Sunday, November 24, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:రాగమాలిక

తప్పదు నరుడై పుట్టిన పిదప
అరిషడ్వర్గపు పీడన
అనుభవైకవేద్యమే మనుజులకు
పంచేంద్రియ ఘర్షణ
యోగిపుంగవులకే కష్టసాధ్యము
స్థిరచిత్తపు ఏకాగ్రత
మనోనిగ్రహానికి ఏకైక మార్గం
వైరాగ్య యోచనతో సాధన                            (సారమతి రాగం)

1.కలికీ కనకాలే కలికాలపు మాయలు
సౌఖ్యాలు వైభోగాలే భ్రష్టత్వ కారకాలు
త్యజించ గలిగినప్పుడే తాపసులకు తాదాత్మ్యం
భ్రమరకీటక న్యాయంతోనే భువిభ్రమలకు అంత్యం
రాగద్వేషాలకు కాగలిగితె అతీతులం
రాజయోగమార్గాన పొందగలము కైవల్యం        (అభేరి రాగం)

2.పూర్వకర్మననుభవించడం ఆచరణీయం
నిత్యకర్మానుష్ఠానం గృహస్తు శిరోధార్యం
వర్ణాశ్రమధర్మాల ధర్మవర్తనం అనుసరణీయం
మర్కటకిషోర న్యాయంతోనే మహా ప్రస్థానం
అన్యధా నాస్తి శరణ తత్వ భక్తి
కర్మయోగమార్గాన అందించును ముక్తి              (మోహన రాగం)

3.ఆత్మపరిశోధనలో అన్వేషణ నిరంతరం
ఏకం సత్విప్రా బహుదావదంతి వేదాంతం
త్వమేవాహం భావనలో తత్వమసియె గమ్యం
ఏకమేవా ద్వితీయం బ్రహ్మయనే ఎరుకయె సోహం
నళినీదళగత జలమతి తరళ భంగి స్థితప్రజ్ఞత్వం
జ్ఞానయోగమార్గాన ప్రసాదించు మోక్షం              ( రేవతి రాగం  )
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:శంకరాభరణం

త్రిపురాంతకా గరళము మ్రింగే నరుడను
త్రియంబకా మానవుడను ప్రకృతి హరుడను
త్రిగుణాతీతా మనిషిని భూలోకనాశకుణ్ణి
త్రికాలాధీశా మనుజుణ్ణీ కాలహరుణ్ణి
పాహి పాహి మహాదేవా
దేహిదేహి సుజ్ఞానము జగద్గురుదేవా

1.త్రికరణశుద్ధిగా నెరనమ్మితిరా
త్రిదళబిల్వపత్ర అర్చన జేసెదరా
త్రిశూలధారీ సతతము కాపాడరా
త్రిలోక హితమును చేకూర్చరా
పాహి పాహి మహాదేవా
దేహిదేహి సుజ్ఞానము జగద్గురుదేవా

2.త్రిపుర సుందరీ మనోహరా
త్రివిక్రమ ప్రపూజితా జితేంద్రియా
త్రేతాగ్ని నేత్రా పవిత్రా అత్రివరదా
త్రిజన్మ పాపకర్మ నిశ్శేష హారకా
పాహి పాహి మహాదేవా
దేహిదేహి సుజ్ఞానము జగద్గురుదేవా