోతము

అక్కున జేర్చుతుంది ప్రియ లాలన శకుంతము

ఆలపించి మురిపించును అనుభూతి పికము




https://youtu.be/TToQMJitRkQ?si=HFLFPvGIqKKF0T78

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అశనిపాతమై విషాద గీతమై

ఆనందపు ఛాయేలేని జీవితమై

అడుగడుగూ అపార దుఃఖభరితమై

ఇదేనా నీ ప్రసాదము ఇంతేనా జన్మాంతము

శిలవైన నీకేంతెలుసు వేంకటేశ్వరా

పీడ కలలాంటి బ్రతుకంటే జగదీశ్వరా


1.జగత్పితవు నీవంటారే నేనే అనాథనా

జగన్నాథ నీవంటూ ఉంటే జనులకింత వ్యథనా

తప్పుచేస్తె దండించాలి స్వప్నాలు పండించాలి

దారితప్పు వేళల్లో చేయపట్టి నడిపించాలి

శిలవైన నీకేంతెలుసు వేంకటేశ్వరా

పీడ కలలాంటి బ్రతుకంటే జగదీశ్వరా


2.మా ప్రమేయమెంత ఉంది  మా మనుగడలో

మా ప్రతాపమేముంది మా గెలుపులలో

గడిచినంత గడిచింది కాలమంత కష్టాల్లో

ఇకనైనా మననీయి నీ చల్లని కనుసన్నలలో

శిలవైన నీకేంతెలుసు వేంకటేశ్వరా

పీడ కలలాంటి బ్రతుకంటే జగదీశ్వరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక కవిత నాలో మెదిలింది

కలంతో జత కలిపింది

ఎదలోతు భావాలనే  వెలికి తీసింది

ఒద్దకగా అల్లుకుంటూ అందంగా వెలిసింది


1.అచ్చరువునొందేలా అచ్చరాలు కూర్చింది

ఇంద్రజాలమేదోచేసి పదాలుగా మార్చింది

మనసుల నలరించేలా పరిమళాల నద్దింది

గేయమై రూపుదాల్చి హృదయాలు గెలిచింది


2.అలతి అలతి నడకలతో అడుగులేసింది

చిరునవ్వు చెదరకుండా నుడుగులే పలికింది

ఆహ్లాదం రంగరించి అనుభూతులిచ్చింది

మరవలేని జ్ఞాపకమై మదిలోన దాగుంది