Thursday, January 13, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నచ్చడానికి ఏముంటుంది కారణం

నచ్చనంత మాత్రనా చేయగానేల రణం

పెట్టబుద్దైతుంది కొందరిని చూస్తే

మొట్టబుద్దైతుంది కొందరు ఎదురొస్తే

భరించగాలేము బ్రద్దలైనంత   నిజాలు

పుర్రెకోబుద్ధిగా జిహ్వకో రుచిగా ఎంత వింత నైజాలు


1.ముఖప్రీతి మాటలు హితకరమగు ప్రియవచనాలు

గోరంతలు కొండంతలుగా మసాలా దట్టించి పచనాలు

మసిపూసి మారెడిగా చూపించెడి సులోచనాలు

పొగడ్తలే సరిపడలేనపుడు   ఎడతెగని విరోచనాలు

భరించగాలేము బ్రద్దలైనంత   నిజాలు

పుర్రెకోబుద్ధిగా జిహ్వకో రుచిగా ఎంత వింత నైజాలు


2.వ్యక్తులకే విలువ ఎక్కువ విషయంలో విషయం లేకున్నా

పరిచయాలకే ప్రాముఖ్యత ప్రజ్ఞాపాటవాల మాటే సున్నా

ఎందుకా వెంపర్లాట లోకం మననే చూడనప్పుడు

సాగిపోవాలి బెదరక వినబడేది తాటాకుల చప్పుడు

భరించగాలేము బ్రద్దలైనంత   నిజాలు

పుర్రెకోబుద్ధిగా జిహ్వకో రుచిగా ఎంత వింత నైజాలు

 

https://youtu.be/F9JEVnuoZxA

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉత్తపుణ్యానికే-ఉత్తర ద్వారం ద్వారా దర్శనం

అలవోకగనే -అలవైకుంఠపుర ప్రతీహార ప్రవేశం

తిరుమలలో వేంకటపతి దివ్య వైభోగం

ధర్మపురిలొ నరకేసరి సరిలేని వైభవం

చూసిన వారికిలన సుందర దృశ్యము

దర్శనమాత్రాన జీవితమే ధన్యము


1.ముక్కోటి దేవతలకు మాత్రమే దక్కునది

వైకుంఠ ఏకాదశీ రోజుననే చిక్కునది

నిరంతరం హరినామ స్మరణలో భక్తజనం

కన్నులే చెమ్మెలుగా చూపుల నీరాజనం

చూసిన వారికిలన సుందర దృశ్యము

దర్శనమాత్రాన జీవితమే ధన్యము


2.ఏడాది పొడగునా వేచును ఏడేడు లోకాలు

వీక్షించగ ప్రతీక్షించు పదునాల్గు భువనాలు

అంతరించేను స్వామినిగన భవబంధనాలు

తరించేను ఉపవసించి మానవ జీవనాలు

చూసిన వారికిలన సుందర దృశ్యము

దర్శనమాత్రాన జీవితమే ధన్యము