Saturday, November 25, 2023

 

https://youtu.be/LlMoIEBoV6c?si=w65WvveeZVTLrY9A

శ్రీ తులసి జయ తులసీ కళ్యాణ తులసీ

రామ తులసి కృష్ణ తులసి శుభలక్ష్మీ తులసి

ఆరోగ్య తులసి సౌభాగ్య తులసి మోక్షతులసి

మంగళా హారతులు గొనవే మా ఇంటితులసి


1.అనుదినము శ్రద్ధాగాను నీకు పూజలు సేతుము

కార్తీక మాసమందున భక్తితోను నిన్ను గొలుతుము

ప్రతి ఏటా కృష్ణమూర్తితొ నీ పరిణయ మొనరింతుము

బంధు మిత్రులమందరం కనువిందుగాను చూచి ధన్యత నొందెదము


2.అష్టభార్యల ఇష్ట సఖుడు వరుడు గోపీకృష్ణుడు

ప్రేమతో ఆరాధించిన నీకు నిరతము వశ్యుడు

తూచగలిగిన సాధ్వివే నీవు తులాభారమందున

పుత్రపౌత్రుల వంశాభివృద్ధికి -దీవించు ఈశుభ లగ్నమందున

Wednesday, November 22, 2023

బాలల గేయం-4


తాతయ్యకు నేనే 

ఊతకర్ర నవుతా

నానమ్మకు నేనే

నడుంనొప్పి తగ్గిస్తా

అమ్మమ్మకు నేనో 

ఆటబొమ్మ నవుతా

ఇంటిల్లి పాదికి నేనే 

ఇష్ట దేవత నవుతా


1.సెల్ ఫోన్ నేర్పించే

గురువు నవుతా

టి వి రిమోట్ అందించే

పరుగు నవుతా


2.కథలు చెప్పమంటూ

చెవిలో ఊదర గొడతా

చిన్ని చిన్ని తాయిలాలకై

రోజూ నేను నసపెడతా

Sunday, November 19, 2023

 https://youtu.be/dFOe3-Hd-iE?si=S4Hk15cQZx4W1jfg

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:నట భైరవి


ఇంటికి దీపం ఇల్లాలు అలనాడు

ఇలకే వెలుగిస్తోంది ఇంతి ఈనాడు

గృహమును చక్కదిద్దు ఒద్దిక-గృహిణికి ఆభరణం- ఒకనాడు

ఉద్యోగినిగానూ సవ్యసాచి సుదతికి నిత్యం- రణమూ గెలుపూ నేడు


1.లేచింది మొదలుగా పాచివదలగొడుతుంది

ఇంటిల్లి పాదికీ టీ టిఫిన్లు చేసి నోటికందిస్తుంది

వండి వార్చి లంచ్ బాక్స్ బ్యాగుల్లో సర్దిపెడుతుంది

అందరు వేళకేగులాగు పరుగిలిడి తను బస్సుపడుతుంది.


2.మగచూపులు తాకుళ్ళు వత్తిళ్ళు తట్టుకొంటుంది

ఆఫీసు బాసుకు అలుసవకుండా పనినెత్తుకుంటుంది

సహోద్యోగి అతిచొరవకు తప్పుకొంటు తిరిగుతుంది

నొప్పింపక తానొవ్వక నేర్పుగ ఓర్పుగ వృత్తి నెట్టుకొస్తుంది.


3.ఆర్థికంగ భర్తకెంతొ చేదోడు వాదోడౌతుంది

అత్తామామల మాటదాటక తల్లో నాలుకౌతుంది

సవాళ్ళెన్ని ఎదురైనా నవ్వుతు సగబెడుతుంది

షట్కర్మయుక్తను మరపించి సర్వకర్తగా అవతరించింది


4.కవన గాన కళారంగాలలో కలికి ప్రతిభ అపారము

కమ్ముకునే నిత్యాకృత్యాలతో అభిరుచికే అంధకారము

పాక్షికంగానో సమూలంగానో ప్రవృత్తి పట్ల నిర్వికారము

మగువా నీ మనుగడయే ఒడిదుడుకుల సమాహారము