Wednesday, June 10, 2020

కుంతల జలపాతం నీ నవ్వుల్లో
కురిసెను మకరందం నీ పలుకుల్లో
మంజుల భాషిణీ సుమధుర హాసినీ
నీ డెందము కవితల అందలం
నీ అందము భూతల నందనం

1.పాలకడలియందు ఆవిర్భవించినావొ
పూల పరిమళాలే నీమేనదాల్చినావో
క్షీరజ సంబంధి చందన సౌగంధి
నీవదన కమలం సూర్యకిరణ వికసితం
నీ నయన కుముదం చంద్రాతప హసితం

2.కఛ్ఛపినే ఇఛ్ఛగా వెంటతెచ్చుకున్నావో
పెదవులు వేణుధరునికిచ్చుకున్నావో
మానవ కలకంఠీ అభినవ సితికంఠీ
గంధర్వ గానాలు నీకే ఇల సొంతం
నాట్యశాస్త్రమే నీ నడకలు ఆసాంతం


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కాలం అమృతకలశం
చేజార్చకు ఏ నిమిషం
నిరర్థకంగ కోల్పోతే బ్రతుకు విలువ శూన్యం
నిజం తెలుసుకోకుంటే అది ఎంతటి దైన్యం

1.సుఖం దుఃఖమంటూ వేరువేరు లేవు
దృక్పథం మార్చుకుంటె  రాలేవవి నీ తెరువు
వేదనలో మోదములో ఆనందమె పొందేవు
అనుభవాలు ఏవైనా  ఆస్వాదించేవు

2.అభద్రతే ప్రతిఒక్కరి ఆందోళన హేతువు
నేటికంటె రేపటికే ప్రాధాన్యతనిచ్చేవు
భవితకై వగచివగచి ప్రస్తుతాన్ని వదిలేవు
మనిషిగా జీవించూ  చేరేవు దివిరేవు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మధ్యమావతి

చిత్తశుద్ధిలేకపాయె సాయిబాబా
నా ఏకాగ్రత మాయమాయె సాయిబాబా
మొక్కుబడిగ గుడికేగుట దేనికి బాబా
మొక్కులు ముడుపులేల సాయిబాబా
దిక్కులుచూడనేల చక్కని నీ రూపుగనక
మక్కువ ఎక్కువగా నీపై లేనే లేదుగనక
సాయినాథా షిరిడీ సాయినాథా
సాయినాథా షిరిడీ సాయినాథా

1.మనసు ధ్యాస ఎప్పుడూ నీమీదనే నిలుపనీ
మాటమాటకు మాటిమాటికీ సాయీ అని పలుకనీ
ఏపని చేసినా మునుముందుగ నీకే తెలుపనీ
సఫలమో విఫలమో ఫలితం నీకే సమర్పించనీ
సాయినాథా షిరిడీ సాయినాథా
సాయినాథా షిరిడీ సాయినాథా

2.మనిషి మనిషిలో బాబా నిన్నే కాంచనీ
ఉన్నంతలొ కాస్తైనా నిరుపేదకు పంచనీ
పెద్దల కడ వినయముతో నా తలవంచనీ
ఎదుటివారిలోని మంచి నన్నే గ్రహించనీ
సాయినాథా షిరిడీ సాయినాథా
సాయినాథా షిరిడీ సాయినాథా
మాట్లాడుమా ప్రియా అక్షరాలబాటలో
పలుకరించవే చెలీ పదాల పూలతోటలో
మధువును గ్రోలే మధుపం ఈర్ష్యపడేలా
సీతాకోకచిలుకే అలకతొ అంగలార్చేలా
పచ్చని పచ్చికబయళ్ళే తివాచీలు పరుచగా
అచ్చిక బుచ్చికలాడుతూ నన్నే అలరించగా

1.ఉద్యానవనమందు అందించు వలపులవిందు
వడ్డించవే వగలన్ని రంగరించి సొగసంతకుమ్మరించి
కొసరికొసరి తినిపించు మిసమిసలా పరువాలు
తాంబూలాన్ని మరిపిస్తూ అందించు అధరాలు

2.పవనాన్ని బ్రతిమాలి వీయమను శీతలాన్ని
ఎండవేడి నీడనీయ వేడిచూడు రసాతలాన్ని
నీ ఒడినే పడకగ మార్చి పవళింపనీయవె నన్ను
కలబడిన బడలికనే తీరిపోగ కునుకనిమ్ము
ఇంత చెప్పినా ఎరుగవైతివా-నా ప్రేమ సంగతీ
తెలిసికూడ తెలియనట్టుగా-నటిస్తే ఎలా నా పరిస్థితీ
ఐ లవ్యూ అన్నమాట బూతుకాదుగా
ప్రేమతెలుపడంలో ఏ రోత లేదుగా
మానెయ్యీ మనసుకు ముసుగెయ్యడం
కానియ్యి పారదర్శకం -ఎందుకు దాచెయ్యడం

1.పున్నమి వెన్నెలను ఆస్వాదించరా
మలయ సమీరాన హాయి పొందరా
జలపాతధారలెపుడు మదికి ఆహ్లాదమే
ప్రకృతి పచ్చదనం నయనానందకరమె
కోల్పోక సైతం అభిందించవచ్చు
మనోగతం తెలుపుతూ మన్నన సేయవచ్చు

2.బిడియపడితె భావాలు ఎలావ్యక్తపర్చగలరు
మొహమాటాలతో ఎలా స్వేఛ్ఛ పొందగలరు
తటపటాయిస్తుంటే తరుణం మించిపోదా
భాష చాలదనుకుంటే మార్గమేదొ దొరకదా
నువ్వు నువ్వుగా ఉన్నపుడే బ్రతుకునకర్థం
అర్థవంతమైన కాన్క అర్థమనుటె పరమార్థం