Thursday, August 8, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:భీంపలాస్

శ్రావణ మాసమే అతి పవిత్రము
అత్యంత శ్రేష్టమైంది వరలక్ష్మీ వ్రతము
ఐదోతనమును తల్లి ఆదుకొంటుంది
పసుపు కుంకుమలను కాచి రక్షిస్తుంది
మంగళ హారతి నీకు మాతా వరలక్ష్మీ
నీరాజనమిదె గొనవే నీరజాక్షీ

1.సౌభాగ్యము నొసగేను కల్పవల్లి
సిరిసంపదలిచ్చేను కనకవల్లి
అష్టైశ్వర్యములందజేయు అనురాగవల్లి
ఇహపర సౌఖ్యదాయి ఆనందవల్లి
మంగళ హారతి నీకు మాతా వరలక్ష్మీ
నీరాజనమిదె గొనవే నీరజాక్షీ

2.నిష్ఠతొ పూజించిన కష్టములెడబాపుతుంది
భక్తిమీర నోమునోస్తె సంతతిని సాకుతుంది
భోజన తాంబూలమిస్తే ఇల్లు స్వర్గ మౌతుంది
ముత్తైదువులకు వాయనమిస్తె  ముచ్చట తీర్చుతుంది
మంగళ హారతి నీకు మాతా వరలక్ష్మీ
నీరాజనమిదె గొనవే నీరజాక్షీ

మొగ్గను నేను తల ఒగ్గను నేను
సిగ్గును నేను పదారువన్నె ముగ్ధను నేను
పరువాల వాకిలిలో  ముత్యాల ముగ్గును నేను
బిడియాల పొదలలో ఒదిగిన మొగిలి రేకును నేను
అద్దాన్ని పదేపదే ముద్దాడే అన్నుల మిన్ననూ

1.నవ్వుల పువ్వుల ప్రేమించే సీతాకోక చిలుకను
నెలరాజును కనగనే మురిసే చకోరి నేను
మబ్బుల అలికిడికే ఆడే మయూరి నేను
తొలిచినుకుకు తపియించే చాతకమే నేను
సుందరమౌ ప్రకృతిలో నింగికి సింగిడి నేను

2.బెదురుతు  అదురుతు ఉరికే కుందేలును
రెక్కలు సాచి స్వేఛ్ఛగ ఎగిరే గువ్వను నేను
చెంగున దుముకే చంచల హరిణేనేను
మానస సరోవరాన కలహంసను నేను
సరికొత్త అందాలు సంతరించుకొన్నదానను