Wednesday, December 23, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఇల్లేమో ఇరకటం ఇల్లాలో మరకటం

జీవితాంతం మగనికెంత ఎంత సంకటం

తప్పదు తల ఒగ్గటం ఎప్పుడూ ఆమే నెగ్గటం

మెడకు పడ్డ డోలును విధిలేకే మోయటం


1.పదిమందిలొ నాటకం అన్యోన్యపు కాపురం

నాలుగు గోడల మధ్యన సంసారం సాగరం

పట్టలేని విడవలేని వింతగు పితలాటకం

గుట్టుగ నెట్టుక రావడమే మగవాడికి నరకం


2. మహిమ మాట వట్టిదే మనువు మంత్రాలకు

మనసెలా ఉంటుంది మొండిఘటపు యంత్రాలకు

కీచులాటలన్నీ సద్దుమణగాలి  సాయంత్రాలకు

సరే యనక కుదరదు దాంపత్యపు తంత్రాలకు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువ్వే నాకు ఒక టానిక్కు

లేకుంటే లైఫే మెకానిక్కు

ఎక్కితే మనం ఫ్రెండ్షిప్ టైటానిక్కు

బతుకంతాలక్కు ,లేకుంటే నేనైతే బక్కెట్ కిక్కు


1.మునిగినా సంతోషమే మూణ్ణాళ్ళు కలిసున్నా

మురిపాల కావాసమే నీ చెలిమితొ అన్నులమిన్నా

మళ్ళీ మళ్ళీ జన్మిస్తా నీకొరకె నేస్తమా

మరణాన్ని ఆహ్వానిస్తా మరుజన్మకైనా ప్రాప్తమా


2. నేను కలమై రాయాలంటే పారాలీ సిరావు నీవై

నేను పాటగ మారాలంటే చేరాలీ నా ఊపిరి నీవై

నేను నేనుగ లేనేలేను పరిణమించా నీవుగా

నాలో ఉన్న నీతో ఎపుడో పరిణయించా హాయిగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కురంజి


సద్గురుడవు నీవు కదా సాయి

అందుకో ఇకనైనా ఈ శిశ్యుడి చేయి

వెతుకుతూ వస్తాడట గురువు శిశ్యుడిని

తాత్సారమెందుకు నను ఉద్ధరించడానికి

సచ్చిదానంద సద్గురు సాయినాథా

వందనం యోగిమహారాజా అనాథ నాథా


1.అన్నీ తెలుసుననే అజ్ఞానిని

ఏమీ తెలియని మూఢుడిని

దారీతెన్ను లేక తిరుగుతున్నా

సన్మార్గము చూపమని వేడుతున్నా

సచ్చిదానంద సద్గురు సాయినాథా

వందనం యోగిమహారాజా అనాథ నాథా


2. నా పుట్టుక ప్రయోజనం ఎరుగను

నా జన్మకు పరమార్థం గ్రహించను

కాలయాపనే చేసా ఈనాటి వరకు

తపించిపోతున్నా నీ పాద సేవకొరకు

సచ్చిదానంద సద్గురు సాయినాథా

వందనం యోగిమహారాజా అనాథ నాథా

 "సింగరేణి" శత వార్షికోత్సవ సందర్భంగా-


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కీరవాణి


మా తెలంగాణ ఇంధనమా

సింగరేణి కృష్ణ కాంచనమా

శ్రమైక సౌందర్య జీవనమా

జోహారులమ్మా మా వందనం గొనుమా


1.బాసర పునాదిగా భద్రాద్రి తుదిగా

గోదావరి నదీ లోయ ప్రాతిపదికగా

విస్తరించినావమ్మా మా ఆర్తిని తీర్చగా

తరగని బొగ్గుగనిగ  కీర్తిని చేకూర్చగా

జోహారులమ్మా మా వందనం గొనుమా


2.పరిశ్రమల మనుగడకే ప్రాణవాయువై

విశేషించి విద్యుత్తు ఉత్పాదక మూలమై

ప్రభుత ఖజానాకు నీవు సదా చేయూతవై

ప్రజల ఉపాధికల్పనలో ప్రధాన భూమికవై

జోహారులమ్మా మా వందనం గొనుమా


3.శ్రమజీవుల ఘర్మజలం  నిన్నభిషేకించగా

అనవరతం అలుపెరగని కన్నులు హారతిగా

సింగరేణి కార్మిక జీవితకాలమే నైవేద్యంగా

నీదైన ప్రత్యేక లోకమే జనులకు హృద్యంగా

జోహారులమ్మా మా వందనం గొనుమా