Sunday, July 7, 2019


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:శివరంజని

నీకిదే నా అంతిమ నివేదన
ఇకనైనా తొలగించు నా వేదన
ఈ చరాచరజగత్తుకే కారణమైన దేవి
కరిగిన నా ఆనందాన్ని తిరిగి అందించవేమి

1.వేదాంత వాక్యాలు వల్లించబోనమ్మా
అద్వైత సూత్రాలు నాకింక వలదమ్మా
నీవుదప్ప పరులెవరూ పట్టించుకోరమ్మా
ప్రతిగా ఏమీయాలో నన్నిపుడె కోరవమ్మా
దుఃఖాలకు సంతోషాలకు మూలమైన దేవి
కరిగిన నా ఆనందాన్ని తిరిగి అందించవేమి

2.వీణ పట్టుకున్నపుడు వాణిగా నిను కొలిచేను
సిరులు ధారబోయునపుడు శ్రీలక్ష్మిగ అర్చించేను
ధైర్యమే దిగజారినపుడు శక్తిగా పూజించేను
చావోరేవో తేల్చుకొనగ చాముండిగ అర్థించేను
సకల జీవులన్నిటికీ తల్లివైన దేవీ
కరిగిన నా ఆనందాన్ని తిరిగి అందించవేమి

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అందమె ఆనందమనీ అన్నారు ఆనాడు..
ఆనందమె అందమనరా నిను చూసిన ప్రతివారు
స్వచ్ఛమైన నీ నవ్వు మనసుకెంత ఉల్లాసం
హాయిగొలుపు నీ నవ్వు కనినంతనె ఆహ్లాదం
నిన్నుచూస్తు గడిపేస్తాను ఈ జీవితాంతం
రెప్పవాల్చలేకున్నాను లిప్తపాటుకాలం

1.కన్నులూ నవ్వుతాయని నీవుకదా తెలిపింది
వెన్నెల్లు రువ్వుతాయనీ ఇపుడె కదా ఎరుకైంది
హరివిల్లు విరిసిందీ నీ కనుబొమ్మల్లోనా
సింధూరం మెరిసింది నీ నుదుటి కనుమల్లోనా
నిన్నుచూస్తు గడిపేస్తాను ఈ జీవితాంతం
రెప్పవాల్చలేకున్నాను లిప్తపాటుకాలం

2.ముక్కుపుడక నవ్వుతుందా ఎక్కడైనా
సంపంగి నీముక్కున అది సాధ్యమేగా
పలువరుసలోనా ముత్యాల వానా
నీఅధర దరహాసం వర్ణించ నాతరమౌనా
నిన్నుచూస్తు గడిపేస్తాను ఈ జీవితాంతం
రెప్పవాల్చలేకున్నాను లిప్తపాటుకాలం