Friday, June 28, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సాకి:
అంతర్యామి
సర్వాంతర్యామి
నీకు నాకు ఇక భేదమేమి..

పల్లవి:
నా ఊపిరి జపమాలా
ఉఛ్వాసనిశ్వాస నీ స్మరణా..
నా తనువూ నా మనసూ నీకే సమర్పణా


1.ప్రతి కార్యం నీ సేవ
నా నడకలు నీ త్రోవ
నా మదిలో నీరూపం
నా ప్రాణమే నీ దీపం ..

2.అశ్రువులే అభిషేకం
ప్రతిపలుకూ నీ శ్లోకం
నా మౌనం నీ ధ్యానం
నా జీవితం నైవేద్యం..
అతిలోకసుందరీ గతినీవె సౌందర్యానికి
జగతి నీకు దాసోహం నీ సౌకుమార్యానికీ
మతి భ్రమించి పోయిందేమో ఆబ్రహ్మకు
నీ సృజనచేసి చేతులెత్తినాడమ్మా ఈజన్మకు

1.ముంగురులకు ఎంత తొందరో-చెంపల చుంబనానికై
ముక్కపుడక కేమి ఆత్రమో-తళుక్కున మెరవడానికై
పలువరుస తలపోస్తోంది నగవుల నగ అవడం కొరకై
నొక్కుబడిన చుబుకం సైతం ఉబలాటపడతోంది తను మెప్పుకై
నేరేడు పళ్ళకళ్ళతొ పోటీకి సాధ్యమౌనా అందమైనవెన్నున్నా
కనికట్టు చేసే కళ్ళను దాటగలుగు ధీరులెవ్వరు భూనభోంతరాలలోనా

2నయనభాష నేర్చుకుంటే ప్రబంధాలు తెలిసొచ్చేను
చూపులనే  గ్రోలగలిగితే మధిరలాగ మత్తెక్కేను
అల్లార్పని రెప్పల్లో సందేశాలెన్నెన్నో
ఆసోగ కాటుకలో రవివర్మ చిత్రాలెన్నో
వర్ణించనాతరమా చూపులే ఆపుతుంటే నాకలమును
తప్పుకోనునా వశమా కన్నుల్లో ఖైదుచేస్తే నా బ్రతుకును
కన్నుల్లో కరకుదనం
అధరాల్లో చెఱకుదనం
వదనంలో నందనం
ఎదలో ఆరాధనం
అందాల నాచెలీ నీకు వందనం
ప్రణయాల నాసఖీ నీకు చందనం

1.ముట్టబోతె నిప్పులా కాల్చుతుంటావు
పట్టబోతె పాములా బుస్సుమంటావు
కస్సుబుస్సు లన్నీ పైపైనే
మరులుగొనుడు మాత్రం నాపైనే
కలలోకి వస్తావు కవ్విస్తుఉంటావు
కనిపించినంతనే నువుతప్పుకుంటావు

2.ఊరించుడెందుకో
ఉబుసుపోకనా
ఉడికించుడెందుకు
బొమ్మలాటనా
మనసువిప్పి చెప్పవే నీ ప్రేమని
బాసచేయవే చెలి కలిసుందామని
చితిచేరునందాక నాచేయివీడనని
మృతిలోనసైతం నీవాడనేనని

చురకత్తుల చూపులదానా
మది మత్తగు వలపుల జాణ
పరిచయమైతివె పరువాన
నీ సోపతిలో  మల్లెల వాన

1.మంచి గంధమంటే నీ సామీప్యము
మలయపవన మంటే నీ సహచర్యము
వెన్నెలరేయి హాయి నీకన్నులలో
ఉషస్సులో కువకువలే నీ పలుకులలో

2.నీలి మేఘాలే నీ కురుల సోయగాన
మంజీరనాదాలే వయ్యారి నడకలలోన
సంతూర్ రావాలె గాజుల సవ్వడిలోన
మ్రోగించ గలిగేలా నీమేనే రసవీణ
గుండెకు గొంతుకు సంధికూర్చుతూ
కవి భావనకే వంతపాడుతూ
పాడాలి ప్రతి పాట తన్మయ మొందుతూ
శిలలైన కరగాలి పరవశమెందుతూ
పాడవే అభినవ కోయిలా
పాటకే బాటగా సన్నాయిలా
సవరించుకోవాలి శ్రుతినిను చూసి
లయనేర్చుకోవాలి కలయగ జూసి

1.పికమున కొకటే వసంతము
ప్రతిఋతువు కావాలి నీసొంతము
గ్రీష్మము నేర్పగ ఎదతాపము
ఆర్తిగ పలకాలి నీ గాత్రము

వర్ష ఋతువులో మేఘగర్జనే
మేల్కొలపాలి ఉద్రేకము
శరశ్చంద్రికలె కలకలము రేప
ఊరేగాలి రసజగము

హేమంతకాంత చేరగ చెంత
పారిపోవాలి శీతలము
శిశిరము తరహా విరహము సైచగ
మది మురియపూయాలి పూవనము

2.జలపాత హోరున సంగీతము
నదికదలికలో మృదునాదము
కడలి అలలలో కమనీయ రవము
చిరుగాలి సవ్వడిలొ మధుగీతము

వెదురు గాయాల  సుధాగానము
మువ్వల యాతన కడుశ్రావ్యము
గళము పెగిలితే రసరమ్యము
ప్రేగు అదిలితే శ్రవణపేయము

పెదవులు ఆడితె పైపైన పలికితె
గానమెంతో పేలవము
మేను మరచి నాభినుండి
పాడితేనే పాటవము
ఇహము దేహము మీరునటుల
తల్లీనమైనదే కదా గానము