Thursday, February 4, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హృదయంలో ఆర్ద్రత

మనసులో ప్రశాంతత

కర్మ ఎడల నిబద్ధత

ఫలితమంటే నిరాసక్తత

ఇదికదా జీవన విధానం

ఇదే సదానంద సంధానం


1.అనుభవాలు జీవితాన భాగాలై

జ్ఞాపకాలేవైనా అధర దరహాసాలై

సహానుభూతులే మానవతా వేదాలై

అనురాగం రవళించే సమైక్యతా నాదాలై

ఇదికదా జీవన విధానం

ఇదే సదానంద సంధానం


2.పాత్రకేమాత్రం అంటని పాదరసమై

 తామరపత్రాన తారాడే నీటిబిందువై

అత్తిపత్తిలాగా తాకనీక తప్పుకుంటూ

ఉల్లిపొరల బంధాలన్నీ విప్పుకుంటూ

ఇదికదా జీవన విధానం

ఇదే సదానంద సంధానం

 

సప్తగిరీశా అష్టైశ్వర్య వికాస

నవరసపోష దశవిధ వేషా

సహస్రనామ విశేషా జగదీశా

భక్తజనాకర్ష శ్రీరమణ నమోస్తు సంకర్షణ


1.అతిపవిత్రము ఇల తిరుమల క్షేత్రము

ధన్యమే మనుజజన్మ నీ దర్శన మాత్రము

దయకురిపించును నీ అర్ధనిమీలిత నేత్రము

నీ తిరునామమే పరమొసగెడి మంత్రము


2.ఆకాశ గంగ పావన కపిలతీర్థము

నిండామునుగంగ భవ పాపనాశనము

అలమేలుమంగాపట్టణ భవ్య వీక్షణము

పరిణమించు జీవితాన మోక్ష కారణము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రియాతి ప్రియమైన స్వప్నలోక సామ్రాజ్ఞికి

ఈ గీతమే ఊతమైంది నీకు రాయు ప్రేమలేఖకి

సరస హృదయ సుమకోమల భావాల నగకి

లలిత లలిత అలతి అలతి పదాలనే అతికి

నా ఎదనే అందించా నీ పాదాల ముందుంచా

సమాదరించవే అవధరించవే నను ధరించవే


1.అల్లసానివారి జిగిబిగి అల్లికను అరువు తెచ్చుకున్నాను

శ్రీనాథసార్వభౌము శృంగార రసాన్ని పుణికిపుచ్చుకున్నాను

పోతనార్యు కవన ద్రాక్షాపాకాన్ని నే గ్రోలియున్నాను

కృష్ణశాస్త్రి అనన్య  లావణ్య శైలిని ఆకళింపుగొన్నాను

నభూతో నభవిష్యతిగ ఈ ప్రణయ గీతి రాస్తున్నాను


2.హంసరాయభారమై ఆలరారును ఈ గీతము

కపోతప్రాప్త సంకేతమై నిను చేరును నా చిత్తము

కిసలయ రుచి మరిగిన పిక కూజితమీ గేయము

మేఘసందేశమై ధర వరలును సఖీ ఈ ఉత్తరము

సంపూర్తిగ కడు ఆర్తిగ నీలో లయించ నామానసము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కలం సాగడం లేదు నువు వరించక

పదం పొసగడం లేదు సవరించక

నా స్ఫూర్తివి ఆర్తివి నువ్వే అది నువ్వే

 కవితకు స్ఫురణ  ప్రేరణ  నువ్వే అదినువ్వే

కనిపించవేమే కనికరించవేమే 

వివరమెరిగినాగానీ వరమీయవేమే


1.నన్ను పలకరించి ఎన్నాళ్ళైందో

మనసు పులకరించి ఎన్నేళ్ళైందో

 నీకలా ఏమాత్రం  అనిపించదా

ఎదసవ్వడి కాస్తైనా వినిపించదా

దేవతవే నీవంటే శిలలాగ మారాలా

గుండెనే అర్పిస్తే బండలాగ మార్చాలా

కనిపించవేమే కనికరించవేమే 

వివరమెరిగినాగానీ వరమీయవేమే


2.మాటలతో మభ్యపెట్టీ  నెగ్గగలరు మా'తలంతా

మౌనంతో ఉగ్గబెట్టీ గెలువగలరూ నెలతలంతా

క్రిందైనా మీదైనా చెలీ  మీదేగా మాపై పైచేయి

ముందైనా వెనుకైనామీరే పడగొట్టే గడుగ్గాయి

కాళ్ళబేరాలే మీతో మాకు పరిపాటి

యోధానుయోధులైనా రాలేరు మీకు పోటి

కనిపించవేమే కనికరించవేమే 

వివరమెరిగినాగానీ వరమీయవేమే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అతను:  వేచివేచి చూసే ఘడియ నిజమయ్యే దెన్నడో

ఆమె:      ఎదిరిచూసి అలసిన మనసుకు ఊరట మరి ఎప్పుడో

అతను:  ఎడబాటులోనా పెరిగేను ప్రేమా

ఆమె:      విరహాల లోనా కాగేము కామా

అతను:  కాలమా పరుగిడవే చెలిచెంత లేనివేళలందున

ఆమె:      సమయమా కదలకుమా ప్రియుని కూడియున్న  తరుణాన


1.అతను:  ప్రతీక్షయే తీక్షణమైతే ప్రతీక్షణం అది ఒక శిక్ష

ఆమె:           నిరీక్షణకు మోక్షం లేక అనుక్షణమో అగ్నిపరీక్ష

అతను:       లక్ష్యపెట్టి ననుచేర పక్షిలాగ ఎగిరొచ్చి ఎదవాలు

ఆమె:           నీ దక్షత చూపించి  వశపరుచుకొ నా పరువాలు

అతను:       కాలమా పరుగిడవే చెలిచెంత లేనివేళలందున

ఆమె:           సమయమా కదలకుమా ప్రియునికూడియున్న తరుణాన


2.అతను:    అర్థమే కాలేదు అందుబాటైనంత వరకు

ఆమె:             వ్యర్థమై పోనీయకు దాచిన  విలువైన నిక్కు

అతను:         దారితప్పి పోమాకే మనసా రమించక

ఆమె:             స్వర్గాన్ని చేరేదాకా శ్రమిద్దాం విరమించక

అతను:         కాలమా పరుగిడవే చెలిచెంత లేనివేళలందున

ఆమె:             సమయమా కదలకుమా ప్రియునికూడియున్న తరుణాన

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గురువారం గురువారం 

గురుదేవ దత్తుని ప్రియవారం

షిరిడీ సాయి దర్శనవారం

సిరులను కూర్చెడి లక్ష్మీవారం

గురురాఘవేంద్ర స్మరవారం

మనమంతా సద్గురు పరంపర పరివారం

మనసా శిరసా వచసా గురువులకిదె నమస్కారం


1.అత్రివర పుత్రుడిగా శ్రీపాద శ్రీవల్లభ మూర్తిగా

ధర గురు నరసింహ సరస్వతిగా

సాయిబాబాగా పత్రిలొ పర్తిలొ పుట్టిన అవధూతగా

గజానన మహరాజ్గా అరుణాచల రమణునిగా

అందరం గురువుల నెరిగిన వారం మనం వారి పరివారం 

మనసా శిరసా వచసా గురువులకిదె నమస్కారం


2.మంత్రాలయ దైవంగా కంచి పరమాచార్యునిగా

మెహర్బాబాగా గురునానక్ గురుగోవింద సింగ్ గా

గౌతమబుధ్ధునిగా మహావీరునిగా మహావతార్ బాబాగా

జన్మగురువులు అమ్మానాన్నలు ఉపదేశ విద్యాబోధకులుగా

తీర్చుకోలేము వారి ఋణం ఎవరం మనంవారి పరివారం

మనసా శిరసా వచసా గురువులకిదె నమస్కారం