Monday, February 28, 2022

 

https://youtu.be/YvcA0SXTWnI?si=tYhHb3ObHfzpaPMU

రచన,స్వరకల్పన&గానం:డారాఖీ


*మహాశివరాత్రి-2022 శుభాకాంక్షలు*

రాగం:తోడి

ప్రణవనాద ప్రాభవా పరమేశ్వరా

పరంజ్యోతి స్వరూపా ప్రభాకరా

మహాలింగ విగ్రహా మహేశ్వరా

శాశ్వత శివదాయక శంభోహర శంకరా


1.సోమనాథ సంస్థిత సోమేశ్వరా

శ్రీశైల శిఖరాగ్ర గృహ శ్రీ మల్లీశ్వరా

ఉజ్జయినీ నగరేశ్వర  మహాకాళేశ్వరా

ఓంకార పురీశ్వరా అమరేశ్వరా


2.చితాభూమి స్థావరా వైద్యనాథా

ఢాకిన్య స్థిరా నమో భీమశంకరా

సాగర తీరాగారా శ్రీ రామనాథా

దారుకావన స్థితా నమో నాగనాథా


3.వారణాసి వాసా విశ్వేశ్వరా

గౌతమీతట నివాసా త్రయంబకేశ్వరా

హిమశిఖర విలాసా హే కేదారీశ్వరా

ఎల్లోరా ఘృష్ణేశ్వరా శ్రీ రాజరాజేశ్వరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హర హర హర నమః పార్వతీపతయే నమః

శివ శివ శివ శంభో మహాదేవాయ నమః

కాలకాలాయనమః ఫాలనేత్రాయనమః

రుద్రాయనమః భద్రాయనమః 

మహాలింగరూపాయ నమః గంగాధరాయనమః

రాజరాజేశ్వరాయనమః రామలింగేశ్వరాయనమః


1.నీల కంఠాయ నమః శూలహస్తాయ నమః

దిగంబరాయ నమః త్రయంబకాయ నమః

భూత నాథాయ నమః ప్రమధనాథాయ నమః

శంకరాయ నమః శశి శేఖరాయ నమః

నగధర సన్నుత నమః పన్నగ శోభిత నమః

రాజరాజేశ్వరాయనమః రామలింగేశ్వరాయనమః


2.భస్మధరాయనమః పురంధరాయనమః

జటాధరాయనమః మహానటాయ నమః

మృత్యుంజయాయ నమః నృత్య ప్రియాయ నమః

వృష వాహనాయ నమః శ్రీ వైద్యనాథాయ నమః

రాజరాజేశ్వరాయనమః రామలింగేశ్వరాయనమః

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అగ్గేమో ఎగసేను నీ కంటిగుండా

బుగ్గేమో పూసేవు నీ ఒంటినిండా

నీటి బుగ్గేమో నెత్తినుండి జారుతుండ

ఎలుగు బుగ్గేమో తలన ఎలుగుతుండ

చెప్పనలవిగాదు శంకరా నీకుండె సింగారమింకరా

మాతప్పులెంచకింకరా చప్పున ఇప్పుడె మా వంక రా


1.సంపేటి ఇసమేమో బొండిగనుండ

కాటేసె పామేమో నీ మెడలొ దండ

ఏనుగు తోలే నీకు కట్టే బట్టగనుండ

బుడబుక్క తిప్పేటి సప్పుడెప్పుడుండ

చెప్పనలవిగాదు శంకరా  నీకున్న గొప్పలింకరా

మాతప్పులెంచకింకరా చప్పున ఇప్పుడె మా వంక రా


2ఎద్దునెక్కినువ్వు తిరుగుతుండ 

ఇంటింటి బిచ్చంతొ నీకడుపునిండ

వల్లకాట్లోనే నీదైన కొలువుండ 

నీ ఇల్లుపట్టేమో ఆ ఎండికొండ

చెప్పనలవిగాదు శంకరా సన్యాసి నీ వాసినింకరా

మాతప్పులెంచకింకరా చప్పున ఇప్పుడె మా వంక రా

 

https://youtu.be/z6UgpVAjaXM?si=uRz_HidvkbJfTNg6

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కైలాసము నాకేల కైవల్యము నాకేల

కథలలో వినగనేల పరమశివా నీ లీల

ఉన్నట్టో లేనట్టో గమ్మునుంటె తెలియుటెలా

కదులు మెదులు ఎదలొ నీవె మా జీవ లయలా

కరుణామయుడవనే పేరుంటే అదిచాలా

కనికరించి దయకురియగ ఇంకా ఈ జాగేలా


1.పురాణాలు కావ్యాల ఎన్ని తార్కాణాలు

హరికథలు స్థలగాథల ఎన్ని నీ  నిదర్శనాలు

అంతటా లింగాలు అడుగడుగున నీ గుళ్ళు

నామమాత్రమే  కదా వెత దీర్చని దేవుళ్ళు

కరుణామయుడవనే పేరుంటే అదిచాలా

కనికరించి దయకురియగ ఇంకా ఈ జాగేలా


2.ప్రదోషకాల వ్రతాలు సంతతాభిషేకాలు

శివరాత్రి ఉపాసాలు జాగార ఉపాసనలు

హరహరమహాదేవ శంభోయను నినాదాలు

ఇవేకదా సదా శివా  మేమేరిగిన వేదాలు

కరుణామయుడవనే పేరుంటే అదిచాలా

కనికరించి దయకురియగ ఇంకా ఈ జాగేలా


డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

మొబైల్:9849693324P

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మది బృందావని కెంతగా ఎదురుతెన్నులు

మనమను యమునకు కాయలుకాచెను కన్నులు

కన్నయ్యా నీ హృదయమే వెన్నయ్యా

కనికరముతొ కని అరుదెంచగ నీకింతటి జాగేలయ్యా


1.ఆరాధనే అగుపించదా నేచేసే ఆరాధనలో

ఆ మీరా స్ఫురించదా నేసమర్పించే నివేదనలో

అనాథనైతిని నేను నను చేరదీయరా శ్రీనాథా

అక్కునజేర్చుకోవేరా ఆలకించి నా దీనగాథ


2.తీర్చావుగా పదహారు వేల గోపికల కోరికల

నెరవేర్చవేలనయా వారిలా నేకన్న తీపి కల

చోటులేకపోతెమానె కాసింతైనా నీ ఎడదన

కడతేరనీయి కన్నయ్యా నీ పదముల కడనైనా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


భారతీయులం మేము లౌకికవాదులం

కులమతాల ఆజ్యంలో రగిలే మంటలం

జాతీయత వలసిన చోట మతాల మతలబులం

హైందవమంటూ కలవని కులాల కంపులం

భిన్నత్వంలో ఏకత్వంగా మెలిగే పౌరులం

సమైక్యభారత సౌభ్రాతృత్వ వారసులం


1.మతం మనసు దాటనేల నమ్మిందే దైవం

తరచిచూస్తె అన్నిమతాల్లో ఏకైక భావం

సాటి మనిషి సంతోషానికి కాస్తైనా సాయపడు

చేతనైంది ఇసుమంతైనా  చేయగ ముందుండు

పరులు వైరులను సూత్రాలేవి ప్రతిపాదించకు

అభిమతమే ముఖ్యంకదా విద్వేషాలందించకు


2.గడపదాటితే ఏ కులమైనా ఎడదన వ్యాకులమే

వృత్తుల వల్ల వృద్ధిచెందితేం కులాలు కోరే కాకులమే

పుట్టిన జాతికి చేసే పనికి పొంతన లేని లోకులమే

వచ్చినప్పుడు పోయేనాడు ఎవ్వరమైనా ఏకాకులమే

విశ్వమానవ .కళ్యాణానికి తలా ఓ చేయి వేయాలి

వసుధైక కుటుంబమంటే ఏంటో తెలియజేయాలి


3.ఉనికి కోసం ఉచితానుచితం అసలో ఆలోచించం

పదవిని పొందే పందెంలో ఎంతకైనా ఎపుడూ సిద్ధం

సమాఖ్య  సాకుగ మాటల బాకుతొ మా యుద్ధం

రాజకీయ చదరంగంలో రౌతు జిత్తులే పద్మవ్యూహం

సమగ్ర భారత సార్వభౌమ భావనే మా ప్రాధమ్యం

ఝండా ఊంఛా రహే హమారా ఇది సత్యం తథ్యం

Tuesday, February 22, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మోమున జాబిలి అందం 

మోవిన జాలువారు మకరందం

నా జీవన నందనవనిలో 

నీవే చెలీ కమ్మని చందన గంధం


1.శ్వేత చేల సుందరి

దివ్య స్వర్ణ మంజరి

నా కలమున ప్రవహించే జీవఝరి

సరస గీత మాధురి

సకల జన మనోహరి

నా గళమున ఉరకలిడే సుధా లాహిరి


2.నీ నామ జపమే సతతం

నీ రూపు వలపునకూతం

నీ చూపే నాలో మరులకు సుప్రభాతం

నీ తనువే కిసలయ చూతం

నీ నవ్వే  ఆమని పిక గీతం

నిలువెల్లా చెలీ నీవే గణిత నిర్మితం

 నడవడి నేర్పని బడి ఎందులకు

బ్రతుకు తెరువు గరపని చదువెందులకు

క్రీడాస్పూర్తి కొరవడిన స్పర్ధ వ్యర్థమే కదా

మానవతే వికసింపకున్నట్టి విద్యయే వృధా


1.అరకొర చదువులు ఎందుకట బట్టీ పట్టే పాఠాలు కాబట్టి

గాడిద మోతలెందుకట తూకం తోటే జ్ఞానం అనుకోబట్టి

చదువుకొనే లోకంలో చదువుకుంటె లౌక్యమబ్బేనా

మార్కులకోసం విక్రమార్కులైతే తెలివిక మబ్బేనా


2.ఆటలు పాటలకలవేకాని పాఠశాల ఒక బంధీఖానా

చదువుతొ బాటుగ సంస్కారానికి లేనేలేదు ఠికానా

విలువల విలువను ఎరుగుట లేదుగ ఈ జమానా

తమతో తామే తలపడినప్పటి  గెలుపే ఓ నజరానా


Sunday, February 20, 2022

అసూయకలగనీ నాలో నీ ఉన్నతినేగని

పదేపదే నే కలగనీ పొందనీ నీకున్న ప్రతిభని

నీ భావాల పాదాలకు మువ్వల పట్టీనై నను చెలగనీ

నీ మంజుల వర్ణాలకు శబ్దాల లయనై నను మెలగనీ


1.రమ్యమైన నా గమ్యం నీకీర్తి శిఖరమై

అనన్యమైన నీ ధ్యానం జనవశీకర కరమై

దృక్పథాన్ని విశ్వమంత విస్తృత పరచనీ

మనోరథాన్ని విశాలమైన సరళపథము చేర్చనీ


2.శిష్యులే సద్గురువుకు మార్గదర్శులైన వేళ

గురువు మదే ఊగదా సదానంద డోలికల

నీ గెలుపే నాదిగా అనాదిగా అలవాటే కదా

నీ నుదుటన ఒదగదా సిందూరమై నా ఎద 



 ప్రియురాలా ప్రియురాలా నీవేలే నా తీయని కల

ప్రియురాలా ప్రియురాలా  నీవేలే నా తీరని కల

రేయి పగలు నీ తలపుల్లో ఎప్పుడు చూడు నీ ఊహల్లో

ఏడడుగులు వేస్తానే నే తోడొస్తానే 

ఏడేడు జన్మాలు నీతోనే నీతోనే


1.తూచే తూనికలేవీ లేవీ లోకంలో నా ప్రేమను

వివరించే పదములు సైతం కరువేలే నా ప్రేమను

మనసు కనులతో తరచిచూడు నా ప్రేమ సాంద్రత

వలపు భాషతొ చదివి చూడు నాదైన  ప్రేమ కవిత

తోటలోకొస్తావా నీకు నీటు బాటలేస్తా

నీ చేయినందిస్తావా  బ్రతుకు నీకు రాసిస్తా


2.నిన్ను చూస్తె ఒళ్ళంతా తకధిమితక నాట్యాలే

చేరువగా నీవుంటే గుండె నిండా సరాగాలే

ఎరుక పరచు సమ్మతిని బంధమనే బహుమతిని

కాదు కూడదన్నావంటే తప్పదింక చేరక చితిని

చిరునవ్వే వరముగ ఇస్తే చిరకాలం నే జీవిస్తా

మూడు ముళ్ళు వేయనిస్తే నీవాడిగ తరియిస్తా



Friday, February 18, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ముందేంది వెనకేంది అందానికి హద్దేంది

ఎత్తేంది కురచేంది కొలతలకొక పద్దేంది

ముద్దే కదా ముగ్ధ మురిపెము అనాదిగా

తనివే తీరునా ఎంతగ చూసినా ఎగాదిగా


1.వర్ణించారు కవులందరు అతివను ఆపాదమస్తకం

అధ్యయనమెంతచేసినా పడతే ఒడవని పుస్తకం

కురులైనా కుచములైనా పెదాలు పాదాలు సైతమైనా

ఉత్తేజమే గొలుపుతాయి చిత్తాలనే లాగుతాయి


2.రాసిచ్చారు రాజ్యాలైనా  ఘన సార్వభౌములు

మానొచ్చారు తపములనైనా మహా మహా మునులు

ఇంద్రులైనా చంద్రులైనా సాక్షాత్తూ ఆ త్రిమూర్తులైనా

దార్తిగొన్నారు తెఱగునకు దాసోహమన్నారు తరుణులకు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎన్నదగినవెన్నెన్నో చేయగలుగు దానాలు

చేయిసాచనేల ఒరులు వదిలి అభిమానాలు

అతి ముఖ్యమైనది మన నేత్రదానం

అత్యవసరమైనదెపుడు రక్తదానం

దానాలెన్ని ఉన్నా సులభమైనదొకటే దానం

అన్నదాతా సుఖీభవా అను దీవెన పొందే దానం

అన్నిదానాలకెల్లా మిన్ననే అన్నదానం

 ఇక చాలనిపించి తృప్తి నిచ్చే అన్నదానం


1.ధనిక పేద భేదమేది ఉండబోదు ఆకలి బాధకు

కులమతాల తేడా ఉండదు కడుపు కాలు వేళకు

దొరికిన దేదైనా సరే పరమాన్నమె నకనకలాడే పొట్టకు

అన్నం పరబ్రహ్మ రూపంగా కానవచ్చు కట్టెదుటకు

అన్నదాతా సుఖీభవా అను దీవెన పొందే దానం

అన్నిదానాలకెల్లా మిన్ననే అన్నదానం


2.పదో పరకో ఇవ్వజూస్తే వందలు వేల మీద ఆశ

సువర్ణము మణుల నొసగినా మరలదు ఆ ధ్యాస

దశదానాదులెన్ని చేసినా అంతకు మించినదాని నస

పట్టెడన్నం పెడుతున్నప్పుడు అన్నదాతలో దైవాంశ

దానాలెన్ని ఉన్నా సులభమైనదొకటే దానం

 ఇక చాలనిపించి తృప్తి నిచ్చే అన్నదానం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కళావతి


అరుణిమలొలుకుతాయి నీ అరచేతులు గులాబి పూలై

గుభాళిస్తాయి నీ చేతులు కమ్మగ మత్తిడు విరితావులై

ఏనాడు చెలి సంకటాల కంటకాలు నువు తొలగిస్తావో

బంగారు భవితకు చెదరని నమ్మిక తనలో చివురింపజేస్తావో


1.కళ్ళెదుట నిలుస్తాయి కన్న కలలన్ని కనుపాపగ తనని కాచుకుంటే

వెన్నెలలు కురుస్తాయి నెలలో రాత్రులన్ని తన పెదాలు నవ్వులొలుకుతుంటే

పురివిప్పును నెమలే చిన్న మెప్పుకే తన మేన పరవశమొందగా

పోటెత్తును కడలే మాట గుచ్చితే తన కంటినుండి నీరు చిందగా


2.కంబళి కంటే వెచ్చనిహాయే పదిలంగా అర్ధాంగిగ పొదువుకుంటే

వ్యాహళి వంటి స్వాదనమగును పదపదము తనతో కదలుతుంటే

తలపించును తనతో గడిపే ప్రతి క్షణము స్వర్గ సౌఖ్యంగా

మురిపించును మరులొలుకగ ప్రియుడే తన ఏకైక లోకంగా


నువ్వంటే కాదు అభిమానం

నువ్వంటే కాదు అనురాగం

నువ్వంటే కాదు ప్రణయం

నువ్వంటే కాదు హృదయం

నువ్వంటే కాదు దేహం

నువ్వంటే కాదు ప్రాణం

నువ్వంటేనే జీవితం

నువ్వుంటేనే జీవితం

నా చెలీ సఖీ ప్రేయసీ

నా సఖా ప్రియా ప్రియతమా


1.నువ్వంటే కాదు స్నేహం

నువ్వంటే కాదు మోహం

నువ్వంటే కాదు  ఇష్ట దైవం

నువ్వంటే కాదు ప్రేమభావం

నువ్వంటే కాదు స్వప్నం

నువ్వంటే కాదు స్వర్గం

నువ్వంటేనే జీవితం

నువ్వుంటేనే జీవితం

నా చెలీ సఖీ ప్రేయసీ

నా సఖా ప్రియా ప్రియతమా


2.నువ్వంటే నా మానసం

నేనంటూ ఉన్నదె నీకోసం

నువ్వంటే ఆకసం

నీవెంటే ఆశయం

నువ్వే నా లక్ష్యము

నువ్వే నా మోక్షము

నువ్వంటేనే జీవితం

నువ్వుంటేనే జీవితం

నా చెలీ సఖీ ప్రేయసీ

నా సఖా ప్రియా ప్రియతమా

Friday, February 11, 2022

 పడగ ఎత్తిన నాగు మెడకు సొబగాయే

నడుమున ఏనుగు తోలు వలువాయే

షష్టి చందుర వంక సిగన నగతీరాయే

నెత్తినెత్తిన గంగ నీకెంతొ ప్రియమాయే

మస్తు మస్తుగున్నవు మా రాజరాజేశ్వర

వస్తిమి వేములాడ భక్తితో శ్రీ రాజరాజేశ్వర


1.ధర్మగుండంలో నిండ మునకలేస్తాము

బిరబిర నీకడకు తరలి వస్తాము

కొబ్బరికాయలు కొట్టి నిన్ను మొక్కేమూ

పత్రి పూలు పెట్టి నీ పూజ చేసేము

మస్తు మస్తుగున్నవు మా రాజరాజేశ్వర

వస్తిమి వేములాడ భక్తితో శ్రీ రాజరాజేశ్వర


2.రోజంతా శివరాత్రి ఉపాసముంటాము

రేయంతా నిదురోక జాగారముంటాము

ఊరంతా గుడికాడ వండుకొని తింటాము

భక్తులందరికి అన్నదానాలు చేస్తాము

మస్తు మస్తుగున్నవు మా రాజరాజేశ్వర

వస్తిమి వేములాడ భక్తితో శ్రీ రాజరాజేశ్వర



3..పార్వతమ్మతొ జరుగు నీ పెండ్లి చూసేము

అరదమెక్కించి మిమ్ము ఊరంతా తిప్పేము

శివరాత్రి జాతరల సిత్తమంతా నువ్వేలే

మూడు రోజుల పాటు ఆనందాలూ నవ్వులే

మస్తు మస్తుగున్నవు మా రాజరాజేశ్వర

వస్తిమి వేములాడ భక్తితో శ్రీ రాజరాజేశ్వర

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎన్ని పాటలు కట్టను

నన్నిలా చూపుతో కట్టిపడవేస్తుంటే

ఎంతగా చూస్తుండి పోను

అందాల రూపుతో ఆకట్టుకొంటుంటే

తట్టుకోలేను నేనొట్టి నరుడను

పట్టుబడతాను నేనుత్తి పామరుడను


1.మరుడైన ఆగునా నీ తేజస్సుకు

హరుడైనా వేగునా నీతో రహస్సుకు

ఇంద్రాది దేవతలు నీకు పరిచారకులు

తాపసులు మునులు నీకు నిజదాసులు

తట్టుకోలేను నేనొట్టి నరుడను

పట్టుబడతాను నేనుత్తి పామరుడను


2.చక్షువులు రెండైన సరిపోవునా నినుగన

ఒక్కనాలుక అలసిపోయేను నిన్నుగ్గడించ

మనసునే చేసేను నీకు అంకితము

జీవితమునిచ్చేను నీకు నైవేద్యము

తట్టుకోలేను నేనొట్టి నరుడను

పట్టుబడతాను నేనుత్తి పామరుడను

Tuesday, February 8, 2022


https://youtu.be/j2-GG8dFazI?si=4n4WuCuy0l_QR2E-

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఉదయ రవి చంద్రిక


ఉదయాద్రి మీయమ్మ గర్భాన ఆవిర్భవించి

ఉషఃశ్రీ నీతోబుట్టుతో చెట్ట పట్టాలు చేబట్టి

గోదారిగంగలో మునకలేసి తానాలు చేసి  

చెట్లంట పుట్లంట వరిచేలు గట్లంట ఆటలాడి

పుడమితో మైత్రి సలిపెడి మిత్రుడా పవిత్రుడా వందనం

లోకులెల్లరికి నిజ బాంధవుడవైన భాస్కరా నమస్కారం


1.ప్రాణవాయువు నొసగు ప్రాణదాతవు నీవు

చీకటులు పరిమార్చు కాంతి రూపుడవు

నీటి వలయ చలన నిత్య నిర్ణేతవు నీవు

గ్రహగతుల క్రమతకు కేంద్ర బిందువువు

పుడమితో మైత్రి సలిపెడి మిత్రుడా పవిత్రుడా వందనం

లోకులెల్లరికి నిజ బాంధవుడవైన భాస్కరా నమస్కారం


2.అవిరళ ప్రజ్వలిత  శక్తి స్వరూపుడవు

అనంతానంత కాలాల సాక్షీభూతుడవు

కులాతీత మతాతీత మానవతా నేతవు

విశాల విశ్వసీమ నరజాతి విలాసమీవు

పుడమితో మైత్రి సలిపెడి మిత్రుడా పవిత్రుడా వందనం

లోకులెల్లరికి నిజ బాంధవుడవైన భాస్కరా నమస్కారం

Monday, February 7, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా జతగా దేవతగా భావించడమే ప్రేమ

నా కనులే నీ అంద చందాలకు చిరునామా

నా ప్రణయ సామ్రాజ్యాన సామ్రాజ్ఞిగ నిను నిలిపా

నా అనురాగ మందిరానా త్రిపుర సుందరిగా కొలిచా


1.నీలో కలవని నీకే తెలియనీ గుప్తనిధులు వెలితీసా

మెరుగుల నెరుగనీ నీ వన్నెల కెన్నో నగిషీలు చెక్కేసా

లలిత లావణ్య మొలుకు కులుకుల నెన్నో తెలియగజేసా

మరులను సంధించెడి విరి శరముల నెరుక కలుగజేసా


2.రాయిలాగ ఉన్న నిన్ను రమణీయ శిల్పంగా చెక్కా

రామప్ప గుడిలోనినాగినికే నిను నకలుగ మలిచా

పదేపదే ప్రస్తుతించి నీమేని  ప్రాజ్ఞతను ఇనుమడించా

నీకోసమె నేను ఉన్నది అన్న గట్టి నమ్మకాన్ని కలిగించా

మనకోసమే ఉన్నదీ  లోకమంతా

మన చెంతకే చేరవు శోకమూ చింత

నాకు నీవే సాంత్వన నీకు నేనాలంబన

కనుపాపగ నిన్నే నే చూసుకుంటా

కనురెప్పగ నిన్నే నే కాచుకుంటా

ప్రియతమా ప్రియతమా నా హృదయమా

ప్రణయమా ప్రణయమా నా ప్రాణమా


1.నీ వలపుల వాకిలికి నే తొలిపొద్దునౌతా

నీ కౌగిలి లోగిలిలో ముత్యాల ముగ్గునౌతా

గులాబీ పువ్వువే నువ్వు ప్రేమైక జీవనాన

గుభాళింపువే నువ్వు అనురాగ భువనాన

ప్రియతమా ప్రియతమా నా హృదయమా

ప్రణయమా ప్రణయమా నా ప్రాణమా


2. మనసెరిగిన వాడినై నిన్నేలుకుంటా

మరుజన్మకైనా నిన్నే నే కోరుకుంటా

అంకితమైపోతా అనుబంధం పెనవేయగా

అర్పించుకుంటా నన్నే నీలో లయమవగా

ప్రియతమా ప్రియతమా నా హృదయమా

ప్రణయమా ప్రణయమా నా ప్రాణమా




 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీరాజనాలు చెలీ నీ రాజసానికి

జోహారులే సఖీ నీ సోయగానికి

ఒకరే పుడతారు నీలాంటి అందగత్తె యుగానికి

ఒకరే ఉంటారు నీవంటి సొగసుకత్తె జగానికి

ఎంతటి అదృష్టమో నాపాలబడ్డావు

ఏ పూర్వపుణ్యమో నా పరమైనావు


1.నీకాలిగోటికి సరితూగరు ముదిరలైనా

నీతోటి పోటీకి నిలవలేరు అప్సరలైనా

వంపులు సొంపులు నిలువెల్లా నీ సొంతం

వన్నెలు చిన్నెలెన్నొ నీ పాదాక్రాంతం

ఒక్కసారి నిను చూస్తే నీకు ఫిదాలవుతారు

తాకడమే జరిగిందా బానిసలైపోతారు


2.నీ బిగి కౌగిలింతే కైవల్యప్రాప్తియంటె

నీపొందు పొందుటే అమరసౌఖ్యమంటె

నీ కోసం ఎంతకైన తెగించగలుగుతారు

నీవడిగితె ఏదైనా త్యజించగలుగుతారు

విరమిస్తా బ్రతుకు  రమించు వరమిస్తే

పడిఉంటా పదములకడ నీవాడినవనిస్తే