Monday, September 7, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:యమన్ కళ్యాణి

కడదాక మిగిలేనా స్పందన కరువైన బంధం
ప్రాకులాడి ప్రాధేయపడడం హాస్యాస్పదం
కావలించుకుంటే రాదు కడుపులో లేనిది
కొనలేము వెల చెల్లించి పరస్పరం నచ్చనిది

1.వ్యక్తిత్వ శిఖరం నుండి ఒకరికొరకు జారకు
నీదైనతత్వం నుండి ఎపుడు దిగజారకు
మంచిచెడ్డ లెంచగలిగే తూనికరాళ్ళేవి లేవు
అవతారపురుషులూ సర్వులను మెప్పించలేరు

2.అభిమానించాలి నిన్ను నిన్నుగానే
ఆదరించగలగాలి మనసారా మిన్నగానే
పైమెరుగులు సవరించడమే సలహా అన్నది
మరకనెరుకపర్చవచ్చు తప్పేమున్నది
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రెప్పవేయనీయనిదే అందమంటే
మనసుకొల్లగొట్టేదే సౌందర్యమంటే
మనుషుల అనిమేషుల చేసేదే సోయగమంటే
పశుపతి మతినీ పోగొట్టేదే సౌష్ఠవమంటే
నిదురకు దూరమైనాను చెలీ నినుచూసి
వెర్రివాడినైనాను నినుగని నే భ్రమిసి

1.రాజ్యాలు రాసి ఇచ్చేదే సొగసంటే
యుద్ధానికి సిద్ధంచేసేదే పొంకమంటే
కవనాలు పెల్లుబికించేదే చెలువమంటే
గానాల నెలుగెత్తించేదే విన్నాణమంటే
బికారినయ్యా తెగించి ఉన్నా  చెలీ నీకోసం
వాగ్గేయకారుడినైపోయా ఈ నిమిషం

2.మత్తులోన ముంచెత్తేదే మురిపెమంటే
నోరెళ్ళ బెట్టించేదేనే సఖీ నెయ్యమంటే
అసూయాగ్ని రెకెత్తించేదే హవణిక అంటే
కైవశముకై పురికొలిపేదే కోమలికమంటే
సోయిలేదు యోచనలేదు చెలీ నీ వల్ల
గుండెగుల్ల చేసావే నిను వదలుట కల్ల
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:భీంపలాస్

మనసెరిగిన భాషయే  మమత కదా
మమత పంచినపుడల్లా ఆనందమే సదా
కరిగిపోని తరిగిపోని పెన్నిధే అనురాగం
ప్రేమ విశ్వజనీనమైతె అది ఘనయోగం

1.లావాదేవీలు-లాలూచీలు-ప్రేమలోన మృగ్యం
తారతమ్యాలు-ఏ భేషజాలు-ప్రేమలో అసహజం
ప్రేమకు వలపునకు హస్తిమశకాంతరం
చరాచరాలన్నిటిపైనా ప్రేమే మనోహరం

2.మాతాపితరులు- కనబరచెడి- వాత్సల్యం
సోదరీ సోదరుల -నడుమన -అనురాగం
దంపతుల మధ్యలో అల్లుకున్న ప్రణయం
బలమైన స్నేహంగానూ ప్రేమే బహుముఖం