Wednesday, January 15, 2020


ఇల్లిల్లు బిచ్చమెత్తు శివుడవు నీవు
పాదాల గంగ పుట్ట శ్రీ హరి నీవు
కప్నీ ధరించిన దత్తాత్రేయుడవు
సకల దేవతా స్వరూపుడవు
సాయీ నీవు ఇలలోన ప్రత్యక్షదేవుడవు
కోరినదొసగే కల్పవృక్షమే నీవు

1.దుర్గుణాల పరిమార్చే లయకారుడవు
సదమలవృత్తిని పోషించే జగములనేతవు
పరమపదము నందించే జగద్గురుడవు
సకల దేవతా స్వరూపుడవు
సాయీ నీవు ఇలలోన ప్రత్యక్షదేవుడవు
ఇడుములనెడబాపే చింతామణి నీవు

2.కల్లాకపటమెరుగని భోళాశంకరుడవు
అల్లాహ్ మాలిక్ అని నుడివే ఆత్మానందుడవు
చనిపోయీ బ్రతికొచ్చిన ఏసుక్రీస్తు వైకల్పుడవు
సకల దేవతా స్వరూపుడవు
సాయీ నీవు ఇలలోన ప్రత్యక్షదేవుడవు
కామితార్థమందించే కామధేనువే నీవు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:రేవతి

పయనించు పయనించు ఏకాగ్ర చిత్తుడవై
నీ పయనం సాగించూ అంతర్ముఖుడవై
నీ లోకి లోలోకి లోలోకి పయనించు
అలుపెరుగని నదిలా మదిలోకి ప్రవహించు

1..కోల్పోతున్నదేది అప్పుడు గ్రహించము
చేజార్చున్నదాన్ని ఏమిచ్చీ పొందలేము
ఒంటరివే ఎప్పటికీ ఏకాంతమె నీ వాసము
క్షణికమైన వాటికొరకు వెచ్చించకు సమయము

2.గమ్యం ఒకవైపు నీ గమనం ఒకవైపు
ఎంతగా నడచినా చేరవు లక్ష్యం వైపు
నీతో నీవే సంభాషించు నీలో నీవే సంగమించు
తరించు అంతరించు నేనే గా అవతరించు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

తొలిసారి చూసింది నిన్ను
లక్ష్మీనరసింహస్వామి మందిరాన
అచేతనమైపోయింది నా కన్ను
సిరిలా నువు ఎదురైన ఆక్షణాన
తక్షణ వీక్షణలోనే నిను మనసా వలచితి
హరిణేక్షణ నీసరి వివరాలెరుగనైతి
అలరించినావే లలిత లావణ్య లలనా
గీతవై జీవనదాతవై నను నడిపే నేతవై

1.వికసిత అరవిందాననము
చెంగల్వరేకు నయనద్వయము
చెక్కళ్ళ సొట్ట సొబగు బాగుబాగు
అరవిరిసిన చిరునగవు అందాలుపోగు
నాకొరకే జన్మించిన సౌందర్యలహరి
అర్ధాంగిగ చేకొను వరమందితినే కోరి
ననుచేరినావే లలిత లావణ్య లలనా
గీతవై జీవనదాతవై నను నడిపే నేతవై

2.కాలుమోపావు మదిలో అమాయకంగా
ఆక్రమించావు నా జీవితమే నీదనేంతగా
అణకువ ఐనవారిఎడల ఆప్యాయత
సంతరించుకున్నావు ఎనలేని ఆదరణ
సఫలీకృతవైనావు షట్కర్మయుక్తగా
సామాజిక బంధాలకు సంధానకర్తగా
పెనవేసినావే లలిత లావణ్య లలనా
గీతవై జీవనదాతవై నను నడిపే నేతవై