Thursday, August 26, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాస్తూనే ఉన్నా కరగని గుండెకోసం కవితలెన్నో

తెలుపుతూనే ఉన్నా ప్రతినిమిషం విరహపు వెతలెన్నో

ఇంతకన్న నరకం వేరే ఉంటుందా

చింతలేని నాకం నీ చెంతన లేకుందా

మనసెరిగీ  మౌనం ఏలనే

మది తెలుపగ జాప్యం ఏలనే


1.మాటల్లో చెప్పాను నర్మగర్భంగా

చేతల్లో చూపానే ప్రతి సందర్భంగా

ప్రతిపదార్థతాత్పర్యం విప్పిచెప్పలేను

విడమరచి వివరంగా ఎరుకపరుచలేను

మనసెరిగీ  మౌనం ఏలనే

మది తెలుపగ జాప్యం ఏలనే


2.పరికించమన్నాను చిలకా గోరింకల

తిలకించమన్నాను జంట పావురాల

అంతరార్థమేదో ఆమాత్రం గ్రహించలేదా

ప్రేమ సూత్రమదియేదో సంగ్రహించలేదా

మనసెరిగీ  మౌనం ఏలనే

మది తెలుపగ జాప్యం ఏలనే


నీ పరం చేసేసా నా హృదయం

వరంగా అందించు నీ ప్రణయం

మెడలో నే వేయనా అక్షర నక్షత్ర హారం

నా కవితగ మలచనా నిను జీవన పర్యంతం


1. వల వేసినావే వలపు నెరగవేసి

ఎద దోచినావే వాలుచూపు చూసి

నే మనలేను నినువీడి మరణించినా

ఏమనలేను నన్నే ఉపేక్షించినా


2. కన్నులలో  సాదర ఆహ్వానం

మాటలలో మాత్రం తిరస్కారం

ఊరించనేల ఉత్తుత్తిగానే ప్రతిసారి

నను చేరరావేల నాదానిగా మారి



జీవితం కడు బరువు-

కాలమే నిజ గురువు

ఆత్మస్థైర్యమే నీకు ఆప్తబంధువు

అల్లంత దూరమే ఆనందపు రేవు

ఉల్లాసం నింపుకో భావ కవితగా 

ఆహ్లాదం పంచుతూ స్నేహిత గా


1. బదిలీ చేయి నీ వేదన నాకు

ఆనందించు నా ప్రమోదాలకు

రేయి పగలు ఏ సమయమైనా

నేడు రేపు ఏన్నడు నీకేమైనా

ఉంటాను నేను నీకు చేయూతగా 

నీ చింత దూరంచేసే  భరోసాగా 


2.మనసులో ఉన్నదేది నావద్ద దాచుకోకు

చేరువగా లేనని అసలు నొచ్చుకోకు

తలుచుకున్న తరుణంలోనే

వచ్చి నీ ముందు వాలుతా

కోరుకున్న నీ అక్కఱను

ప్రేమ మీర  నే నెరవేరుస్తా