Monday, January 25, 2021

 (నా సాహితీ అభిమానులకు,బంధుమిత్రులకు,సమస్త నా దేశ పౌరులకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో)


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హలం చేతబట్టి పొలం దుక్కిదున్ని

ఆహార సృష్టి చేసే రైతన్నే భారత రత్న

తుపాకి చేతబూని సరిహద్దు కాపుకాచి

దేశాన్ని రక్షించే సిపాయన్నకే పరంవీరచక్ర

వందనాలనందుకో సైరికుడా గణతంత్ర దినోత్సవాన

జోహారులు నీకివే సైనికుడా సమగ్రభరత మహోత్సవాన


1.అన్నం పెట్టి అందరి ఆకలి తీర్చే అమ్మరా కిసాను

బ్రతుకును తాకట్టుపెట్టి కాపాడుకొనును తన జమీను

ఫలసాయం చేకూర్చి ఉత్పత్తులనందించి

ఎందరికో దేశాన ఉపాధులెన్నొ కలుగచేయు

కారణభూతుడు కృషీవలుడు-కారణజన్ముడీ క్షేత్రకరుడు

వందనాలనందుకో సైరికుడా గణతంత్ర దినోత్సవాన

జోహారులు నీకివే సైనికుడా సమగ్రభరత మహోత్సవాన


2.చలికి ఎండకు వానకు మననికాచు నాన్నేరా జవాను

బ్రతుకునే ఫణం పెట్టి పోరాటం చేసేటి ప్రాణమున్న మిషను

కంటినిండ మన నిద్రకు కునుకులేని రాత్రులె తనకు

ఇంటాబయటా సింహస్వప్నమే అరాచకమూకలకు

ఆపద్భాంధవుడే సేనాచరుడు-ఆదరణీయుడా క్షేత్రజ్ఞుడు

వందనాలనందుకో సైరికుడా గణతంత్ర దినోత్సవాన

జోహారులు నీకివే సైనికుడా సమగ్రభరత మహోత్సవాన

 రచన.స్వరకల్పన&గానం:


ప్రణవానికి పూర్వం మౌనం

ప్రళయానంతరం మౌనం

జననానికి తొలుతగ మౌనం

మరణానికి అవతల మౌనం

మౌనమే గానానికి ముందుగా

మౌనమే సంతృప్తికి సాక్షిగా


ఆత్మను అల్లుకున్నది మౌనం

పరమాత్మను ఆవరించెనుమౌనం


1.మౌనమే మనిషికి పెట్టని అలంకారం

మౌనమే వ్యక్తిత్వాన్ని తూచే తులాభారం

నీలోకి నీవే తొంగిచూడు అంతా మౌనమే

కన్నులతో మాటాడగలిగే వింతా మౌనమే


2.కంచు మ్రోగేలాగ కనకం మ్రోగదు

మౌనం దాల్చావంటే కలహం ఉండదు

ఎల్లలు లేని విశ్వభాష ఏకైక మౌనమే

అక్షరమాల లేనిభాష లోకాన మౌనమే


3.మనసుకు మనసుకుమధ్యన వారధి మౌనమే

మనోరథాన్ని నడిపించే గీతాసారథి మౌనమే

ఎన్నో చిక్కు సమస్యలకు మౌనమే సమాధానం

ఆత్మజ్ఞానం పొందే క్రమాన మౌనం ధ్యాన సాధనం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గాలిలో తేలిపోతోంది నీ ఊహకే నా ఒళ్ళు

ఎన్నాళ్ళు ప్రియతమా నా యవ్వనానికి సంకెళ్ళు

ఎంతగా అలిసాయో ఎదిరిచూసి చూసి నా సోగకళ్ళు

ఎద గోదారిలోనా ఉద్వేగాల పరవళ్ళు


1.రెక్కలే కట్టుకొని ఎగిరిరానా  నీ దరికి

రెప్పలే మూసుకొని కలల ప్రపంచానికి

రెండు కలిసి ఒకటయ్యే కొత్త గణితం మన ఉనికి

ఏకాంతమే లోకమయ్యే రసరమ్య మధువనికి


2.తెల్లచీర ఉల్లమంతా తెలుపుతోందిగా

మల్లెతావి మనసునంతా నలుపుతోందిగా

పల్లెసీమ పంటచేలు మంచెనే మన పడక

అల్లరే చేస్తోంది ఆకతాయి మది వశపడక

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ యాదే నాకు మనాది

నీ చెంత నిత్యం ఉగాది

నీపేరే అనూ అనూ అంటోది నా హృది

మనకలయిక  కింకా ఎంతుందో వ్యవధి

మేఘాలలో తేలితేలి రావే చెలి

కరిగిపోగ కాచుకుంది బిగి కౌగిలి


1.కటిక చీకటి రాత్రులే లోకమంతా నువులేక

చందమామ వెన్నెల మానేసే పున్నమైనా నిను కనక

కాస్త ఎక్కువైందనిపించినా ఇదే నాకు నిజం కనుక

ఇకనైనా వీడవే  ప్రేయసీ నా ఎడల నీ కినుక

మేఘాలలో తేలితేలి రావే చెలి

కరిగిపోగ కాచుకుంది బిగి కౌగిలి


2.కొత్తగా మొదలెడదాం మనదైన జీవనం

సంతోషాలే తొణికిసలాడే అపురూప భావనం

నవ్వుల పువ్వులతో  దారంతా నందనవనం

రాధాకృష్ణుల  ప్రేమలాగా మన వలపూ పావనం

మేఘాలలో తేలితేలి రావే చెలి

కరిగిపోగ కాచుకుంది బిగి కౌగిలి