Monday, November 14, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏ అర్థం తీసుకున్నా  కోమలమే నీ గాత్రం

ఎలా పరిగణించినా  ఆహ్లాదమె నీ హాసం

నడకల జలపాతానివి పలుకుల పారిజాతానివి

మొత్తంగా నువ్వే ఇంద్రజాలనివి

చిత్తాన్నేదో చేసే  వర్ణ చిత్రానివి


1.కేంద్రకాన సాంధ్రమైన సూర్య గోళానివి

 గ్రహగతుల గతిపట్టించే గుండెల కళ్ళానివి

మతికి స్థిమితం దూరంచేసే గందరగోళానివి

బ్రతుకు నతలాకుతలం చేసే వేళాకోళానివి

మొత్తంగా నువ్వే ఇంద్రజాలనివి

చిత్తాన్నేదో చేసే  వర్ణ చిత్రానివి


2.తళుకులీను తారలైనా నీ చంద్రకళా ప్రీతులు

కలలుకనే చకోరాలూ తనూ చంద్రికా తప్తులు

కార్తీక  కౌముది నీ కౌగిలికీ కారు యతులతీతులు

ఆ రతీ భారతీ నీతో తులతూగక ఎత్తారు చేతులు

మొత్తంగా నువ్వే ఇంద్రజాలనివి

చిత్తాన్నేదో చేసే  వర్ణ చిత్రానివి


https://youtu.be/mCa3FvJYdME?si=Bdx10u7g5PdPq9FQ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిష్టూరమాడడం నీకు పరిపాటైంది

నిర్ఘాంతపోవడం నాకు గ్రహపాటైంది

నిరంతరం బ్రతిమాలుట పొరపాటైంది

నియతి లేని బ్రతుకు నిప్పు చెర్లాటైంది నగుబాటైంది


1.నేను నీకు ఎంతో ప్రత్యేకం 

 కాలేను నేను గుంపులో గోవిందం

నాకైతె లోకానా నువ్వే ఏకైకం

నేనుమాత్రమే నీకనుకుంటే ఆనందం

నీ పంచప్రాణాలు నేనైపోవాలి

నే పంచభూతాలై నీలో కలవాలి


2.నిర్లిప్తత నేమాత్రం నే సైచను

తారస పడితేనే నేస్తమంటే నేనోపను

తళుక్కున మెరవాలి శ్వాస నడుమ నేను

చెలీ ఒదిగిపోవాలి నీ ఎద లయగానూ

భావుకతను పలుచన చేస్తే ఎలా వేగను

నీవంటూ బ్రతుకున లేక ఎలా బ్రతుకను

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మాయామాళవ గౌళ


తందానాలాడే సుందరయ్యా

చిందులేసే తిక్క శంకరయ్యా

అంగలార్చినా తొంగిచూడవు

ఒక్కసారీ… మాదిక్కైన గానవు

మారాజువంటూ నిను నమ్ముకుంటి

మరలైన సూడవె మాదేవ ముక్కంటి


1.సొమ్ములడిగానా సోకులడిగానా

పొలములు పుట్రలు చెలకడిగానా

కమ్మన్ని గొంతుని ఇమ్మనంటిని గాని

నీలకంఠ నీగళమంటిదిస్తివే సామి


మారాజువంటూ నిను నమ్ముకుంటి

మరలైన సూడవె మాదేవ ముక్కంటి


2.ముక్కైన మూసుకొనుంటవు

తైతక్కలైనా ఆడుతు ఉంటవు

చిక్కుల్లొ మేముండి మొక్కుకుంటే

చిక్కవు దొరకవు రుక్కుల్ని బాపవు


మారాజువంటూ నిను నమ్ముకుంటి

మరలైన సూడవె మాదేవ ముక్కంటి