Saturday, June 29, 2019

రచన:గొల్లపెల్లి రాంకిషన్ (రాఖీ)

తొలగినాయి చీకట్లు
కడతేరెను ఇక్కట్లు
తెలంగాణ అంతటా లేనె లేవు పవరుకట్లు
అంతరాయమే లేని విద్యుత్తు మిరుమిట్లు
చంద్ర శేఖరునీ ప్రణాళికే గెలువ
ప్రభాకరుని అద్వితీయ  విద్వత్తు వెలుగ

1.సగటు మనిషికొఱకు ఇంటింటికి కరెంటు
పంటబావి మోటార్లు నాణ్యమైన కరెంటు
కంటతడి పెట్టకుండ రైతుకుచిత కరెంటు
కుంటుపడనీయకుండ ఇండస్ట్రీకి కరెంటు
చంద్ర శేఖరునీ ప్రణాళికే గెలువ
 ప్రభాకరుని అద్వితీయ  విద్వత్తు వెలుగ

2.కాళేశ్వర ప్రాజెక్టుకు రికార్డుగా కరెంటు
మిషన్ భగీరథ కోసం ఆగిపోని కరెంటు
పల్లెకు పట్నానికి నిరంతరం కరెంటు
ఎకసెక్కెమాడినోళ్ళనోళ్ళలో చొప్పదంటు
చంద్ర శేఖరునీ ప్రణాళికే గెలువ
 ప్రభాకరుని అద్వితీయ  విద్వత్తు వెలుగ
మోము చూపవా సఖీ
ఎటులనిను పోల్చగలనే చంద్రముఖీ
వెన్నుచూడగ కనులల్లాడగ
మొగము చూపితే స్థాణువునవనా

సొగసుబలగాల వ్యూహము మొహరించి
నను బంధించెదవో కౌగిలి చెఱవేసి
నీకురులతో నాకురివేసి
చంపవైతివే చంపకమాల
నీ దర్శనమో కరస్పర్శనమో
దయసేయగదే వసంత బాల

నీకవ్వింతలొ కడువింత దాగుంది
నీకనుబొమలలొ హరివిల్లుబాగుంది
దాగుడుమూతలు నేనాడలేను
నీ ఉడికింతలు నేసైచలేను
నీ వదనవీక్షణ నాకొక పరీక్షనా
నీకై ప్రతీక్ష  నాకిక ఆజన్మ శిక్షనా

హిమవన్నగాలకు మేరునగాలకు
నడుమన ఉన్నది నడుమనులోయ
ఎన్నెన్ని వన్నెలొ అందీఅందక
నా ప్రాణాలు నిలువున తీయ
ఇసుక గడియారం నీమేను వయ్యారం
పెదవులతడియార్చు నీ దేహ సౌందర్యం

Friday, June 28, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సాకి:
అంతర్యామి
సర్వాంతర్యామి
నీకు నాకు ఇక భేదమేమి..

పల్లవి:
నా ఊపిరి జపమాలా
ఉఛ్వాసనిశ్వాస నీ స్మరణా..
నా తనువూ నా మనసూ నీకే సమర్పణా


1.ప్రతి కార్యం నీ సేవ
నా నడకలు నీ త్రోవ
నా మదిలో నీరూపం
నా ప్రాణమే నీ దీపం ..

2.అశ్రువులే అభిషేకం
ప్రతిపలుకూ నీ శ్లోకం
నా మౌనం నీ ధ్యానం
నా జీవితం నైవేద్యం..
అతిలోకసుందరీ గతినీవె సౌందర్యానికి
జగతి నీకు దాసోహం నీ సౌకుమార్యానికీ
మతి భ్రమించి పోయిందేమో ఆబ్రహ్మకు
నీ సృజనచేసి చేతులెత్తినాడమ్మా ఈజన్మకు

1.ముంగురులకు ఎంత తొందరో-చెంపల చుంబనానికై
ముక్కపుడక కేమి ఆత్రమో-తళుక్కున మెరవడానికై
పలువరుస తలపోస్తోంది నగవుల నగ అవడం కొరకై
నొక్కుబడిన చుబుకం సైతం ఉబలాటపడతోంది తను మెప్పుకై
నేరేడు పళ్ళకళ్ళతొ పోటీకి సాధ్యమౌనా అందమైనవెన్నున్నా
కనికట్టు చేసే కళ్ళను దాటగలుగు ధీరులెవ్వరు భూనభోంతరాలలోనా

2నయనభాష నేర్చుకుంటే ప్రబంధాలు తెలిసొచ్చేను
చూపులనే  గ్రోలగలిగితే మధిరలాగ మత్తెక్కేను
అల్లార్పని రెప్పల్లో సందేశాలెన్నెన్నో
ఆసోగ కాటుకలో రవివర్మ చిత్రాలెన్నో
వర్ణించనాతరమా చూపులే ఆపుతుంటే నాకలమును
తప్పుకోనునా వశమా కన్నుల్లో ఖైదుచేస్తే నా బ్రతుకును
కన్నుల్లో కరకుదనం
అధరాల్లో చెఱకుదనం
వదనంలో నందనం
ఎదలో ఆరాధనం
అందాల నాచెలీ నీకు వందనం
ప్రణయాల నాసఖీ నీకు చందనం

1.ముట్టబోతె నిప్పులా కాల్చుతుంటావు
పట్టబోతె పాములా బుస్సుమంటావు
కస్సుబుస్సు లన్నీ పైపైనే
మరులుగొనుడు మాత్రం నాపైనే
కలలోకి వస్తావు కవ్విస్తుఉంటావు
కనిపించినంతనే నువుతప్పుకుంటావు

2.ఊరించుడెందుకో
ఉబుసుపోకనా
ఉడికించుడెందుకు
బొమ్మలాటనా
మనసువిప్పి చెప్పవే నీ ప్రేమని
బాసచేయవే చెలి కలిసుందామని
చితిచేరునందాక నాచేయివీడనని
మృతిలోనసైతం నీవాడనేనని

చురకత్తుల చూపులదానా
మది మత్తగు వలపుల జాణ
పరిచయమైతివె పరువాన
నీ సోపతిలో  మల్లెల వాన

1.మంచి గంధమంటే నీ సామీప్యము
మలయపవన మంటే నీ సహచర్యము
వెన్నెలరేయి హాయి నీకన్నులలో
ఉషస్సులో కువకువలే నీ పలుకులలో

2.నీలి మేఘాలే నీ కురుల సోయగాన
మంజీరనాదాలే వయ్యారి నడకలలోన
సంతూర్ రావాలె గాజుల సవ్వడిలోన
మ్రోగించ గలిగేలా నీమేనే రసవీణ
గుండెకు గొంతుకు సంధికూర్చుతూ
కవి భావనకే వంతపాడుతూ
పాడాలి ప్రతి పాట తన్మయ మొందుతూ
శిలలైన కరగాలి పరవశమెందుతూ
పాడవే అభినవ కోయిలా
పాటకే బాటగా సన్నాయిలా
సవరించుకోవాలి శ్రుతినిను చూసి
లయనేర్చుకోవాలి కలయగ జూసి

1.పికమున కొకటే వసంతము
ప్రతిఋతువు కావాలి నీసొంతము
గ్రీష్మము నేర్పగ ఎదతాపము
ఆర్తిగ పలకాలి నీ గాత్రము

వర్ష ఋతువులో మేఘగర్జనే
మేల్కొలపాలి ఉద్రేకము
శరశ్చంద్రికలె కలకలము రేప
ఊరేగాలి రసజగము

హేమంతకాంత చేరగ చెంత
పారిపోవాలి శీతలము
శిశిరము తరహా విరహము సైచగ
మది మురియపూయాలి పూవనము

2.జలపాత హోరున సంగీతము
నదికదలికలో మృదునాదము
కడలి అలలలో కమనీయ రవము
చిరుగాలి సవ్వడిలొ మధుగీతము

వెదురు గాయాల  సుధాగానము
మువ్వల యాతన కడుశ్రావ్యము
గళము పెగిలితే రసరమ్యము
ప్రేగు అదిలితే శ్రవణపేయము

పెదవులు ఆడితె పైపైన పలికితె
గానమెంతో పేలవము
మేను మరచి నాభినుండి
పాడితేనే పాటవము
ఇహము దేహము మీరునటుల
తల్లీనమైనదే కదా గానము

Thursday, June 27, 2019

ఎందుకు వెళ్ళాలి సాయీ షిరిడీ పురము
దేనికి చూడాలి బాబా నీ మందిరము
మార్చవయ్యా మా గుండె షిరిడీగ
మా మనసే నీ మందిరముగ
తలచినంతనే దర్శనమీయి మాతలపులందున
పిలిచినంతనే నువు బదులీయి ఆపదలందున

1.నువు దైవమని నేను భావించనూ
పూజలు భజనలు నే చేయను
నీ బోధనలే పాటించెదనూ
నీ మార్గములో నే సాగెదను
సాటి మనిషిలో నిను చూసెదను
తోచిన సాయము నే చేసెదను
మానవత్వమె నీ తత్వము
జనుల హితమే నీ మతము

2.నీ హుండీలో వేయను రొక్కము
నీ ముందు వెలిగించనొక దీపము
ఆకలి తీర్చగ జీవుల కొఱకు
రూకలు రెండైన వెచ్చించెదను
దుఃఖము మాన్పగ దీనార్తులకు
చేయూత నందించి ఓదార్చెదను
మానవ సేవే మాధవ సేవ
సంతృప్తి నిచ్చేదె ముక్తికి త్రోవ

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:తోడి
కోవెలలో ఉన్న దేవీ ఈవలకేల వచ్చెనో
ఈ భక్తుని కరుణించగా నా సేవలె నచ్చెనో
హరి మనోహరి సిరీ-శివకామిని  శివానీ- వాణీ

1.ఏపూలమాలైన నే వేయలేదు
ఏ పూజసైతం నే చేయలేదు
స్తోత్రాల నైనా వల్లించలేదు
ఏ మొక్కులైనా చెల్లించలేదు
గుడిచేర్చినాను ముసలమ్మను
బడి చూపినాను పసి బాలకు

2.యజ్ఞాలు యాగాల ఊసైన లేదు
వేదాలు శాస్త్రా ధ్యాసైన లేదు
దానాలు ధర్మాల చేసింది లేదు
పుణ్యాలు పాపాల నెరిగింది లేదు
మా అమ్మ పాదాలు వదిలింది లేదు
మా నాన్న ఆజ్ఞల్ని  మీరింది లేదు

Wednesday, June 26, 2019

రచన.స్వరకల్పన&గానం:రాఖీ

ఆ రెండు కళ్ళుచాలు నా గుండె ఆగడానికి
ఆ చిలిపినవ్వు చాలు ఎద తిరిగి మోగడానికి
సంపంగి నాసికే వేస్తుంది పూబాణాలు
సొట్ట బుగ్గ అందాలు తీస్తాయి నాప్రాణాలు

1.చూపు సుప్రభాతమై మేలుకొలుపుతుంది
పలుకు ప్రణయగీతమై మరులుగొలుపుతుంది
ఊహల్లో ఇంద్రధనసులే వెలయింప జేస్తుంది
స్వప్నాల్లో స్వర్గసీమలో విహరింపజేస్తుంది

2.సౌందర్య దేవతగా సాక్షాత్కరిస్తుంది
అపురూప భావనలే ఆవిష్కరిస్తుంది
జన్మకోశివరాత్రిగా  బ్రతుకుమార్చి వేస్తుంది
రెప్పపాటులోనే మధురస్మృతిగ మారుతుంది

Pic courtesy:  చౌటపల్లి నీరజ చంద్రన్
నీ రూపమే అంతటా
దర్శించనీ మము అన్నిటా
పసివారిలో      బాల త్రిపుర సుందరిగా
ప్రౌఢకాంతలెవరైనా జగన్మాతగా
ఏ స్త్రీ రూపమైన మము కన్నతల్లిగా
ముగురమ్మల మూలపుటమ్మగా

1.అర్భకులముమేము -చంచల చిత్తులము
మోహావేశములో మృగయా ప్రవృత్తులము
చిత్తరువుకే మేము మత్తెక్కి తూలేము
కాసింత చనువిస్తే నెత్తినెక్కి సోలేము
హద్దుమీరునంతలోనే బుద్ధిచెప్పవే మాత
సద్బుద్ది మాకిచ్చి నిబద్ధతే నేర్పవమ్మా

2.బ్రతుకంతా మా పయనం భామలేక లేదమ్మా
పడతితోడు లేకమాకు ఏ పొద్దూ గడవదమ్మా
అమ్మా ఆలి అక్కాచెల్లీ కూతురుగా బంధాలన్నీ కలికితోనె
భార్యను మినహాయించి కామకాంక్ష  త్రుంచవమ్మా
ధర్మరతిని దాటువేళ మగటిమి చిదిమేయవమ్మా
విచ్చలవిడి కాముకతకు తగినశాస్తి చేయవమ్మా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నా తలపుల తులసీదళాలను
నా మనసను దారముతో అల్లెదను
అదితాకగ పరవశముగ నీ ఎదను
అలరించగ నీ మెడలో వేసెదను
ఒక్కదళానికే తూగిన కృష్ణా
తులసిమాలనేవేసితిని తీర్చర నాతృష్ణా

1.వెన్నముద్దలే లేవు నా వన్నెలు మినహా
నెమలికన్నులే లేవు నా సోగ కన్నులు వినా
తనివారగ గ్రోలరా నా తపనల నార్పరా
నయనాల దాగరా స్వప్నాల కూర్చరా
గోపికల కలల బాల మురళీలోలా

2.అష్టభార్యలున్నను రాధను లాలించితివి
వేలగొల్లభామలనూ వేడ్కగ పాలించితివి
మీరాలా గ్రోలెదనూ నీ భక్తి ధారనూ
ఆరాధింతునెగాని నీ ఆనతి మీరనూ
యమునా విహారా బృందావన సంచారా

Tuesday, June 25, 2019


ఆషామాషీ కాదురా శంకరా శివశంకరా
మనిషిగ పుట్టి మహిలోమనుట సవాలురా
అల్లాటప్పా కాదురా ఈశ్వరా పరమేశ్వరా
నీతీనియతీ లేని చోట బ్రతుకే నరకంరా

1.గరళం తాగి ఘనతే చాటా వనుకోకెప్పుడు
సరళం కాదుర కల్తీ మింగి బాల్చీ తన్నకుండుడు
గంగను తలపై పెట్టుకుంటే  తపనంటేమిటొ తెలిసేనా
దప్పిక తీరక చుక్కనీటికై అలమటించడం ఎరుకౌనా
కైలాసాన్నే వీడరా భువికి విలాసం మార్చరా
పట్టుమని నువు పదినాళ్ళుంటే ఒట్టంటే ఒట్టేరా

2. పాములే నగలనుకొంటూ గొప్పలు చెప్పితే ఎట్టా
పసికూనలనే  కాటువేసే విషనాగులు మాచుట్టా
భూతనాథుడవు నీవంటే నమ్మేదది ఎట్టా ఎట్టెట్టా
వావివరుసలు మరచిన కామ పిశాచాలు మాచుట్టా
ఉంటేగింటే నీ మహిమలనే చూపరా ఇకనైనా
కాల్చివేసే కన్నే ఉంటే అమానుషం మసిచేయరా
మూగవు కావురా-మౌనము వీడరా
పలుకుల ఝరి నీలో ప్రవహింపజేయరా
మాటల తేనెల్లో మము ముంచివేయరా
బిడియము ఏలరా-తడబడనేలరా
తెలిసిన భాషలోనె తెగబడి భాషించరా
మనసులోని భావమంత సూటిగ సంధించరా

1.నిన్ను నీవు ఎన్నటికీ చులకన చేసుకోకు
పరులకన్న నీవెపుడూ అల్పుడవని అనుకోకు
అణగారి పోయింది నీలొ ఆత్మవిశ్వాసం
తట్టిలేప గలిగితే చేయగలవు సాహసం
న్యూనతాతత్వాన్ని నీనుండి తరిమికొట్టు
సంకల్పం గట్టిదైతే చేరగలవు తుదిమెట్టు
బేలవుకావురా ధీరుడవీవురా
మడమతిప్పకుండనీవు ముందుకె అడగేయరా

2.అలసటనే ఎరుగునా అల ఎన్నటికైనా
చెలియలికట్టనే అడ్డుగ కట్టినా
ప్రయత్నాన్ని విరమించక అంచనాలు మించదా
సునామిగా మారి గట్టు దాటక తా మానునా
ఆటంకం నీలోన పెంచాలి పట్టుదల
ఓటమి నీకెపుడూ నేర్పాలి మెళకువ
ఇటుకమీద ఇటుక పేర్చి కట్టాలి భవంతిని
ఓపికతో జట్టుకట్టి కొట్టాలి ఉట్టిని
మిరపకాయ బజ్జీ-పేరు చెప్పగానే తిన బుద్ది
ఘుమఘుమ వాసన-నీళ్ళూరగ రసన
బంగారు వన్నెతో అలరారు చుండగ
బండిని దాటిపోవ బ్రహ్మ కైన సాధ్యమా

1.శ్రేష్ఠమైన పచ్చిమిర్చి-రెండవకుండ చీల్చి
మధ్యలోన ఉప్పు వాము చింతపండు కూర్చి
చిక్కనైన శనగపిండిలొ ఒకే వైపు ముంచి
కాగిన నూనెలో కడాయిలోకి జార్చి
కాలీకాలకుండ జారమీద ఆరనిచ్చి
మరిగిన నూనెలో మరలా వేయించి
తరిగిన సన్ననైన ఉల్లిపాయల్ని చల్లి
 గరం మీద కొరికితింటె నా సామి రంగా
చస్తేనేం తిన్నాకా ఉన్న ఫళంగా

2.వేడితో ఒకవైపు కారంతో మరోవైపు
సుర్రుసుర్రుమన నాల్కె హుషలుగొట్ట తింటుంటే
ముక్కునుండి కళ్ళనుండి గంగధార కడుతుంటే
ఎన్ని తిన్నామో తెలియనంత మైమరచి
పెదవి నుండి పెద్దప్రేగు చివరి వరకు మండినా
ఆపమెపుడు తినడాన్ని తనివి తీరునంతదాక
తెలుగువారికెంతగానొ ప్రియమీ చిరుతిండి
ప్రతిరోజూ తిన్నాగాని మొహంమొత్తబోదండి
మిర్చిబజ్జి తినని జన్మ నిజంగానె దండగండి
పడవే నీవిక వానా
పడవే పల్లెలలోనా
పడవే మాకు ఆటవస్తువు కాగా
కాగితపు పడవే పిల్లకాల్వలో సాగా

1.జలజలరాలే చినుకుల్లోనా
బిలబిల పిల్లల పలుకుల్లోనా
వానావానా వల్లప్పా
చేతులుచాపే చెల్లెప్పా
గిరగిర తిరుగుతు గంతులు వేయ
తడితడి దుస్తుల నర్తన లాడ

2.వెలిసీవెలియని వర్షంలోనా
ఇసుక మేటల కుప్పల్లోనా
పాదము జొనిపి ఇసుకను కప్పి
పిచ్చుక గూళ్ళే ఒడుపుగ కట్టి
పుల్లలతోని ఎరలను కదిపి
ఆరుద్ర పురుగుల పెటెలొ పెట్టగ

Saturday, June 22, 2019

శ్రీ వేంకటేశా అనినంతనే తొలగును పాపాలు
శ్రీనివాసా అని అర్థించగనే కలుగును సిరిసంపదలు
ఆపదమెక్కులవాడా అని తలవగనే అంతరించు ఇక్కట్లు
ఏడుకొండలవాడా అంటూ వేడగనే వీడను మదిచీకట్లు
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
గోవిందా హరి నమో నారాయణా

1.బంగారు శిఖరాల అలరారు ఆలయం
భువిలోన వెలసిన అపర వైకుఠం
సప్తగిరులపై వెలసిన స్వామి చిద్విలాసం
దర్శించగ  తరియించును మన జీవితం
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
గోవిందా హరి నమో నారాయణా

2.కోట్లమంది భక్తులకు స్వామి ఎడల విశ్వాసం
నిలువుదోపిడనునది భవబంధమోచనం
తలనీలాలీయగా సమయు అహంభావం
అడుగడుగు దండాలతొ జన్మ సాఫల్యం
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
గోవిందా హరి నమో నారాయణా
రచన:గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)-9849693324

ఒళ్ళంతా కళ్ళు చేసుకొని-
కళ్ళల్లో వత్తులేసుకొని
పగలంతా పనులు మానుకొని-
రేయంతా నిదుర వదులుకొని

చకోరి పక్షుల్లా వేచి చూసాము రామా
చాతక పక్షుల్లాగా తపన పడ్డాము రామా
ఇళ్ళూ వాకిళ్ళ ధ్యాస మరిచాము రామా
పద్నాలుగేళ్ళూ దారి కాచాము రామా

నువ్వింక వస్తావని-మా ఆర్తి తీర్చేవని
మారాజు వౌతావని-మమ్మేలుకొంటావి
రఘుకుల సోమా రామా కారుణ్య ధామా
దశరథ నందన రామా  హే పట్టాభిరామా

అనుకున్న క్షణము వచ్చిందిగా
కల నిజమై  ఎదుటే నిలిచిందిగా
స్వాగతమయ్యా సాకేత రామా
సుస్వాగతమయ్యా హే సార్వభౌమ

నీవేలేనీ రాజ్యం బీడై పోయింది
నీవేలేని నగరం అడివే అయ్యింది
కష్టాలు తీర్చేవాళ్ళు కరువాయెగా
కన్నీళ్ళు తడిచేవాళ్ళే లేరాయెగా


నువ్వొచ్చినావంటె మా బత్కులె పండేను
నువురాజ్యమేలితెమా కడుపులె నిండేను
విజేతవై నువ్వు వచ్చావయ్యా
అయ్యోధ్యపురికే వన్నె తెచ్చావయ్యా

సుగ్రీవునితో మైత్రి చేసావట
బలశాలివాలిని మట్టుబెట్టావట
మారుతినే బంటుగ చేసుకున్నావట
అంబుధికే వారధికట్టి దాటావట

సీతమ్మను చెఱనే బెట్టిన-
లంకేశుడు రావణున్ని
ఒక్క బాణంతో నేల కూల్చావట
శరణన్న విభీషణున్కి పట్టం కట్టావట

దండాలు నీకు కోదండ రామయ్యా
జేజేలు నీకివే మాజానకి రామయ్యా

నీ చూపు పడితేనే మేఘాలు మెరిసేను
నువ్వడుగు పెడితేనె వానల్లు కురిసేను
పంటలే పండేను గాదెలే నిండేను
ఊరూర ఇకపై ప్రతిరోజు పండగౌను

నీ గాధలే మాకు మార్గాన్ని చూపేను
మా బాధలింక మటుమాయమయ్యేను

ఇంటింట ప్రతి పూట నవ్వులే విరిసేను
ప్రతినోట రామ రామ రామయే పలికేను
వందన మిదిగో అందాల రామా
మావినతులందుకో నీలమేఘశ్యామ
ఏమౌతున్నది నాదేశం
జగతికి ఏమని సందేశం
హిందూ ముస్లిం సిక్కు ఇసాయి
లౌకిక తత్వమె మతమిట భాయి
భారతీయతే అభిమతమోయి
జై జవాన్ జై కిసాన్
జైవిజ్ఞాన్ జై అనుసంధాన్

1నేటికి సైతం నింగివైపు
ఆశగ చూసే భారతరైతు
జీవనదులు గంగాయమునలు
కాకూడదిక అంబుధి పాలు
నదులన్నీ మళ్ళాలి బీడు భూములలోకి
పండిన పంటచేరాలి హర్షంగా పెదాలపైకి
వర్షం ఎన్నడు రాయకూడదు
కృషీవలుని తలరాతలను
కంటతడే పెట్టక కర్షకుడికపై
కననేకూడదు కలచేకలను

2.నెత్తురుకూడ గడ్డకట్టే చలిలోను
కణకణమండే ఎండల్లో ఎడారిలోను
తుఫానువేళనైనా సాగరతీరంలోను
అడవులు కొండలు కోనలలోను
రేయీపగలు పహారా కాచే సైనికుడు
శత్రువుగుండెలొ నిద్రపోయే యోధుడు
వీరమరణంపొందినా లోటురావద్దు
తన భార్యాపిల్లలెపుడూ అనాధలుకావొద్దు
మననిశ్చింతకు జవాను త్యాగం మూలంమరవొద్దు
రోజొక రూపాయ్ వితరణ చేయగ వెనుకాడవద్దు

3.ఉన్నతవిద్యలు నేర్చి దేశం రొమ్ముగుద్దొద్దు
పరదేశాల పౌరులగుటకై మోజు పడవద్దు
తెలివితేటలు దేశ ప్రగతికై ధారపోయాలి
పరిశోధనలు ప్రావీణ్యతలు ఇటనే చూపాలి
విద్యా వైద్యం ప్రభుతచొరవతో ఉచితం కావాలి
తేరగ ఇచ్చే తాయిలాలిక రద్దుకావాలి
ఆదుకునేందుకు సర్కారే ముందుకురావాలి
ఉపాధి కల్పనతోనే ఉత్పాదక పెరగాలి
మన ద్రవ్యానికి ప్రపంచమంతా విలువీయాలి
భారతదేశం ఇలలోనే తొలిస్థానానికి ఎదగాలి

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మధ్యమావతి

సంగీతం సంగీతం
సంగీతంతో మనిషి జీవితం
సంగీతంతో బ్రతుకు సార్థకం
సంగీతం సంగీతం
అణువణువున సంగీతం
అడుగడుగున సంగీతం
సంగీతమే ప్రకృతి సాంతం
సంగీతమే సృష్టి స్థితి లయం

1.సాగర ఘోషలొ సంగీతం
ఊపిరులూనగ సంగీతం
తొలకరి చినుకుల సంగీతం
లబ్ డబ్ ఎద లయ సంగీతం
సంగీతమే ప్రకృతి సాంతం
సంగీతమే సృష్టి స్థితి లయం

2.మేఘ గర్జన లొ సంగీతం
గాలి కదలికలొ సంగీతం
శకుంత కువకువ సంగీతం
సమ్మోహక పిక  సంగీతం
సంగీతమే ప్రకృతి సాంతం
సంగీతమే సృష్టి స్థితి లయం

3.శిశు రోదనలో తొలిసంగీతం
లాలిపాటలో మధుర సంగీతం
కిరుకిరు ధ్వనులే తొట్లె సంగీతం
చిటపటమంటలె చితి సంగీతం
అణువణువున సంగీతం
అడుగడుగున సంగీతం


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:చక్రవాకం
చంద్రమౌళీశ్వరీ రాజరాజేశ్వరీ
మాతా శ్రీకరి శ్రీ లలితేశ్వరి
నీపాద పద్మాల భ్రమరమై మననిమ్ము
నీ చరణ మంజీరమై మ్రోగనిమ్ము

1.నీ నయనాలలో కేదార క్షేత్రాలు
నీ దరహాసములొ భగీరథీ తీర్థాలు
నీసన్నిధిలో జన్మరాహిత్యాలూ
నీ సేవలే ఇల ఆనంద సూత్రాలు
హే త్రిపుర సుందరీ భువనైక మోహినీ
మాతా శ్రీకరి శ్రీ లలితేశ్వరి
నీపాద పద్మాల భ్రమరమై మననిమ్ము
నీ చరణ మంజీరమై మ్రోగనిమ్ము

2.బ్రహ్మాది దేవతలు నీ భృత్యులే తల్లీ
ఏడేడు లోకాల సామ్రాజ్ఞి నీవె జనని
సృష్టిస్థితి లయలు నీమాయలే
అంతఃకరణాలు నీ ఆజ్ఞలోనే
శ్రీచక్ర రూపిణి మణిద్వీపవాసినీ
మాతా శ్రీకరి శ్రీ లలితేశ్వరి
నీపాద పద్మాల భ్రమరమై మననిమ్ము
నీ చరణ మంజీరమై మ్రోగనిమ్ము
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:సింధుభైరవి

నటరాజా శంభో  నగజా విభో
తాండవ కేళీ లోలా లయకారా ప్రభో
తెరవాలీ మూడో కన్ను కలపాలీ మన్నూ మిన్నూ
మ్రోగాలీ ఢమఢమఢమఢమ ఢమరూ
సాగాలీ ధిమిధిమి నీ నర్తిత పదములూ

1.ఊపిరినే శృతి చేసెను  ప్రకృతి
ఎద స్పందన లయ కూర్చితివా పశుపతి
జీవనాదమొనరించి ఇచ్చితివీ మానవాకృతి
తపించి తరించగ జన్మరాహితి
వచ్చిన సంగతి మరచి నీచకర్మలాచరించి
భ్రష్టులమైతిమి పతనగతిని చరించి

2.ఉత్కృష్టమైనది ఈ మానుష జన్మము
ఉన్నతమైనది మనిషి మనిషి బంధము
సృష్టికార్యమన్నది అతి పవిత్రమైనది
వావివరుస వయసు మరచి నికృష్టమైనది
నీవె ఇక దిగివచ్చి మాకు నియతి నేరుపు
మారని మనుజులను నీవె మంటగలుపు




రచన,స్వరకల్పన&గానం: రాఖీ

రాగం:చంద్రకౌఁశ్

చిద్విలాసా తిరువేంకటేశా
అర్ధనిమీలితనేత్రా నిజ శ్రీనివాసా
శిలాసదృశా సర్వేశా
భక్త పోష బిరుదాంకిత సప్తగిరీశా
నటనలు చాలించి మము పాలించరా
దుర్ఘటనలు వారించి  దృష్టి సారించరా

1.నిన్ను నమ్ముకుంటే నట్టేట ముంచుదువా
నీవే  శరణనన్ననూ  స్వామీ మిన్నకుందువా
 ప్రహ్లాదుని కోసము నరహరివై వెలిశావట
ధృవుడిని సైతము ఆదరించినావట
ప్రకటితమవ్వాలి ఇపుడే నీమహిమలు
లోకానికి చూపాలి నీ అద్భుత లీలలు

2.ఎలుగెత్తి పిలిచిందని బ్రోచితివా కరిరాజును
దుఃఖితయై ప్రార్థించగ కాచితివా పాంచాలిని
నిన్నేమి కోరనని కొరవితొ మంట పెట్టితివా
నీ కొండకు రానని గుండెను మండిచితివా
పరమదయాళా  తాళను మన్నించరా
దండించినదిక చాలు  దయగన జాగేలరా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:సరస్వతి

గజాననా నగజానందనా
నిజముగ నిను నమ్మితిని
రుజలను మాన్పరా స్వస్థత కూర్చరా
లంబోదరా పాశాంకుశ ధరా
చిత్తము శీఘ్రమే కట్టడి సేయరా క్రమతను నడపరా

1.తలపులొ వాక్కులో సతతము నిను నిలిపెద
ప్రతి పనియందును తొలుతగ నిను మ్రొక్కెద
నిద్దురలో మెలకువలో నిన్నే స్మరియించెద
సత్వరమే వరమీయగ నిను ప్రార్థించెద
ఏకదంతా మూషకాసుర నుతా
నమోవాకమిదిగో మోదకామోదకా

2.తొందరపాటుతో పొరబడనీయకుమా
లౌక్యము నాకు గఱపి నన్నుద్ధరించుమా
అహంభావమంత నాలొ అంతరింపజేయుమా
కడతేరు వరకునూ ఆరోగ్యమునీయుమా
వక్రతుండా నీవే నాకు అండదండ
ప్రణవాత్మజ నీకిదే ప్రణుతుల పూదండ

Wednesday, June 19, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అక్కున జేర్చవే గ్రక్కున బ్రోవవే
ముక్కెర దాల్చిన తల్లి
చక్కెర పల్కుల పాలవెల్లి
చక్కని మాయమ్మ చదువులమ్మా
వక్కాణించవె వరములు వాక్కాంతమ్మా

1.నిక్కము చూడగా మిక్కిలి నాతప్పులు
లెక్కలు వేయగా దుఃఖమె కద దక్కెనూ
మొక్కెదనమ్మా చెల్లించగ నా మొక్కులు
తక్కించకు నన్నికపై తనయునిగా లెఖ్ఖించి
చక్కని మాయమ్మ చదువులమ్మా
వక్కాణించవె వరములు వాక్కాంతమ్మా

2.ఒక్క నిమిషమైన నన్ను పక్కన పెట్టకు
నా తిక్క తగ్గించగ నీవె నాకు ఇక దిక్కు
మొక్కలాగె ఉన్నాను ఎదగని నను వృక్షంగా
తక్షణమే దరిజేర్చు మోక్షమె నా లక్ష్యంగా
చక్కని మాయమ్మ చదువులమ్మా
వక్కాణించవె వరములు వాక్కాంతమ్మా

Monday, June 17, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:ఖరహరప్రియ

ఏడు స్వరములు ఏబదియారు అక్షరములు
ఎదలో భావాలు వేనవేలు-గీతాలై ఇల జాలువారు

1.అనుభూతి మెదులు -సరిగమలు వెలయగ
పదములు కదులు- పదనిసల దెసగా
తనువే ఊగు లయ కలయగా
తన్మయముగ సాగు పాటే తేనెల ఊటగా

2.చతురత మీరగ జంత్రవాద్యములు
నిపుణత తోడుగ జతులు గతులు
గళమున గంగా యమునలు పొంగగ
మనోధర్మ సరస్వతి మధుర సంగమ కృతి


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:హంసనాదం

చైతన్యము నీవే-నా ఊపిరి కావే
నవనాడుల క్రియాశీల జీవకణము కావే
జపమాలా కరధారిణి-జయతు శారదామణీ

1.యోచన జనియించనీ-కార్యరూపు దాల్చనీ
సత్కర్మలననుష్ఠింప-జనతతి నుతియించు రీతి
ప్రయోజనము తక్షణమే సిద్ధించనీ-
ప్రమోదమే ఈప్సితమై వర్షించనీ
పుస్తక హస్త భూషిణీ-జయతు శారదామణీ

2.పంచజ్ఞానేంద్రియములు-నీకై తపియించనీ
పంచకర్మేంద్రయములు-నీ దిశగా సాగనీ
త్రికరణ శుద్ధిగా నా బుద్ది మెదలనీ-
త్రిగుణాతీతముగా నన్ను కదలనీ
జాగృతనాద వీణాపాణీ-జయతు శారదామణీ

Saturday, June 15, 2019


అన్నీ లైట్ తీస్కో-లైఫే హాయి చూస్కో
ఏక్షణం వేస్ట్ చేయకుండా ఎంజాయ్ చేస్కో

1.అప్పుడు మనతో  ఉన్నవాళ్ళే ఆప్తులు
తప్పులన్ని సరిదిద్దే వాళ్ళే దోస్తులు
ఎప్పటికీ సప్పోర్ట్ చేస్తూ సాగేదే ఫ్రెండ్ షిప్
మామా,బావా,చిచ్చా,భయ్యా అనే పిలుపు
ఏర్పరుస్తుంది పక్కా రిలేషన్ షిప్

2.పడినా లేస్తూ పరుగెత్తాలి కాన్ఫిడెన్స్ తో
ఓటమి గెలుపులు కామనేగా స్పోర్ట్స్ మీట్ లో
క్రీడాస్ఫూర్తిని మాత్రమే నువు ఆప్ట్ చేసుకో
జిందగీహై  పల్ పల్ జీనా పల్ పల్ మర్నా
హెల్పింగ్ నేచర్ పాలసీ నువ్వడాప్ట్ చేస్కో


చెలి నవ్వులే హరివిల్లులు
చెలి చూపులో వెన్నెల జల్లులు
తొలి ప్రేమ గురుతులు ప్రియురాలి తలపులు
యాదికొస్తేనె మదికెంత పులకింతలు

గుడిమెట్లమీద నది గట్టుకాడ
కాపు కాసి చూసేటి ఆ దొంగ చూపులు
అలనాటి స్మృతులు చిననాటి చేష్టలు
గుర్తుకొస్తేనె కన్నుల్లొ చెమరింతలు
తొలి ప్రేమ గురుతులు ప్రియురాలి తలపులు
యాదికొస్తేనె మదికెంత పులకింతలు

తెల్లారిమసకల్లొ ముగ్గేయచూడగ
తెల్లార్లు నావింత కలవరింతలు
నా మూగ ప్రేమ నా మౌన భాష
ఎదవిప్పజాగైన నా చింతలు
తొలి ప్రేమ గురుతులు ప్రియురాలి తలపులు
యాదికొస్తేనె మదికెంత పులకింతలు

బడివదిలినపుడో నడివీథిలోనో
వెనువెంట నడిచే ఆ వెంబడింతలు
అవి స్వప్నలోకాలు చెలి జ్ఞాపకాలు
భగ్న ప్రేమైతెనేమి మధురక్షణాలు
తొలి ప్రేమ గురుతులు ప్రియురాలి తలపులు
యాదికొస్తేనె మదికెంత పులకింతలు
గురువారం ఇది సద్గురువారం
వారానికి ఒకమారైనా సాయికోవెలకు వెళ్ళే వారం
సాయికి పంచ హారతులు మనసారా ఇచ్చేవారం
సాయి పల్లకీ మోసేవారం సాయి భజనలు చేసేవారం
ఓంసాయి శ్రీసాయిజయజయ సాయి
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

1.సుప్రభాతముతొ సాయిని లేపి
పాలతొ సాయిని అభిషేకించి
షాలువ సాయికి మేనున చుట్టి
విభూతిగంధము తిలకము దిద్ది
మెడలో పూలమాలలు వేసి
ధూపము దీపము వెలిగించి
నైవేద్యము సాయికి నివేదించి
నీరాజనమే సాయికి ఇచ్చి
మంత్రపుష్పమే భక్తిగ చదివి
ధునిలోభస్మము  నుదుటను దాల్చి
తీర్థప్రసాదము స్వీకరింతుము

2.సాయి ఎదుటన ఆసీనులమై
మదిలోసాయిని పదిలపర్చుకొని
బాధలనన్ని పోగొట్టమని
సంపదలెన్నో సమకూర్చమని
ఆపదలోన ఆదుకొమ్మని
విద్యాబుద్దులు నేర్పించమని
మిద్దెలు మేడలు ఇవ్వమని
పదవులు బిరుదులు ఆశించి
సాయిని వేడుదమని ఎంచి
ధ్యానములోనా మైమరచి
సాయినామమే జపియించెదము

Friday, June 14, 2019

ఏడుపెలా వస్తుంది కారికారి కన్నీరే ఇంకిపోతే
దుఃఖమెలా తీరుతుంది అగచాట్లే ఆగకుంటే
మిణుకుమిణుకుమనే ఆశను విధి చిదిమేస్తుంటే
ఏల్నాటి శని పగబూని బ్రతుకును కబళిస్తుంటే

1.దురదృష్టం త్వరపడి తానే అడ్డుపుల్లలేస్తుంటే
అడుగులోన అడుగేవేసి పదిలంగానే నడుస్తుంటే
వైకుంఠ పాళిలో పాములన్ని కాటేస్తుంటే
జీవితచదరంగంలోనా చుట్టుముట్టి చంపేస్తుంటే
దినం ఎలాసాగుతుంది బలిచేస్తుంటే

2.సంసార సాగరంలో బిగబట్టి ఈదుతుంటె
దారితెన్ను కానరాక చీకట్లు ముసురుతుంటే
దిక్కుతోచకుండా తుఫానులో చిక్కుకుంటే
ఇంతచాలదన్నట్టు తిమింగలం మింగబోతే
భవిత ఎలా ఉంటుంది బడుగుజీవికి

Tuesday, June 11, 2019

విధాత సృజనలో రూపు దిద్దుకున్నాము
నీ వీణానాదములో మేధ పెంచుకొన్నాము
ఎందులకమ్మా మాలో ఈ వికృత తత్వాలు
అపశృతులేలమ్మా చెలరేగ పైశాచికత్వాలు
భారతీ నీకిదె ప్రణతి-మము సరిజేయగ వినతి

1.మారదేమొ నుదుటిరాత మంచిగ రాయొచ్చు కదా
సత్కర్మలు చేయునట్లు నాడేసరి దిద్దొచ్చు కదా
తల్లివని నమ్మితిమి మా ఆలనచూడవే
కల్పవల్లివని వేడితిమి సన్మార్గము నడపవే
భారతీ నీకిదె ప్రణతి-మము సరిజేయగ వినతి

2.యాచించకుండా బ్రతుకు సాగనీయవే
వంచించకుండా మాకు బుద్దిగరపవే
చదువు సంస్కారమిచ్చి మము తీర్చిదిద్దవే
అనుబంధం ఆత్మీయత మాఎదలో నాటవే
భారతీ నీకిదె ప్రణతి-మము సరిజేయగ వినతి
బీడు నేలలో మోడును నేను
తొలకరి జల్లుల పులకరమీవు
వల్లకాడులో బూడిదనేను
మృతినే తరిమే అమృతమీవు
నన్ను చిగురింప జేయవే
నాకు మరుజన్మ నీయవే

1.వసంతాలు  వాకిట్లో ఆటలాడె నాడు
ప్రభాతాలు  చీకట్లకు తావీయలేదపుడు
నరదృష్టే తాకిందో-నా విధి వక్రించిందో
పేకమేడలాగా కూలిపోయె జీవితం
శిథిమైన కోవెలలా మిగిలిపోయె నాగతం

2.అనురాగ చదరంగంలో పావునై పోయాను
చెలి ప్రేమ నాటకంలో అతిథి పాత్రనైనాను
ఎందుకు మురిపించిందో-ఎందుకు వంచించిందో
బిచ్చగాడినైనాను  బ్రతుకు ధారపోసి
పిచ్చివాడినైనాను  భవితను బలిచేసి


Friday, June 7, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నయనాలు మూసుకొన్నావో
నామాల్లో దాచుకొన్నావో
దారుణాలే చూడలేక -కారణాలే చూపలేక
శ్రీవేంకటేశ శ్రీశా- చిద్విలాస భవ్యవేషా

1.జగమంత నీదు మాయే-జనులంత బొమ్మలాయే
ఈ కుటిల నటనలేల-ఈ జటిల బ్రతుకులేల
తెఱదించవేల ఈవేళ-పట్టించుకోవ మాగోల
శ్రీవేంకటేశ శ్రీశా- చిద్విలాస భవ్యవేషా

2.నియమాలు నీకు లేవు-తర్కాలు పనికిరావు
నీగెలుపు కొరకె నీవు -తొండైన ఆడుతావు
పితలాటకాల క్రీడ-సరదాయే నీకు ఆడ
శ్రీవేంకటేశ శ్రీశా- చిద్విలాస భవ్యవేషా

Thursday, June 6, 2019

జాతీయ భావన-ప్రతిపౌరుని ఎదలోనా
ఊపిరులూనాలి-ఉద్వేగం పొంగాలి
మువ్వన్నెల ఝండాను కన్నా-జనగణమన అను గీతం విన్నా
జయహే జయహే- జయ భారత జనని-జయజయజయహే
జయహే జయహే- ప్రియ భారత జనని-జయజయజయహే

1.దేశమే కాదు  విశాలమే ప్రజల మనసులు సైతం
హిమాలయాలే కాదు జనుల యోచన కూడా ఉన్నతం
వర్ణాలెన్నున్నా అందమే నింగికి సింగిడి
భిన్నత్వంలో ఏకత్వం అన్నది ఇక్కడి నానుడి
జయహే జయహే- జయ భారత జనని-జయజయజయహే
జయహే జయహే- ప్రియ భారత జనని-జయజయజయహే

2.మేధావులకే ఆలవాలం అనాదిగా వేదాలకు మూలం
జగమంతటికీ అందించెనుగా అద్భుత శాస్త్ర విజ్ఞానం
గుంటనక్కలవైనం మన ఇరుగూ పొరుగుల వ్యవహారం
తొంగిచూసినా సరే తప్పక నేర్పుతాము గుణపాఠం
జయహే జయహే- జయ భారత జనని-జయజయజయహే
జయహే జయహే- ప్రియ భారత జనని-జయజయజయహే