Sunday, July 5, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:రేవతి

నుతించినా గతిగానవైతివి గంగాధరా
నిందాస్తుతికైనను స్పందించవైతివి సతీవరా
ఎందరెన్ని తీరుల నిను మును కొనియాడిరో
ఎవ్వరేమి ఆశించి నిను మది ప్రణుతించిరో
నన్నేల సదాశివా చేరనీవు నీదరి
నాకేల మహాదేవ వేదనలీ మాదిరి

1.భగీరథుని మనోరథము నెరిగితివే
లంకేశుడహంకరించ ఒప్పితివే
పాశుపతమునర్థించ పార్థుని బ్రోచితివే
మార్కండేయుని మృత్యువు బాపితివే
నన్నేల సదాశివా చేరనీవు నీదరి
నాకేల మహాదేవ వేదనలీ మాదిరి

2.పావురాల పరిక్రమకు పరసౌఖ్యమా
శునకానికి శివరాత్రిన సాయుజ్యమా
కరినాగుల అర్చనకూ కైవల్యమా
కన్నప్ప మూఢభక్తి ముక్తిదాయమా
నన్నేల సదాశివా చేరనీవు నీదరి
నాకేల మహాదేవ వేదనలీ మాదిరి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఆది గురువు నీవే-పరమ గురువు నీవే
జగద్గురువు నీవే-సద్గురుడవు నీవే
గురు దక్షిణామూర్తియే నమః
ఓం శ్రీగురు దక్షిణామూర్తియే నమః

1.తొలి పలుకులు నేర్పించిన అమ్మరూపు నీవే
ఓనమాలు దిద్దించిన ప్రథమ గురువు నీవే
సందేహాలు తీర్చిన అధ్యాపకుడవు నీవే
బ్రతుకు తెఱువు చూపించిన మార్గదర్శి నీవే
గురు దక్షిణామూర్తియే నమః-ఓం శ్రీగురు దక్షిణామూర్తియే నమః

2.వేదవాఙ్మయ దాత వ్యాసుని ఆత్మనీవె
ఆదిశంకరునిగా జన్మించినదీ నీవే
గురు రాఘవేంద్రునిగా వెలసింది నీవే
మహావతార్ బాబావై ఉదయించినదీ నీవె
గురు దక్షిణామూర్తియే నమః-ఓం శ్రీగురు దక్షిణామూర్తియే నమః

3..అజ్ఞానము నెడబాపే ఆత్మగురువు నీవే
బ్రహ్మావిష్ణుమహేశ్వర స్వరూపుడవీవే
గురుదేవ దత్తుని మూల తత్వమీవే
సద్గురు సాయినాథ అవతారము నీవే
గురు దక్షిణామూర్తియే నమః-ఓం శ్రీగురు దక్షిణామూర్తియే నమః