Thursday, November 11, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పరిచయాన పరిమళాలు-వెదజల్లినావె

స్నేహితాన సౌరభాలు-విరజిమ్మినావె

మైత్రీ మధురిమలే-కురిపించినావె

నా లోన ఊహలొన్నొ మొలిపించినావే


 1.మధురోహల రోదసిలో-విహరింపజేసావె

అనుభూతుల మరుమల్లెలు-వికసింపజేసావె

మంత్రమేదొ వేసి నన్ను –మాయజేసినావె

నన్ను నేనె మఱచులాగ-మైకంలో ముంచావే


2.నువ్విచ్చిన వరమెకటే –తీయనైన ఈ విరహం ....

నామదికిక పని ఒకటె-నిను తలచుట అహరహం...

నువ్వు కలవని కాలం-వర్షమాయె

నిను చూడక నా కనుల-వర్షమాయె

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాగనంపు వేళసైతం 

కనులనుండి పారెడిది నదే అలనాడు సాంతం

వల్లకాటిలో చితి కాలితేనేం 

తడి జాడ మదిలోనూ కనిపించని నేటి వైనం

స్పందనే మరచిన గుండె స్థాణువై పోయింది

బ్రతకడానికే అన్నట్టు మొక్కుడిగ ఆడుతోంది


1.కడుపు చించుక కన్నారు తల్లులంత ఆనాడు

కడుపు చించడం మినహా కనుట కుదరదీనాడు

చనుబాలు అమృతమై బొజ్జనింపె శిశువులకు

బలవర్ధక పోషక పాలే గతి నేటి పసికూనలకు

గోరుముద్ద చందమామ బువ్వలో వినోదమే

అమ్మ బుక్క నాన్నబుక్క దొంగబుక్క ఆనందమే


2.బాగోగుల పరామర్శలు  ప్రేమచిలకరింపులు

పరిచయం లేకున్నా చిరునవ్వుల పలకరింపులు

అవసరాలు గుర్తెరిగీ అందజేయు చిరుసాయాలు

ఎవరికి వారైన ఈ తరుణాన వెదకినా మృగ్యాలు

ఒలకదు కన్నీటి చుక్క నవ్వులైతె అతికిన లెక్క

మానవత్వం మనుషుల్లో తానో ఎడారి మొక్క

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పట్టరాని సంతోషం పసిడి గాజులకు

పట్టుకుంది అదృష్టం మట్టి గాజులకు

ఏ పుణ్య ఫలమో చెలీ  నీ పాణిగ్రహణం

ధన్యమైంది గాజు జీవనం నీచేయి చేరిన మరుక్షణం


1.మంజుల స్వని చేస్తాయి నీకదలికల కచ్ఛేరికి

అందంగా మ్రోగుతాయి పదపడు నీ చిందులాటకు

మంత్రముగ్ధులౌతాయి నీ మృదువైన కరస్పర్శకు

తెగనొచ్చుకుంటాయి పడకన సడిచేసినందుకు


2.మెరుపులరువు గొంటాయి నీమేని చక్కదనానికి

ఆవురావురంటాయి పోటీగా నీ చేతినెక్కడానికి

ఏ రంగు కోకోయని బెంగపడతాయి తమరంగు వంతుకై

గుండెప్పుడు పగులునోయని గుబులే తమ బ్రతుకై

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆచితూచి అందుకే మాటలాడ మన్నది

మాట ఇచ్చి ఎప్పుడూ తప్పకూడదన్నది

చేయగలిగితేనే చెప్పాలి 

ఒకసారి చెప్పామా చేసితీరాలి

మనమీద మనకైన లేకపోతె అదుపు

మన మాట గడ్డిపోచకూ తూగదు

పోతేమాత్రమేమి ప్రాణం

తప్పకూడదెప్పటికీ వాగ్దానం

మదిలో ఎందుకు అపరాధ భావనం

ఆది నిష్టూరమే అత్యంత సుగుణం


1. వీథులపాలైనారు ఇచ్చిన మాటకొరకు

ఆలినైన అమ్మినారు ఆలాపమన్నందుకు

రాజ్యాన్నీ వీడారు ఆడిన నుడుగు కొరకు

పోరినారు తనవారని ఎరగినా చివరకు

పోతేమాత్రమేమి ప్రాణం

తప్పకూడదెప్పటికీ వాగ్దానం

మదిలో ఎందుకు అపరాధ భావనం

ఆది నిష్టూరమే అత్యంత సుగుణం


2.వెసులుబాటు చూసుకొనే ఇవ్వాలి మాట

మన మాట నమ్మితే ఎదుటివారికి అరట

తప్పిన మాటకై పదే పదే వాయిదాలొకటా

సాకులనే  సాకుతూంటె ఎంతకూ ఒడవదట

పోతేమాత్రమేమి ప్రాణం

తప్పకూడదెప్పటికీ వాగ్దానం

మదిలో ఎందుకు అపరాధ భావనం

ఆది నిష్టూరమే అత్యంత సుగుణం