Thursday, July 4, 2019

చిరునవ్వు స్థిరవాసము నీ అధరము
ప్రణయానికి ఆహ్వానము నీ నయనము
పున్నమి వెన్నెలకే విలాసము నీ వదనము
కవి కలమున ఉదయించే సుప్రభాత గీతము

1.జడ చూడగ యమునయే స్ఫురణము
మెడవంపున మందాకిని సౌందర్యము
తీయని నీ పలుకుల్లో గంగావతరణము
అణువణువున తొణుకుతోంది లావణ్యము

2.గిరులనుండి జారే కోకే జలపాతము
కటి చీకటిలో దాగే నాభే ఘనకటకము
పాదాల పట్టీల నాదమే రసభరితము
నిలువెత్తునీ అందం కననివినని చరితము
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:జయంత శ్రీ

అనిమేషుడనే నినుచూడ
ఏడుకొండల వాడ
నీ దాసుడనేనైతిని
కోనేటిరాయా నినువీడ

1.కొడిగట్టక వెలుగనీ
గర్భగుడిలొ నను దివ్వెగ
వసివాడక నిలువనీ
నీ పదముల పువ్వుగ
అనిమేషుడనే నినుచూడ
ఏడుకొండల వాడ
అన్నమయ్యనేనౌదు
మరిమరి నినుపొగడ

2.దినమైనా దీపించని-నీ
నుదుటన తిరు నామమై
క్షణమైనా వ్యాపించనీ
సాంబ్రాణి ధూపమై
అనిమేషుడనే నినుచూడ
ఏడుకొండల వాడ
పురంధరుడ నేనౌదు
కమ్మని నీకృతులు పాడ
రాగం:శుద్ధసీమంతిని

శివనామమే సంగీతమూ
శివగానమే ఆనంద జనితము
శివతత్వమే అద్వైతము
శివమంత్రమే భవతారకం
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

1.పరవశమున శివశివయనగా
నరుని వశమగును హరహరుడు
విశ్వాసముగా విశ్వేశ్వరా యనగ
కరమందీయడ శంకరుడు
కపోతమునకే కైవల్యమొసగెను
శ్రీశైల  మల్లికార్జునుడు
గిరి పరిక్రమతో పరసౌఖ్యమీయడ
అరుణాచలేశ్వరుడు
అరుణాచలశివా అరుణాచలశివా అరుణాచలశివా

2.సైకతమైనను లింగాకృతి నర్చించ
భవజలధిని దాటించును రామేశ్వరుడు
సుమమేకాకున్ననూ మారేడునర్పింప
ముక్తిని దయసేయడా ముక్తీశ్వరుడు
తలమీదగంగమ్మ కాపురమున్ననూ
చెంబుడునీటికే చేరదీయు కాళేశ్వరుడు
కోడెనుకట్టినంత గోడే వినగలడు
వేములవాడ రాజేశ్వరుడు
మహాదేవ మహాదేవ శంభో సదాశివా