Saturday, October 20, 2018

బురదలోనె పుట్టినా మకిలి అంటనీయదని
పరిమళమే లేకున్నా  పునీతగా ఉంటుందని
కళ్ళకద్దుకొన్నాము ఒంటిగా కమలాన్ని
నెత్తినెట్టి కొలిచాము దైవమంటు అబ్జాన్ని
జన నమ్మిక వమ్ముచేయనది యే వి ధా న మో
ప్రగతిలేక నీతిగా జాతి మనుటె ప్ర ధా న మో..

1.మానలేని రోగాలకు చేదు మాత్ర మింగించి
కుంటుకుంటు నడుస్తుంటె రెండుకాళ్ళు విరిచేసి
ఉన్నదేదొ తినబోతే నోరుకాస్త కుట్టేసి
దాచుకున్న సొమ్మంతా దయ్యంలా మాయచేసి
లోకమంత తిరుగుతూ ఇంటి ధ్యాస మరిచేసి
లాభమేంటి కచ్చేరికై గొప్పలెన్నొకోసి
కొండంత రాగంతీసి పల్లవితో వదిలేసీ
జన నమ్మిక వమ్ముచేయనది యే విధా'నమో
ప్రగతిలేక నీతిగా జాతి మనుటే ప్రధా'నమో..

2.తాతల నేతుల ఘనతను జాతిపట్ల పంచి
అవినీతి అంటుకొన్న చేతిని కడిగేయనెంచి
ఏ అతుకులబొంతైనా చింతేయని భావించి
అతులిత ప్రతిభను గతచరితనగాంచి
పదవుల అందలాల అవలీలగ ఎక్కించి
కొందరికేకొమ్ముకాచి సామాన్యుల విదిల్చి
జన నమ్మిక వమ్ముచేయనది యే విధా'నమో
ప్రగతిలేక నీతిగా జాతి మనుటే ప్రధా'నమో..

3.భావి భవనమేమొ గాని బ్రతకు బజార్ పాల్జేస్తే
పన్నుకట్టి దున్నెద్దును అదే పనిగ పొడుస్తుంటె
సగటుజీవి సొంతసొమ్ము నందని ద్రాక్షగజేస్తే
పెద్దలింక పెద్దలై పేదలు నిరుపేదలైతె
రద్దుల పద్దులెగాని ఫలితాలు వ్యర్థమైతె
అంతర్జాలమాయలో వికాసంనల్లపూసైతే
దిక్కులేక ఆముదమె  వృక్షంగా తలపోస్తే
ఓటు తెలుపు గుణపాఠం చరితే పునరావృతం
మేలుకొనిన మేలుగలుగు చేసుకోగ ప్రాయశ్చిత్తం