Thursday, March 31, 2022

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కోయిల మూగవోతుంది

కిసలయాలు కరువైతే

నెమలి నాట్యమాగుతుంది

మేఘమాల కనరాకుంటే

వసంతమెలా వస్తుంది

వనమెల్ల విరియకుంటే

నా కవిత ఎలా వెలుస్తుంది

నీతో స్ఫూర్తి పొందకుంటే


1.పావనమని తోస్తుందా

మందిరాన దేవే లేకుంటే

కనులకింపునిస్తుందా

కలువలేని కొలనుంటే

పున్నమైనా వెన్నెలకాసేనా

శశికి మబ్బులడ్డొస్తుంటే

నా కవనమెలా పొడుస్తుంది

నీ ప్రేరణ వరించకుంటే


2.పాల పిట్ట కనరాక

పండగెలా ఔతుంది దసరా

రంగవల్లి ముంగిట లేక

సంకురాతిరి సంబురమా

దివ్వెలే వెలుగని వేళ

దీపావళి అరుదెంచేనా

నా భవిత  గెలుస్తుందా

వెన్నుదన్ను నువు లేకున్న

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కవిత్వమంటే కల్పనా చాతుర్యత

కవిత్వమంటే అతిశయమొలికే సామాన్యత

గోరంతలు కొండంతలుగా మలచితే కవిత

నల్లరాతికి నగిషీలు చెక్కితే అద్భుత భావుకత

ఐనా సరే నీమీద చెప్పిన కవితలన్నీ అక్షర సత్యాలే

నిజమే చెలీ నీ గురించి పాడిన గీతాలైతే ఆణిముత్యాలే


1.దేవకన్యలు పోలికలై వరుస కడతారు

అప్సరసలు ఉపమానాలుగ నిలబడతారు

కావ్య నాయికలంతా జేరి నిను కొనియాడేరు

అలంకారమే కవితకు అలంకారమనియేరు

ఐనా సరే నీమీద చెప్పిన కవితలన్నీ అక్షర సత్యాలే

నిజమే చెలీ నీ గురించి పాడిన గీతాలైతే ఆణిముత్యాలే


2.చిలవలు పలవలుగా ఆకసానికెత్తేస్తారు

ఉబ్బితబ్బిబ్బయ్యేలా ఊదరగొడతారు

నీలా ఇలలో లేనే లేరని ఇట్టే పొగిడేస్తారు

కవితావస్తువు వనితైతే మరి కట్టిపడేస్తారు

ఐనా సరే నీమీద చెప్పిన కవితలన్నీ అక్షర సత్యాలే

నిజమే చెలీ నీ గురించి పాడిన గీతాలైతే ఆణిముత్యాలే

https://youtu.be/YUiOQ--nyMU?si=6OSgqLqURIzQJyT5

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: శంకరాభరణం

సాయీ యను పిలుపులోనె హాయి ఉన్నది
సాయినామ స్మరణలో తన్మయత్వమున్నది
సాయి ఎడల ఎడదలో నమ్మకమున్నది గట్టి నమ్మకమున్నది
సాయిని కోరుకొనగ ఏమున్నది ఇంతకన్న ఏమున్నది
సాయిరాం షిరిడీ సాయిరాం సాయిరాం షిరిడీ సాయిరాం 

1.సాయి కనులలో అపారమైన కరుణ ఉన్నది
సాయి చూపులో విశేషమైన ఆకర్షణ ఉన్నది
సాయి సన్నిధానంలో శాంతి ఉన్నది ప్రశాంతి ఉన్నది
సాయి బోధలందున క్రమత ఉన్నది మానవత ఉన్నది
సాయిరాం షిరిడీ సాయిరాం సాయిరాం షిరిడీ సాయిరాం 

2.సాయి పాదాలలో పావన గంగ ఉన్నది
సాయి చేతిలో అక్షయ పాత్ర ఉన్నది
సాయి ఒసగు విభూతిలో ఔషధమున్నది ఐశ్వర్యమున్నది
సాయి భక్తి భావనలో తృప్తి ఉన్నది జీవన్ముక్తి ఉన్నది
సాయిరాం షిరిడీ సాయిరాం సాయిరాం షిరిడీ సాయిరాం