Tuesday, March 23, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విష్ణు పాదాబ్జ జనిత

బ్రహ్మకమండల సంభూత

శివజటాఝూట విలసిత

హిమ శిఖర ప్లావిత

గంగా సమ పునీత నా కవిత

పుట్టేది ఏ విధో,తట్టేది ఏ మదో


1.భవమే అనుభవమే ఒక భావమై

హృదిని ఉత్తేజపరచు అనుభూతియై

అంతశ్చేతనలో అస్పష్టరూపమై

అక్షరమే జీవ కణమై పదతతి ప్రాణసద్మమై

అవతరిస్తుంది నాదైన కవిత 

తరింపజేస్తుంది ఏ సరస మదో


2.ఊహయే అనూహ్యమై భవ్యమై

గత కవితల తలమానికమై నవ్యమై

శైలీ శిల్పములో మాన్యయై అనన్యమై

కవనమంత రసాలఫలరసమై రమ్యమై

అలరింప జేస్తుంది నాదైన కవిత

రంజింపజేస్తుందే పాఠక మదో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కలనైనా కలవాలని ఉంది

నీ కౌగిట వాలాలని ఉంది

వరమొసగెడి దేవతనడిగి

నా మనసుకు రెక్కలు తొడిగి

ఉన్నఫళంగా- నీవున్నతావే నాకు దేవళంగా


1.తపిస్తున్నాను నీకై ఒక మునిలా

పరితపిస్తున్నా సీతకై రామునిలా

నిరీక్షిస్తున్నా పికముకై ఆమనిలా

ప్రతీక్షిస్తున్నా తారకకై సోమునిలా


2.అల్లుకున్న బంధనాలే అశనిపాతం

పెల్లుబికే కన్నులలో అశ్రుజలపాతం

వెల్లువెత్తు వేదనకు నీ తలపే నవనీతం

వెల్లడించలేని ప్రేమే నా హృదయగతం