Friday, July 17, 2020


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అందమంటే నీలా ఉంటుందా
అందమంటే అందనంటూ పందెం వేస్తుందా
అందలం ఎక్కిస్తాను అందుబాటులో ఉంటే
అందరికీ చెప్పేస్తాను బంధం పెనవేస్తానంటే

1.అందెలు నీపాదాల సుందరంగ అమరాయి
చిందులు వేస్తుంటే గుండెలెన్నొ అదిరాయి
కందిపోతాయేమో  సుకుమారం నీ అరికాళ్ళు
అందనీయవే నాకు నీ సొగసులు సోయగాలు

2.అరవిందాలే చెలీ సంకెళ్ళువేసే సోగకళ్ళు
మకరందాలే సఖీ నీళ్ళూరించే నీ మోవిపళ్ళు
ఏ డెందమైనా మందిరమయ్యేను దేవి నీవుగా
ఆనందనందనమే జీవితమంతా నీతొ మనువుగా

(చిత్రం కవితకు ప్రేరణ,ఆలంబన మాత్రమే-వ్యక్తిగతమైన ఏ సంబంధం ఈ గీతానికి చెందని గమనించ ప్రార్థన)
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పట్టించుకోకుంటె పరితాపం
పట్టిపట్టి చూసామా ఎంత కోపం
అందాలన్ని ఆరబోసే ఆ వైనం
కనువిందనుకొన్నామా సంస్కార హీనం
ప్రాణాలు తోడేసే  విషకన్యలు
శవాలకూ జీవం పోసే అమృతగుళికలు

1.అల్లార్పే కన్నులు బుగ్గన సొట్టలు చుబుకం నొక్కులు
క్రీగంటి చూపులు మునిపంటినొక్కులు అన్నీచిక్కులు
మామూలు బాణమైన ఛేదించగలిగేను హృదయము
దివ్యాస్త్రాలైతేనో నిలువెల్లా దహియించు తథ్యము
అత్తిపత్తులే నత్తగుల్లలే అతివలు అందని ద్రాక్షలు

2.చిచ్చుపెట్టే చిట్కాలెన్నో వెన్నతో పెట్టిన విద్యలు
రెచ్చగొట్టే ఆయువు పట్లే  కరతలామలకాలు
మెండైన ప్రలంబాలు నిండైన నితంబాలు
ప్రధానమే సదా వగలాడికి ప్రతారికా ప్రదర్శనం
పృష్ఠము కటి వళి అంగమేదైనా అయస్కాంతము
మందిరాలు గోపురాలు అవసరమా
సర్వాంతర్యామివి కదా స్వామి నీవు
విగ్రహాలు ముక్కోటి పేర్లేల దైవమా
నామ రూప రహితుడవే స్వామీ నీవు
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
నమో తిరుమలేశా నమో పాపనాశా

1.విన్నవించుకోవాలా మా వినతులు
జగముల కన్నతండ్రివే నీవైనప్పుడు
విడమరచి చెప్పుకోవాలా మాకున్న వెతలు
సర్వజ్ఞుడివే స్వామీ నీవైనపుడు
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
నమో తిరుమలేశా నమో పాపనాశా

2.కలతచెందాలా మేం పుట్టుక మరణాలకై
కర్తా కర్మా క్రియా అన్నీ నీవై నప్పుడు
బాధ్యతల వహించాలా నిమిత్తమాత్రులమై
జగన్నాటక సూత్రధారివే నీవై నప్పుడు
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
నమో తిరుమలేశా నమో పాపనాశా