Saturday, May 8, 2021

 "మాతృదినోత్సవ శుభాకాంక్షలతో"-


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ధర్మవతి


కాలం మారింది వయసు మీరింది

ఏ మాత్రం మారంది అమ్మా  నీ మనసే

చెక్కుచెదరకుంది ఇప్పటికీ నీ ప్రేమే

నా పాలిటి దేవతవే అమ్మా పాదాభివందనాలు

"ననుగన్న దినమిది" మన్నించి కురిపించు దీవెనలు


1.కథలెన్నో చెప్పమని వేధించా  చిననాడు

నిత్యం నిను పాడమనీ సతాయిస్తి అలనాడు

మౌనంగా ఉండమంటినిపుడు ఆయాసపడవద్దని

ధ్యానించమంటిని నిరతము ఐహిక ధ్యాస వద్దని

నా పాలిటి దేవతవే అమ్మా పాదాభివందనాలు

"ననుగన్న దినమిది" మన్నించి కురిపించు దీవెనలు


2.ఊతకర్ర కొనియిస్తిని చేయిపట్టి నడిపించిన నీకు 

చేరువైన మనకపోతిని కనురెప్పగ ననుకాచిన నీకు

పథ్యమంటు నీనోరుకట్టివేస్తిని రుచులు కొసరితినిపిస్తివే

ప్రతిదినం పలకరించనైతిని చీటికిమాటికి నన్నే పలవరిస్తివే

నా పాలిటి దేవతవే అమ్మా పాదాభివందనాలు

"ననుగన్న దినమిది" మన్నించి కురిపించు దీవెనలు



శ్రీశ్రీనివాసం శ్రితపారిజాతం

మా ప్రణతులివే గైకొనుమా సతతం

పద్మావతి అలమేలు మంగా సహితం

చేకూర్చర  సర్వదా మహి మహితహితం

గోవింద గోవింద పాహి ముకుందా

నారాయణ వాసుదేవ రమానందా పరమానందా


1.కట్లుబాట్లు మాకుంటే భరించుకోలేము

మా స్వేఛ్ఛను హరిస్తే సహించగాలేము

ఆంక్షలన్నవెపుడు మాకు   ఆకాంక్షలు కాబోవు

విచ్చలవిడి బ్రతుకె మాకు సంబరాల తావు

ఐనా సరె మమ్ములను నీవె ఆదుకోవాలి

కరోనా బారిబడితె నీవే చేదుకోవాలి॥గోవిందా॥


2.గాలిలోన దీపముంచి నీ ఉనికిని ప్రశ్నిస్తాం

చేతులైన కాపుంచక నీ మహిమను ఆశిస్తాం

చిత్తశుద్ది మావద్ద ఎంత మాత్రమూ లేదు

దైవభక్తి అంటేనే మామనసుకు కడుచేదు

మాపని ఏదైనా నీ పని మము సాంతం కావడమే

నీవిక చక్రం సంధిస్తే కరోనా అంతం కావడమే॥గోవిందా॥