రాగం:హంసానంది
కన్నులు కాయలు కాచాయి అదేదో వింత అనుభవం
అనుక్షణం నీకై వేచాయి ఇదేదో కొత్త లక్షణం
నువ్వెలా ఉన్నావో నీ సంగతి ఎరుగనైతినే
నన్ను తలిచేవో లేదో నిన్నెప్పుడు మరువనైతినే
1.ప్రేమ అంటె ఏమిటో కాసింత రుచిచూపావు
విరహాన్నీ వెనువెంటే పరిచయం చేసావు
తీయనైన వేదనలోకి నిర్దయగా నను తోసావు
మోయలే నంతబరువుగా నా గుండెను మార్చేసావు
నీకెలా ఉంటుందో నీ సంగతి ఎరుగనైతినే
నన్ను తలిచేవో లేదో నిన్నెప్పుడు మరువనైతినే
2.సుఖంగా ఉండేవాడిని సుడిలోకి నెట్టేసావు
హాయిగా మసలేవాడిని అలమటింపజేస్తున్నావు
కలయికలే కలలైపోగా కన్నీరు వరదైసాగే
చెవిని ఆనించు నా ఎదపై నీ పేరే మారుమ్రోగే
నువ్వెలా స్పందిస్తావో నీ సంగతి ఎరుగనైతినే
నన్ను తలిచేవో లేదో నిన్నెప్పుడు మరువనైతినే