Tuesday, August 20, 2019

అల్లసాని వారిని అర్థిస్తా నేర్పమని
కాళిదాస సత్కవినీ వేడెదను చెప్పమని
శ్రీనాథుని గురువుగా ఎంచెద బోధించమనీ
జయదేవుని ప్రార్థిస్తా ప్రణయ రసమునెరిగించమనీ
నా కావ్య నాయకీ నిను వర్ణించ సాహసించెద
నా స్వప్న సుందరీ నిను  ఆవిష్కరించ బూనెద

1.తనువేమొ మదనుని సదనం
వదనమేమొ అహరహ శరదం
నయనమైతె వికసిత కుముదం
నుదుటవెలుగు సింధూరం
తొలిపొద్దుకు ప్రతిరూపం
దోబూచులాడే ముంగురులు
తేలిపోయే  పయోధరాలు
నా కావ్య నాయకీ నిను వర్ణించ సాహసించెద
నా స్వప్న సుందరీ నిను  ఆవిష్కరించ బూనెద

2.అధరమే చుంబన రంగం
చుబుకమే కౌశిక శకలం
కసిని జాగృత పరచి
ఉసిగొలిపే రసనే అమృతం
మిసమిసల కెంపుల్లా
నిగారింపు చెంపల్లో నవనీతం
నా కావ్య నాయకీ నిను వర్ణించ సాహసించెద
నా స్వప్న సుందరీ నిను  ఆవిష్కరించ బూనెద


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అడగకనే వరమిచ్చే దేవత
కళ్ళముందు కదలాడే అప్సరస
అనునిత్యం తోడుండే  నీ నీడ
అర్ధాంగి ధర్మపత్మి గృహిణి ఇల్లాలు
ఏ పేరున పిలిచినా అన్నీ తానైన ఆవిడ
సరదాకైనా అపహాస్యం మానరా మానవుడా

1.ఆచితూచి తాను అడుగేస్తుంది
పతి తొందరపాటును సరిచేస్తుంది
న్యాయవాది పట్టా తనకు లేకున్నా
మన తరఫున వకాల్తా పుచ్చుకొంటుంది
సమాజాన మన స్థాయి ఏదైనా
సగర్వంగ మగని గౌరవిస్తుంది
భార్య కళత్రము  శాలిని మగనాలు
ఏ పేరున పిలిచినా అన్నీ తానైన ఆవిడ
పరాచికానికైనా పలుచన చేయకురా మానవుడా

2.సంపాదన నీదైనా తానే సగబెడుతుంది
ఇంటిపేరు నీదైనా తానే నిలబెడుతుంది
నీ ఆకలి తీర్చేటి కాశీ అన్నపూర్ణ తాను
నీ చింతను  బాపేటి చింతామణి తాను
నిన్నెంతో కట్టడి చేసైనా
నిను చక్కటి దారిలోన పెడుతుంది
పెండ్లాము దేవేరి ఇంతి ప్రాణేశ్వరి
ఏ పేరున పిలిచినా అన్నీ తానైన ఆవిడ
పొరబడికూడ కించపరచబోకురా  మానవుడా