Monday, August 31, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

శివతత్వ మెరుగరా నరుడా
శివోహమగునటుల కరుగరా జడుడా
భవజలధి దాటించు భవుడు
భయనివారకుడు భైరవుడు

1.సామాన్యమై చెలఁగు సాధుజీవనము
అనితరసాధ్యమౌ అద్వైత భావనము
దిగమ్రింగుకొనగలుగె జనహానికరములు
తనకంటులేకుండ పంచె ఐశ్వర్యమ్ములు
కైవల్యదాయకుడు కైలాసవాసుడు
కరుణాంతరంగుడు ఖట్వాంగధరుడు

2.ఇవ్వడం మినహా శంభుడాశించడు
తోయము పత్రితో పరమ సంతుష్టుడు
ఎవరికీ చెందని అవ్యక్తుడా విశ్వైక యోగి
అందరికి అందేటి సుందరేశ్వడా విరాగి
భూతనాథుడు భూరి పురహరుడు మదనారి
విశ్వనాథుడు అజుడు జడదారి ఝర్ఝరి

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నిదురలేమి కలవరం
నిదురతోనే కల వరం
నిదుర మనిషికి దేవుడిచ్చిన దివ్యవరం
నిదుర మనిషి బడలిక తీర్చగ అత్యవసరం

1.ఆదరించి అక్కునజేర్చే నిదుర కన్నతల్లే
ఊరడించి ధైర్యంనింపే స్నేహితుడికిమల్లే
జీవక్రియలు కొనసాగుటలో ఉత్ప్రేరకం నిద్ర
జీవజాలమంతటికీ జన్మసహజమైంది నిద్ర

2.జోగునిద్ర కలత నిద్ర మగత నిద్ర గాఢనిద్ర
ఆరోగ్యపాలనలో నిద్రదే బలమైన ముద్ర
కంటిమీద కునుకే ఉండదు దీక్షాదక్షులకు
ఒంటిమీద సోయుండదు నిద్రన రంధిలేని వ్యక్తులకు

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మాయామాళవ గౌళ

ఉన్నట్టో లేనట్టో ఉండీలేనట్టో
ఔనన్నట్టో కాదన్నట్టో ఆ మౌనానికి అర్థం ఏమన్నట్టో
బెడిసికొట్టితీరుతుంది ప్రతిపాదనేది చేసినా
ఒడిసిపట్ట సాధ్యంకాదు తలక్రిందులు తపంచేసినా
భార్యా బాధితులారా మీకు నా సానుభూతి
నొక్కివక్కాణించగ నాదైన సహానుభూతి

1.నమ్రతగా అనుమతికోరును అందాల శ్రీమతి
నమ్మి కాలరెగురేసామా మన పని ఇక అధోగతి
 వందలాది ముందుపరచినా నిర్ణయాలు అర్ధాంగివే
గింజుకుంటె లాభమేమి పందాన గెలుపు గృహిణిదే
భార్యా బాధితులారా మీకు నా సానుభూతి
నొక్కివక్కాణించగ నాదైన సహానుభూతి

2.ఏకులాగ ఎదలోదూరి మేకులాగ దిగబడుతుంది
అదుపాజ్ఞల భయపడుతూనే మహానటిగ మారుతుంది
అతిథిలాగ అడుగును మోపి అజమాయిషి చేసేస్తుంది
వాదించి నెగ్గే యోధుడికై జగతి వేచి చూస్తోంది
భార్యా బాధితులారా మీకు నా సానుభూతి
నొక్కివక్కాణించగ నాదైన సహానుభూతి

OK


తరిగిపోదు అందం తరుణిదెప్పుడు
ఇగిరిపోదు  చందనగంధం ఇంతిదెన్నడు
తరాలెన్నిమారినా ఇనుమడించు తన్వి సోయగం
మాతృత్వం తొణికిసలాడగ మానిని సౌందర్యం

తరిగిపోదు అందం తరుణిదెప్పుడు
ఇగిరిపోదు  చందనగంధం ఇంతిదెన్నడు
తరాలెన్నిమారినా ఇనుమడించు తన్వి సోయగం
మాతృత్వం తొణికిసలాడగ మానిని సౌందర్యం

మబ్బు మూటగట్టుకొంది మగువ కురుల స్వైరవిహారం
సంజె సంతరించుకుంది సుదతి నుదుటి సింధూరం
చంద్రవదన సరస్సులోనా కనులబోలె కలువల వైనం
మంకెనల సింగారం సిగ్గుల బుగ్గల నయగారం

తరిగిపోదు అందం తరుణిదెప్పుడు
ఇగిరిపోదు  చందనగంధం ఇంతిదెన్నడు
తరాలెన్నిమారినా ఇనుమడించు తన్వి సోయగం
మాతృత్వం తొణికిసలాడగ మానిని సౌందర్యం

రూపుదిద్దుకుంది శంఖం రమణి కంఠ మాధారంగా
గిరులు పెరిగిపోయాయి గరిత  ఎడదతొ పోటీపడగా
సెలయేరు మెలికలన్నీ హంసయాన తృటి కటివలన
జలపాతం దూకుడు సైతం తనుమధ్య పొక్కిలిలోన

తరిగిపోదు అందం తరుణిదెప్పుడు
ఇగిరిపోదు  చందనగంధం ఇంతిదెన్నడు
తరాలెన్నిమారినా ఇనుమడించు తన్వి సోయగం
మాతృత్వం తొణికిసలాడగ మానిని సౌందర్యం
అలజడి రేపకు చెలికాడా
ప్రశాంత మానస సరోవరానా
చిత్తగు ఒత్తిడి వద్దుర మగడా
గుంభనాల సంసార సాగరానా
దొరికావులే సరిజోడుగా తపించగా వరానా
మన సంగమాలెపుడూ ప్రేమదీవి తీరానా

1.చీకాకుల అనుదినచర్యకు ఆటవిడుపు నువ్వు
చీకటి ముసిరిన రాతిరికి పొద్దుపొడుపు నువ్వు
నిస్సారపు జీవనఝరికి కొత్తదైన మలుపే నువ్వు
నీ తలపులు నాలో లోలో చల్లని వెన్నెలలే రువ్వు
దొరికావులే సరిజోడుగా తపించగా వరానా
మన సంగమాలెపుడూ ప్రేమదీవి తీరానా

2.నా మది కిటికీ తెరవగనే మలయానిలమై దూరేవు
నెమ్మది నెమ్మది వేదన నార్పే సాంత్వననే కూరేవు
పనిబడి బడలిక తీర్చేమందగు లాలిపాటగా మారేవు
నిద్దురలోకి జారగనే మధుర స్వప్నమై నను చేరేవు
దొరికావులే సరిజోడుగా తపించగా వరానా
మన సంగమాలెపుడూ ప్రేమదీవి తీరానా