Friday, August 2, 2019

నా మనసే మామిడి తోట
కోయిలమ్మా పాడవే ఒక పాట
నీ గానం తేనెల ఊట
గ్రోలనీవమ్మా కమ్మగా ఈపూట
పారిజాత పరిమళాలు  కుమ్మరించి
ఇంద్ర ధనుసు రంగులన్ని రంగరించి
అనురాగం ఆప్యాయత మేళవించి
పాడవే ప్రపంచమే పరవశించేలా
నీ పాటలొ మాధుర్యం ఎదను స్పృశించేలా

1.అమ్మలాలి పాటనే తలపించేలా
గొల్లవాడి పిల్లనగ్రోవే స్ఫురియించేలా
యాతమేసె రైతు గొంతుకు వంత పాడేలా
ఎలుగెత్తే నావికుడి గళమును మరిపించేలా
పాడవే ప్రపంచమే పరవశించేలా
నీ పాటలొ మాధుర్యం ఎదను స్పృశించేలా

2.విజయ శంఖమే పూరించిన చందంగా
సింహనాదమే నినదించిన వైనంగా
కవాతుకే సవాలునే విసిరే విధంగా
జలపాతపు హోరుజోరు ధ్వనించే దృశ్యంగా
పాడవే ప్రపంచమే పరవశించేలా
నీ పాటలొ మాధుర్యం ఎదను స్పృశించేలా


రచన.స్వరకల్పన,గానం:రాఖీ
 రాగం:ముఖారి

అల వైకుఠం ఇల తిరుపతి క్షేత్రం
కలియుగవాసుల కైవల్యధామం
వెలసినాడు వేంకటపతి దాటించగ భవజలధి
సుజనులార తరించగా
తరలిరండి గోవిందుని కృపనందగా
గోవిందా గోవిందా-గోవిందా గోవిందా
గోవిందా గోవిందా-గోవిందా గోవిందా

1.దూరభారమెంతైనా వ్యయప్రయాసలెన్నైనా
ఏడుకొండలెక్కగనే బడలిక ఎగిరి పోతుంది
బంగారు శిఖరాన్ని కనినంతనె మనసు కుదుట పడుతుంది స్వామిదివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తే ఆనందం అలౌకికమౌతుంది
గోవిందా గోవిందా-గోవిందా గోవిందా
గోవిందా గోవిందా-గోవిందా గోవిందా

2.తలనీలాలిస్తె చాలు వెతలెడబాపుతాడు
కోనేటిలొ మునిగినంత కోరికలీడేర్చుతాడు
నీదను భావన తొలగించగ ముడుపులు గైకొంటాడు
రెప్పపాటు విలువతెలుప తృటిలొ మాయమౌతాడు గోవిందా గోవిందా-గోవిందా గోవిందా
గోవిందా గోవిందా-గోవిందా గోవిందా

3.ఆపదమొక్కులవాడు వాడనాథనాథుడు
సిరులొసగే సరిదేవుడు శ్రీ శ్రీనివాసుడు
వడ్డికాసులవాడు పద్మావతి విభుడు దొడ్డ దేవుడు
అలుమేలు మంగాపతి స్వామి శరణాగతవత్సలుడు
గోవిందా గోవిందా-గోవిందా గోవిందా
గోవిందా గోవిందా-గోవిందా గోవిందా
జాతిని గమనించలేదు రాముడు సుగ్రీవుడు
కులమునెంచలేదు కృష్ణుడూ కుచేలుడు
తాహతులను తలచలేదు సుయోధన కర్ణులు
కులమతాలకతీతమే ఎప్పుడూ స్నేహితము
గాఢత ఎంతో కలిగిన వింత బంధము మైత్రీ బంధము

1.రంగును రూపును అసలే లెఖ్ఖించదు
వయసును విద్వత్తును పరిగణించదు
మగనా మగువనా అనికూడా చూడదు
ఎవరెవరికి మధ్యన ఏర్పడునో స్నేహితము
గాఢత ఎంతో కలిగిన వింత బంధము మైత్రీ బంధము

2.ప్రయాణాల్లొ మొదలౌను ఒక స్నేహము
కలంతోనె కుదురుతుండె అలనాటి స్నేహము
గొడవతొ సైతం బలపడును మరొక స్నేహము
సామాజిక మాధ్యమాల దీనాటి స్నేహము
గాఢత ఎంతో కలిగిన వింత బంధము మైత్రీ బంధము

3.సాహిత్యం వారధిగా సాగేనొక స్నేహము
సంగీతం సారథిగా చెలఁగేనొక స్నేహము
అభిరుచులతొ వికసించేనొక స్నేహము
ఇవ్వడమే ఎరిగినది మధురస్నేహము
గాఢత ఎంతో కలిగిన వింత బంధము మైత్రీ బంధము