Friday, November 5, 2021



అక్షరాలతోనే సచ్చిదానందాలు

పదాల పోహణింపులో ఆహ్లాదాలు

భావాలు కవితలైతే తనివి దీరి మోదాలు

కల్పనాలోకంలోనే పండుగలు పర్వదినాలు


1.విడివడుతూ ఉన్నాయి ఇలలోని ముడులన్నీ

సడలుతూ ఉన్నాయీ సంసార బంధాలన్నీ

కర్తవ్య పాలన కొరకే కాలాన్ని కరిగించేది

విద్యుక్త ధర్మానికే కట్టుబడుతు జీవించేది


2.మురిసి పోవడానికీ గతమించుక మిగిలుంది

సేద దీరడానికి గీతమక్కున జేర్చుకుంది

సాంత్వననే పొందడానికి మిథ్యాజగత్తొకటుంది

చేదు నిజం మరిపించేలా గమ్మత్తులొ ముంచుతుంది


https://youtu.be/hqe2Rb3k0WA?si=vRlF_Xw4SDvGxByI


కనకమహాలక్ష్మి కాలి అందియల లయ

జ్ఞానభారతి కఛ్ఛపి వీణియ శ్రుతి కలయ

ఆదిపరాశక్తి ఖడ్గ కాంతులు వెలయ

కావాలి మీ గృహమే కోటి కాంతుల నిలయ

బంధు మిత్రులారా అందుకోండి దీపావళి శుభాకాంక్షలు

కీర్తీ సుఖ సంపదలే  వరమీయాలి 'మా' 'క్షేమ' భాషా లక్ష్ములు


1.ప్రియమగు వాక్కులే  రసనలు పలికేలా

హితమగు యోచనలే  మేధలు చిలికేలా

జనరంజకమౌ సాహితీ సంగీతములొలికేలా

వర్షించాలి శ్రీవాణి కరుణాదృక్కులే నిలువెల్లా

బంధు మిత్రులారా అందుకోండి దీపావళి శుభాకాంక్షలు

కీర్తీ సుఖ సంపదలే  వరమీయాలి 'మా' 'క్షేమ' భాషా లక్ష్ములు


2.నరదృష్టి దోషాలనన్నటినీ పరిమార్చగా

శత్రు పీడ నీడ కూడ సమూలంగ తీర్చగా

ఆయురారోగ్యాలే సర్వదా సమకూర్చగా

రక్షించాలి భగవతి నిత్య శోకాల నోకార్చగా

బంధు మిత్రులారా అందుకోండి దీపావళి శుభాకాంక్షలు

కీర్తీ సుఖ సంపదలే  వరమీయాలి 'మా' 'క్షేమ' భాషా లక్ష్ములు


3.పరుల నడుగ చేయిసాచు గతి ద్రోయక

ఋణము కోరు తరుణమెపుడు రానీయక

అవసరాలు తీరునటుల సొమ్ముల నొసగగ

అనుగ్రహించాలి సిరియే సంతృప్తి మీరగ

బంధు మిత్రులారా అందుకోండి దీపావళి శుభాకాంక్షలు

కీర్తీ సుఖ సంపదలే  వరమీయాలి 'మా' 'క్షేమ' భాషా లక్ష్ములు


https://youtu.be/mUD-pKKx5us?si=NqEA22i3ftJZaoOa

కనుల ప్రమిదల కరుణ దీప్తుల వెలిగించు

హృదయమందున మమత చమురును నించు

మనిషి మనిషిలొ బాంధవ్య కాంతులను కాంచు

పరిసరాలలొ పరికించి చూచి పరవశించు

అనుదినం ఈ లోకమంతా దీపావళి భాసించు


1.బోసినవ్వుల పాపలు

విరజిమ్ము రుచులు మతాబులు

పసిడి పసి పలుకులందు

చిటచిటల పేలు టపాసులు

పరిసరాలలొ పరికించి చూచి పరవశించు

అనుదినం ఈ లోకమంతా దీపావళి భాసించు


2.అర్ధాంగి శ్రమని గుర్తిస్తె చాలు

ఆలి ఎద ఎగసేను చిచ్చుబుడ్డీగా

పత్నికందిస్తేనో కాసిన్ని ప్రశంసలు

ఇల్లాలి కన్నుల్లో పూసేను వెన్నెల తీగలు

పరిసరాలలొ పరికించి చూచి పరవశించు

అనుదినం ఈ లోకమంతా దీపావళి భాసించు



ప్రతి నిత్యం దీపావళే నా ఇంట నువ్వుంటే

బ్రతుకంతా సౌదామినే నాకంట కొలువుంటే

నీ కన్నులు మతాబులు నీ నవ్వులు తారాజువ్వలు

మిసమిసలతొ తిరుగాడితే వెలుగు వెన్నెల తీగలు

రుసరుసగా మాటలు రువ్వితె అవ్వే  సీమటపాసులు


1.దుబారా నరకుని దునుమాడె సత్యభామవే

గుట్టుగ ఖర్చులు నెట్టుకవచ్చే విజయలక్ష్మి వే

నీ నడకలు భూచక్రాలు నీ ఆజ్ఞలు లక్ష్మీ బాంబులు

చెరగని నవ్వుల సంపదలొసగే ధనలక్ష్మి నీవే

పండుగ సందడి నిండుగ నిలిపే వైభవలక్ష్మివే


2.ఆనందాల అతిథుల కళ్ళే వెలిగే దివ్వెలు

తృప్తితొ  అభ్యాగతులిచ్చే దీవెనలే  రవ్వలు

మువ్వల సవ్వడి వాద్యాలు గాజుల సడి మంత్రాలు

తీరగు రుచులతొ కమ్మని విందిడు ధాన్యలక్ష్మివే

గుండెలొ దండిగ కొలువై ఉండెడి నా గృహలక్ష్మివే

తెల్లారిందా లేచామా-పళ్ళుతోముకున్నామా

చాయో కాఫో తాగామా-ఇడ్లీ ఉప్మా తిన్నామా

ఆఫీసుకి బయలెళ్ళామా-సాయంత్రం తిరిగొచ్చామా

ఇంతేగా జీవితమంటే ఎలా-ఇంతేగా కారణమంటే సరా


1బ్రేక్ ఫాస్ట్ మెనూ ఏమిటో-లంచ్ లోకి స్పెషల్ ఏమిటో

నోరూరించుకొంటూ చాట్ చేసుకుందామా

జోకుల్ని నంజుకుంటూ కబురులాడుకుందామా

ఇంతేగా జీవితమంటే ఎలా-ఇంతేగా కారణమంటే సరా


2.గ్యాసిప్పులనే సిప్ చేస్తూ-గోల్డెన్ డ్రీమ్స్ నెమరువేస్తూ

ఊకదంపుడు సోది పంచుకుందామా

ఉత్తుత్తి అనుబంధాలే పెంచుకుందామా

ఇంతేగా జీవితమంటే ఎలా-ఇంతేగా కారణమంటే సరా


3.సామాజిక మాధ్యమం వేదికగా-ఆచరణకు సాధ్యంకాని ప్రణాళికగా

ఉల్లిపొరలు విప్పడమే  ప్రహేళికగా-ఊహల్లో కాపురముందాం సరదాగా

ఇంతేగా జీవితమంటే ఎలా-ఇంతేగా కారణమంటే సరా