Saturday, June 22, 2019

శ్రీ వేంకటేశా అనినంతనే తొలగును పాపాలు
శ్రీనివాసా అని అర్థించగనే కలుగును సిరిసంపదలు
ఆపదమెక్కులవాడా అని తలవగనే అంతరించు ఇక్కట్లు
ఏడుకొండలవాడా అంటూ వేడగనే వీడను మదిచీకట్లు
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
గోవిందా హరి నమో నారాయణా

1.బంగారు శిఖరాల అలరారు ఆలయం
భువిలోన వెలసిన అపర వైకుఠం
సప్తగిరులపై వెలసిన స్వామి చిద్విలాసం
దర్శించగ  తరియించును మన జీవితం
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
గోవిందా హరి నమో నారాయణా

2.కోట్లమంది భక్తులకు స్వామి ఎడల విశ్వాసం
నిలువుదోపిడనునది భవబంధమోచనం
తలనీలాలీయగా సమయు అహంభావం
అడుగడుగు దండాలతొ జన్మ సాఫల్యం
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
గోవిందా హరి నమో నారాయణా
రచన:గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)-9849693324

ఒళ్ళంతా కళ్ళు చేసుకొని-
కళ్ళల్లో వత్తులేసుకొని
పగలంతా పనులు మానుకొని-
రేయంతా నిదుర వదులుకొని

చకోరి పక్షుల్లా వేచి చూసాము రామా
చాతక పక్షుల్లాగా తపన పడ్డాము రామా
ఇళ్ళూ వాకిళ్ళ ధ్యాస మరిచాము రామా
పద్నాలుగేళ్ళూ దారి కాచాము రామా

నువ్వింక వస్తావని-మా ఆర్తి తీర్చేవని
మారాజు వౌతావని-మమ్మేలుకొంటావి
రఘుకుల సోమా రామా కారుణ్య ధామా
దశరథ నందన రామా  హే పట్టాభిరామా

అనుకున్న క్షణము వచ్చిందిగా
కల నిజమై  ఎదుటే నిలిచిందిగా
స్వాగతమయ్యా సాకేత రామా
సుస్వాగతమయ్యా హే సార్వభౌమ

నీవేలేనీ రాజ్యం బీడై పోయింది
నీవేలేని నగరం అడివే అయ్యింది
కష్టాలు తీర్చేవాళ్ళు కరువాయెగా
కన్నీళ్ళు తడిచేవాళ్ళే లేరాయెగా


నువ్వొచ్చినావంటె మా బత్కులె పండేను
నువురాజ్యమేలితెమా కడుపులె నిండేను
విజేతవై నువ్వు వచ్చావయ్యా
అయ్యోధ్యపురికే వన్నె తెచ్చావయ్యా

సుగ్రీవునితో మైత్రి చేసావట
బలశాలివాలిని మట్టుబెట్టావట
మారుతినే బంటుగ చేసుకున్నావట
అంబుధికే వారధికట్టి దాటావట

సీతమ్మను చెఱనే బెట్టిన-
లంకేశుడు రావణున్ని
ఒక్క బాణంతో నేల కూల్చావట
శరణన్న విభీషణున్కి పట్టం కట్టావట

దండాలు నీకు కోదండ రామయ్యా
జేజేలు నీకివే మాజానకి రామయ్యా

నీ చూపు పడితేనే మేఘాలు మెరిసేను
నువ్వడుగు పెడితేనె వానల్లు కురిసేను
పంటలే పండేను గాదెలే నిండేను
ఊరూర ఇకపై ప్రతిరోజు పండగౌను

నీ గాధలే మాకు మార్గాన్ని చూపేను
మా బాధలింక మటుమాయమయ్యేను

ఇంటింట ప్రతి పూట నవ్వులే విరిసేను
ప్రతినోట రామ రామ రామయే పలికేను
వందన మిదిగో అందాల రామా
మావినతులందుకో నీలమేఘశ్యామ
ఏమౌతున్నది నాదేశం
జగతికి ఏమని సందేశం
హిందూ ముస్లిం సిక్కు ఇసాయి
లౌకిక తత్వమె మతమిట భాయి
భారతీయతే అభిమతమోయి
జై జవాన్ జై కిసాన్
జైవిజ్ఞాన్ జై అనుసంధాన్

1నేటికి సైతం నింగివైపు
ఆశగ చూసే భారతరైతు
జీవనదులు గంగాయమునలు
కాకూడదిక అంబుధి పాలు
నదులన్నీ మళ్ళాలి బీడు భూములలోకి
పండిన పంటచేరాలి హర్షంగా పెదాలపైకి
వర్షం ఎన్నడు రాయకూడదు
కృషీవలుని తలరాతలను
కంటతడే పెట్టక కర్షకుడికపై
కననేకూడదు కలచేకలను

2.నెత్తురుకూడ గడ్డకట్టే చలిలోను
కణకణమండే ఎండల్లో ఎడారిలోను
తుఫానువేళనైనా సాగరతీరంలోను
అడవులు కొండలు కోనలలోను
రేయీపగలు పహారా కాచే సైనికుడు
శత్రువుగుండెలొ నిద్రపోయే యోధుడు
వీరమరణంపొందినా లోటురావద్దు
తన భార్యాపిల్లలెపుడూ అనాధలుకావొద్దు
మననిశ్చింతకు జవాను త్యాగం మూలంమరవొద్దు
రోజొక రూపాయ్ వితరణ చేయగ వెనుకాడవద్దు

3.ఉన్నతవిద్యలు నేర్చి దేశం రొమ్ముగుద్దొద్దు
పరదేశాల పౌరులగుటకై మోజు పడవద్దు
తెలివితేటలు దేశ ప్రగతికై ధారపోయాలి
పరిశోధనలు ప్రావీణ్యతలు ఇటనే చూపాలి
విద్యా వైద్యం ప్రభుతచొరవతో ఉచితం కావాలి
తేరగ ఇచ్చే తాయిలాలిక రద్దుకావాలి
ఆదుకునేందుకు సర్కారే ముందుకురావాలి
ఉపాధి కల్పనతోనే ఉత్పాదక పెరగాలి
మన ద్రవ్యానికి ప్రపంచమంతా విలువీయాలి
భారతదేశం ఇలలోనే తొలిస్థానానికి ఎదగాలి

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మధ్యమావతి

సంగీతం సంగీతం
సంగీతంతో మనిషి జీవితం
సంగీతంతో బ్రతుకు సార్థకం
సంగీతం సంగీతం
అణువణువున సంగీతం
అడుగడుగున సంగీతం
సంగీతమే ప్రకృతి సాంతం
సంగీతమే సృష్టి స్థితి లయం

1.సాగర ఘోషలొ సంగీతం
ఊపిరులూనగ సంగీతం
తొలకరి చినుకుల సంగీతం
లబ్ డబ్ ఎద లయ సంగీతం
సంగీతమే ప్రకృతి సాంతం
సంగీతమే సృష్టి స్థితి లయం

2.మేఘ గర్జన లొ సంగీతం
గాలి కదలికలొ సంగీతం
శకుంత కువకువ సంగీతం
సమ్మోహక పిక  సంగీతం
సంగీతమే ప్రకృతి సాంతం
సంగీతమే సృష్టి స్థితి లయం

3.శిశు రోదనలో తొలిసంగీతం
లాలిపాటలో మధుర సంగీతం
కిరుకిరు ధ్వనులే తొట్లె సంగీతం
చిటపటమంటలె చితి సంగీతం
అణువణువున సంగీతం
అడుగడుగున సంగీతం


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:చక్రవాకం
చంద్రమౌళీశ్వరీ రాజరాజేశ్వరీ
మాతా శ్రీకరి శ్రీ లలితేశ్వరి
నీపాద పద్మాల భ్రమరమై మననిమ్ము
నీ చరణ మంజీరమై మ్రోగనిమ్ము

1.నీ నయనాలలో కేదార క్షేత్రాలు
నీ దరహాసములొ భగీరథీ తీర్థాలు
నీసన్నిధిలో జన్మరాహిత్యాలూ
నీ సేవలే ఇల ఆనంద సూత్రాలు
హే త్రిపుర సుందరీ భువనైక మోహినీ
మాతా శ్రీకరి శ్రీ లలితేశ్వరి
నీపాద పద్మాల భ్రమరమై మననిమ్ము
నీ చరణ మంజీరమై మ్రోగనిమ్ము

2.బ్రహ్మాది దేవతలు నీ భృత్యులే తల్లీ
ఏడేడు లోకాల సామ్రాజ్ఞి నీవె జనని
సృష్టిస్థితి లయలు నీమాయలే
అంతఃకరణాలు నీ ఆజ్ఞలోనే
శ్రీచక్ర రూపిణి మణిద్వీపవాసినీ
మాతా శ్రీకరి శ్రీ లలితేశ్వరి
నీపాద పద్మాల భ్రమరమై మననిమ్ము
నీ చరణ మంజీరమై మ్రోగనిమ్ము
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:సింధుభైరవి

నటరాజా శంభో  నగజా విభో
తాండవ కేళీ లోలా లయకారా ప్రభో
తెరవాలీ మూడో కన్ను కలపాలీ మన్నూ మిన్నూ
మ్రోగాలీ ఢమఢమఢమఢమ ఢమరూ
సాగాలీ ధిమిధిమి నీ నర్తిత పదములూ

1.ఊపిరినే శృతి చేసెను  ప్రకృతి
ఎద స్పందన లయ కూర్చితివా పశుపతి
జీవనాదమొనరించి ఇచ్చితివీ మానవాకృతి
తపించి తరించగ జన్మరాహితి
వచ్చిన సంగతి మరచి నీచకర్మలాచరించి
భ్రష్టులమైతిమి పతనగతిని చరించి

2.ఉత్కృష్టమైనది ఈ మానుష జన్మము
ఉన్నతమైనది మనిషి మనిషి బంధము
సృష్టికార్యమన్నది అతి పవిత్రమైనది
వావివరుస వయసు మరచి నికృష్టమైనది
నీవె ఇక దిగివచ్చి మాకు నియతి నేరుపు
మారని మనుజులను నీవె మంటగలుపు




రచన,స్వరకల్పన&గానం: రాఖీ

రాగం:చంద్రకౌఁశ్

చిద్విలాసా తిరువేంకటేశా
అర్ధనిమీలితనేత్రా నిజ శ్రీనివాసా
శిలాసదృశా సర్వేశా
భక్త పోష బిరుదాంకిత సప్తగిరీశా
నటనలు చాలించి మము పాలించరా
దుర్ఘటనలు వారించి  దృష్టి సారించరా

1.నిన్ను నమ్ముకుంటే నట్టేట ముంచుదువా
నీవే  శరణనన్ననూ  స్వామీ మిన్నకుందువా
 ప్రహ్లాదుని కోసము నరహరివై వెలిశావట
ధృవుడిని సైతము ఆదరించినావట
ప్రకటితమవ్వాలి ఇపుడే నీమహిమలు
లోకానికి చూపాలి నీ అద్భుత లీలలు

2.ఎలుగెత్తి పిలిచిందని బ్రోచితివా కరిరాజును
దుఃఖితయై ప్రార్థించగ కాచితివా పాంచాలిని
నిన్నేమి కోరనని కొరవితొ మంట పెట్టితివా
నీ కొండకు రానని గుండెను మండిచితివా
పరమదయాళా  తాళను మన్నించరా
దండించినదిక చాలు  దయగన జాగేలరా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:సరస్వతి

గజాననా నగజానందనా
నిజముగ నిను నమ్మితిని
రుజలను మాన్పరా స్వస్థత కూర్చరా
లంబోదరా పాశాంకుశ ధరా
చిత్తము శీఘ్రమే కట్టడి సేయరా క్రమతను నడపరా

1.తలపులొ వాక్కులో సతతము నిను నిలిపెద
ప్రతి పనియందును తొలుతగ నిను మ్రొక్కెద
నిద్దురలో మెలకువలో నిన్నే స్మరియించెద
సత్వరమే వరమీయగ నిను ప్రార్థించెద
ఏకదంతా మూషకాసుర నుతా
నమోవాకమిదిగో మోదకామోదకా

2.తొందరపాటుతో పొరబడనీయకుమా
లౌక్యము నాకు గఱపి నన్నుద్ధరించుమా
అహంభావమంత నాలొ అంతరింపజేయుమా
కడతేరు వరకునూ ఆరోగ్యమునీయుమా
వక్రతుండా నీవే నాకు అండదండ
ప్రణవాత్మజ నీకిదే ప్రణుతుల పూదండ