Sunday, November 28, 2021



మనసును దోచిన హారికవే

నను వదలనీ నిహారికవే

నాకోసం వేచిచూచే అభిసారికవే

ప్రణయగంధం చిలకరించే పవన వీచికవే


1.తేనె కనులు కురిసేను వెన్నెల సోనలు

కెమ్మోవి వర్షించేను సిరి మల్లెల వానలు

ఇంద్రజాలమున్నది నీ క్రీగంటి చూపుల్లో

చంద్రహాసమన్నది నాతో రమ్మని మునిమాపుల్లో


2.ముక్కుపోగు చూడగానే ముద్దుగొలిపింది

చెవి జూకా ఊగుతూనే హద్దునింక చెరిపింది

సొట్టబుగ్గ అంతలోనే లొట్టలే వేయించింది

హరివింటి వంటి ఒంటివిరుపే మదిని తట్టి లేపింది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శుభోదయం సవ్యంగా నిద్రలేచినందుకు

శుభోదయం నవ్యంగా పొద్దుగడిచేందుకు

శుభోదయం దివ్యంగా నవ్వగలుగుతున్నందుకు

శుభోదయం భవ్యంగా బ్రతుకగలుగుతున్నందుకు

శుభోదయం శుభోదయం శుభోదయం


1.నీకు నాకు వంతెనగా మారింది శుభోదయం

పలకరింపు వారధిగా పరిణమించె శుభోదయం

ఎదను ఎదతొ జతజేసే రాయబారి శుభోదయం

భావాలను చేరవేసే పావురాయి శుభోదయం

శుభోదయం శుభోదయం శుభోదయం


2.ఆశలను మోసుకొచ్చే విశ్వాసమె శుభోదయం

స్వప్నం సాకారమయ్యే విజయమే శుభోదయం

వృధాగ గడపని అమృత సమయం శుభోదయం

పరోపకారమె జీవితమైతే ప్రతి ఉదయం శుభోదయం

శుభోదయం శుభోదయం శుభోదయం



రాగం:మాయా మాళవగౌళ


అడవి గాచిన వెన్నెల్లా నీ సోయగాలు

శిశిరాన మోడునై వేచాను నే యుగాలు 

ఎప్పటికి ఒకటయ్యేనో మనలో సగాలు 

నా గొంతు వంతాయే వేదనా రాగాలు


1.అందరాని హరివిల్లువు నీవు

పొందలేని మృగతృష్ణవు నీవు

భ్రమలోన బ్రతికేను ఒక భ్రమరమై

నిశిలోన మిగిలాను నే తిమిరమై


2.చాతకానికి ఎపుడో తీరేను దాహం

చకోరికైనా దొరుకును జాబిలి స్నేహం

ఎన్నాళ్ళని సైచను ఎడతెగని నీ విరహం

జన్మలెన్ని ఎత్తినా తొలగదసలు నీపై మోహం