Wednesday, February 3, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఈ ఒంటి కంటి కొంటె చూపులేంటో

నీ పంటినొక్కు వెంటాడగ వలపు పిలుపులేంటో

జడుడైనా మడివీడి నీ జంటగా మారడా

మునియైనా తపముని మాని తుంటరైపోడా

కేశిని కలశస్తని తాటంకిని నితంబిని 

నెరజాణా తరళేక్షణా సరస శృంగార వీణా 


1.వాలు చూపులు ఓర చూపులు దాటేసినావే

వేలి చుట్టులు కాలి గీతలు మించిపోయావే

నర్మగర్భ ఆహ్వానాలు మాయమాయెనే

సంకేత పదబంధాలు పాతవింతలాయెనే

విప్పేయకే చప్పున ఇప్పుడే విస్మయగుప్పిటి 

ఊరించగ ఉడికించగ రాజేయవే తపనల కుంపటి


2.ఏటివంక నువ్వు రావడం నీటివంకతో

గోడ మాటు మాట కలపడం గోరువంకతో

కోవెల గంటల గణగణలో రహస్య భాషలో

కోనేటి కలువలడగడం కలువగ మిషతో

అపురూపమౌ అరుదైన ఆ విలక్షణ లక్షణాలు

అనుభూతులై ఆహ్లదమొలుకగ నిరీక్షణ క్షణాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏది కమలమో పద్మముఖీ భ్రమరానికి విభ్రమమే

ఏది ఝషమో మీనాక్షీ జాలరికీ  సంశయమే

కెంపులు వెలవెలబోయాయి నీ చెంపల సోంపు చూసి

దానిమ్మలు ఖంగుతిన్నాయి నీ దంతాల ఇంపు గాంచి

నీలవేణీ నీవంటి నాయకిలేదు ఏ కావ్యాన

ఇగురుబోణి నినుబోలిన ఇంతేలేదు లోకాన


1.పూవనమే నీ తనువు యవ్వనమే నీ ధనువు

పావనమే నీతో మనువు జీవనమే దివితావు

 అనన్యమౌను సంగమం ధన్యమౌను నీతో జన్మము

నీలవేణీ నీవంటి నాయకిలేదు ఏ కావ్యాన

ఇగురుబోణి నినుబోలిన ఇంతేలేదు లోకాన


2.ఊహలకే పరిమితము నీవేనా అభిమతము

మరిచానే నా గతము నువ్వే ఇకనా జీవితము

బ్రతుకే నీకు అంకితము నీతో భవితే కాంచనము

నీలవేణీ నీవంటి నాయకిలేదు ఏ కావ్యాన

ఇగురుబోణి నినుబోలిన ఇంతేలేదు లోకాన

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాఫీగ రోజుసాగాలంటే

కాఫీలు చాయలు తాగాలంతే

సూఫీ కవితలు తెలియదంటే

మాఫీ చేసేదంటూ లేనేలేదైతే

ఉత్తేజమేదో అలలెత్తుతుంది కాఫీ ఆస్వాదిస్తే

చైతన్యమేదో శివమెత్తుతుంది తేనీరు సేవిస్తే


1.సురాపానమే మానేవాళ్ళు 

అసురులు కాఫీ ఎరిగుంటే

సుధారసమునే గ్రోలకపోదురు

దివిజులు చాయను త్రాగుంటే

మైకమేదో కమ్ముతుంది కాఫీని చప్పరిస్తే

మత్తన్నదే ముంచెత్తుతుంది టీని సిప్ చేస్తే


2.తత్వాలెన్నో చెప్పేస్తారు

కాఫీని నమ్మెడి కాఫిర్లంతా

గజళ్ళనెన్నో గుప్పిస్తారు

చాయను కోరెడి షాయర్లంతా

కబుర్లకే వేదికలౌతూ కాఫీషాప్ లు

చిట్ చాట్ స్నేహపు బంధాలౌతూ టీకొట్టులు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వేతన జీవులు చేతన శూన్యులు

ఆ యాతన జీవులు వాస్తవ మాన్యులు

దేశానికి ఊతమై వరలే ధన్యులు

సగం జీతాన్ని జాతికి పంచే వదాన్యులు

జయహో ఆ పన్నుల వెన్నుదన్నులారా

జోహార్ బడుగు జనుల పెద్దన్నలారా


1.ధరలేమో ధరను వీడి గగనసుమాలై

నిత్యావసర వస్తువులే నింగిలొ తారలై

గుట్టుగా నెట్టుకొచ్చే కుటుంబరావులు బాహుబలులై

అప్పుకు గొప్పకు మధ్యన నలిగే అప్పుల అప్పారావులై


2.బెట్టుగ ఉట్టికి ఎగరలేక స్వర్గానికి నిచ్చెనలు

చీటికి మాటికి చీటీ పాటలె గండాలకు వంతెనలు

ఇంటినిండా విలాసాలుగా నెలసరి వాయిదాలు

మధ్యతరగతి మారాజులకు రోజూ మహా ప్రస్థానాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కూచిపూడి నర్తనమే భామా నీ కలాపం

కథాకళీ నృత్యమే పడతీ నీ తల్పవిలాపం

పేరిణీ శివతాండవే ప్రమదా నీ సంవిధానం

భరతనాట్యమే రమణీ గృహిణిగ నీ విన్యాసం


1.కస్సుబుస్సు లాడితె కలికీ ఒడిస్సీ లాస్యం

చరణాల త్వరణమె నారీ మణిపురీ విలాసం

నయనాల పంజళే నాతీ  కథక్ నృత్తము

మోహనాంగి వయ్యారాలే మోహినియాట్టం


2.పండుగ వచ్చింటే పాటలగంధీ భాంగ్రా నృత్యం

పెండ్లీపెరంటాలలో నెలతా నీనడకల  నట్టువాంగం

మొండిపట్టు సాధించే క్రమం ముదితా యక్షగానం

వండివార్చే సాధనలో వనితా అనునిత్యం గర్భానృత్యం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీవంటే  ఈశ్వరా నాకెంతో ఈర్ష్యరా

నెలవంక గల శంకరా మా బ్రతుకేల వంకరా

ఇరువురు సతులతో ఇద్దరు సుతులతో

నీవైతే చల్లంగ మనరా మాకేల ఈయవా దీవెనరా

హరునివైతే నీకో ధర్మమా నరులమైతే అది మాఖర్మమా


1.తల త్రెంచుతావు మరల మొలిపించుతావు

దహియించుతావు పిదప కనిపెంచుతావు

గుంజుకుంటివైతివే మము రంజిల జేయవే

బ్రతుకులకగ్గి పెడితివే ఎదలికనైనా చల్లార్పవే

హరునివైతే నీకో ధర్మమా నరులమైతే అది మాఖర్మమా


2.బిచ్చమెచ్చి తెచ్చినా ఆకలైతె మాన్పుతావు

మంచులోనె ముంచినా  వెచ్చగ బజ్జుంచుతావు

 ఒక ముద్దైనా నోటికింక అందకుండ జేసావే

మా నిద్దురనూ  కంటలేక పారద్రోలి వేసావే

హరునివైతే నీకో ధర్మమా నరులమైతే అది మాఖర్మమా౹

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అపచారమే భవా నీ ఉనికిని ప్రశ్నిస్తే

కడుపాపమే హరా నిను నిరసిస్తే

దయ్యాలకు మాత్రం పీడించే శక్తులా

భూతాలకు సైతం వేధించే యుక్తులా

పరమాత్మవు నువులేక ప్రేతాత్మలుండునా

జగత్పితవు నీముందు పిశాచాలు మనునా


1.పూజించిన వేళలో వరములైతె ఈయవు

దూషించినంతనే శాపమేల ఇచ్చెదవు

గతజన్మల కర్మలంటు కథలెందుకు చెప్పెదవు

జగత్కర్తవీవే కద మా తప్పని నుడివెదవు

నీ నాటకాలలో బలిపశువులు మేమా

నీకేళీవిలాసాల మేమాట బొమ్మలమా


2.దుష్టుమూక తాండవించ నీవొక జడుడివా

కష్టాలలొ మముద్రోయగ నీవూ దేవుడివా

దయ్యాలను శరణంటే కాస్తైనా కనికరించు

భూతాలను బతిమాలితె జాలైనా చూపించు

నిన్నే కదాశివా భూతనాథుడంటారు వృధాగా

నిన్నే సదాశివ వైద్యనాథుడంటారు అపప్రథగా