Tuesday, July 12, 2022

 యాడబడితె ఆడనె ఉంటావట సామి

మా యాదిల మనకపోతె నాయమా ఏమి

తిరిగినాము కాళ్ళరిగేలా ఊళ్ళకూళ్ళు

నిను సూడగ దనివారక గోపురాలు గుళ్ళూ 

నర్సిమ్మసామి నీకు మా దండాలు

చెంచు లచ్మిని గూడ్న పెంచలయ్య తీర్చు మాకున్న గండాలు


1.కంబం పగులగొడ్తె ఊడిపడినావు

నరసిమ్మం రూపుతో ఉగ్రంగ నిల్చావు

దూర్తుడు ఇరన్య కశిపున్ని చీల్చావు

ప్రాలాద సామిని దగ్గెరికి దీశావు

నువ్వంటె మాకు మా ఐదు పానాలు

నమ్మికొలిచినాము మేమిన్ని దినాలు


2.ఆవేశంతొ ఊగిపోతు అడివంతాదిరిగావు

చెంచులచ్మి ఎదురపడితె శాంతించినావు

అమ్మనిన్ను పెనవేయగ ఆడ్నే సిలగ వెల్శావు

నిమ్మలమై మునిగ నిల్చి మమ్ముల నిల గాచేవు

కల్యాణం మా ఇంట్లో జరగునటుల జేయి

పిల్లా పాపలతో మము సల్లగ జూడవోయి

నీ దివ్య మంగళ విగ్రహం

దర్శించితి స్వామి ధన్యోహం

అనిమేషుల మౌదుమటులె కాంచినంత తృటికాలం

శ్రీలక్ష్మీనరసింహ స్వామీ దాసోహం


1.రత్నఖచిత మకుటము దేదీప్యమానము

జ్వలిత నేత్ర యుగళము దుర్జన భీకరము

దంష్ట్రా కరాళ వక్త్రము ప్రకటిత రసనము

శటసంయుత భీషణోగ్ర కంఠీరవ

వదనము


2.శంఖ చక్ర సహిత కర యుగ్మము 

నిశిత వజ్ర నఖాన్విత హస్త విరాజితం

వక్ష స్థల కౌస్తుభ శోభితం

పీతాంబర ధారిణం   

నర మృగ ద్వయ రూప సమ్మోహనం మన్మోహనం

స్వామివారి తత్వమంతా-సామాజిక దృక్పథమే

నరసింహావతార నిదర్శనం-సర్వవ్యాపకత్వమే

నర మృగ యుగ దేహుని గ్రహించగా జీవకారుణ్యమే

ప్రహ్లాద వరదుని ఆరాధనలో-అడుగడుగున మానవీయకోణమే

జయ జయ నారసింహ జయహో

జయ లక్ష్మీ నారసింహ జయహో



1.జీవజంతు జాలమంతా నరసింహుని అవతారమే

ప్రతి మనిషిని భావించినంత-మహావిష్ణు రూపమే

చరాచరజగత్తులో ఆవరించి ఉన్నదంత పరమాత్మయే

ఎరిగి మసలుకొనగలిగిన-నరుల జన్మ చరితార్థమే

జయ జయ నారసింహ జయహో

జయ లక్ష్మీ నారసింహ జయహో


2.ఆపన్నుల నాదుకొనమనే దివ్య సందేశము 

అరాచకము నెదిరించమనే-భవ్యాదేశము

అవయవాలె ఆయుధాలనే-గురూపదేశము

ఆత్మవిశ్వాసం ఇనుమడింపచేసే-దిశానిర్దేశము

జయ జయ నారసింహ జయహో

జయ లక్ష్మీ నారసింహ జయహో

నవ నారసింహం-నమామ్యహం

భవతారకనామం భజామ్యహం

అతులిత నుత మహిమాన్వితం

స్తంభ సంభవ తవ దివ్య చరితం

శరణమహం స్మరామ్యహం నరహరే దాసోహం


1. అహో మహా బలా యని

నిను సురలు మునుల కొనియాడగ కరుణబూని

వెలిసావు అహోబిలాన నవవిధ రూపమ్ములనే గొని

అగస్త్యమహాముని ప్రార్థన మన్నించి శనివారం దర్శనమీయ ప్రకటితమైనావు మాల్యాద్రిని

హిరణ్యాక్ష కుమారుని రక్తాలోచనుని దునిమి వశిష్ఠముని వినతితో నెలకొన్నావు అంతర్వేదిని


2.ఉగ్రయోగ ద్వయ మూర్తులుగా

గోదావరి నదీతీరమందున

స్థిరవాసమున్నావు ధర్మపురిన శేషప్ప వరదునిగా

పానకమే ప్రీతిగా గ్రోలుతూ 

అర్పించిన సగం తిరిగి ప్రసాదిస్తూ వరలుతున్నావు మంగళ గిరిన

చెంచులక్ష్మినే మోహించి పెండ్లాడి పెనవేసి

పెనుశిలగా నిలిచావు పెంచలకోనలోన


3.యాద ఋషిని బ్రోవగా ఉగ్రయోగజ్వాలగండభేరుండ రూపాలుగా యాదగిరిన వెలగొందేవు లక్ష్మీనరసింహునిగా

వరాహవదనము కేసరివాలము మానవ దేహము కలిగిన మూర్తిగా

చందనలేపిత రూపంగా అగుపించేవు సింహద్రిన అప్పన్నగా

మత్స్యావతారాన సోమక సంహారాన వేదాలకు వరమిచ్చి నీసన్నిధి స్థానమిచ్చి వేదమూర్తిగా వరలేవు వేదాద్రిన

కృతిరచించ నాతరమా రమాధవుని మహిమను

శ్రీ నరసింహావతార  గాథను

వినిననూ చదివిననూ తరింపజేయును మానవ జన్మను

నుడివినను పాడినను అంతరింపజేయును  అఘమును


1.సనక సనందనాది బ్రహ్మమానస పుత్రులను

స్వామి దర్శనార్థమై వైకుంఠమేతెంచినంతను

అడ్డగించ ద్వారపాలకులా జయవిజయలను

కోపించి శపించగా మునులా భృత్యులను

శ్రీహరి కృపనొంది జన్మించిరి

హిరణాక్ష హిరణ్య కశిపులుగాను


1.హరి వైరిగా చెలరేగెను హిరణ్య కశిపుడు

గడగడలాడెను శచీపతి తన పదవి గతించినప్పుడు

నారాయణ మంత్రమొసగినంత నారదుడు- 

హరి భక్తుడాయె గ్రహించి దితి సుతు సతి గర్భాన ప్రహ్లాదుడు 


2.హరి తన పాలిటి అరి యని

వారించె హరిని స్మరించ జనకుడు ప్రహ్లాదుని

సర్వాంతర్యామి మహా  విష్ణువని 

కొలిచి తరించమనె తన తండ్రి హిరణ్య కశిపుని

ఏడిరా  శ్రీహరి  ఇందు కలడాయని మోదెను వెనువెంట ఎదుటగల  స్తంభాన్ని


3.వరగర్వితుడా దైత్యుని దునుమాడగ

నరహరి మహోగ్ర రూపమ్మున  వెలువడగ

కోఱలతో గోరులతో తండ్రిని చీల్చి చెండాడగ

శాంతింపమని ప్రహ్లాదుడు నరసింహుని వేడెగా