Saturday, September 11, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రకటితమవుతావు ప్రతి తావు

ఆపన్నులనాదుకొనగ అభయహస్తమిసావు

వేంకటరమణా యనే భక్తుల మొరలు వినే

కలియువరదుడవే కరుణాభరణువే

గోవిందా ముకుందా మురారి వేంకటగిరి శ్రీహరి


1.నీదే భారమని మాకాధారమని

నిజమానసమ్ముతో విశ్వాసమ్ముతో

నెరనమ్మినవారికి కొంగుబంగారమీవు

సర్వస్యశరణాగతి వేడగ ఎదుటనిలిచి

కడతేర్తువు కడలేని కష్టాల కడలి గాచి


2.దైవం మానుష రూపేణాయని నిర్ధారణకాగా

మానవుడే మాధవుడనుటకై నిరూపణగా

ఎవరో ఒకరి రూపంలో నీవే అరుదెంచి

నీ దాసుల వెతలను  చిటికెలొ తీర్చేవు

కమ్ముకున్న మబ్బులను తొలగించేవు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పోరి నే తేలేనేమో పారిజాత వృక్షం  

కోరితే తేలేనేమో కోహినూరు వజ్రం 

దించగా లేనేమో చందమామ నీకోసం

ఛేదించగా లేనేమో ఏ మత్స్యయంత్రం

ప్రేమనందించగలను పరులెవరు మించనట్లుగా

ఆనందింప జేయగలను ఔరా అనిపించునట్లుగా


1.ఎపుడో చేరిపోయావు నాలో నీవే ఊపిరిగా

ఎపుడో మారిపోయావు నీవే నీవే ఎదలయగా

నీతలపులె నను జో కొడతాయి రోజూ

నీ ఊహలు ఉదయం లేపడమే రివాజు

ఆరాధించరరెవరు ఇలలో నేను మినహా

అనురాగం పంచరెవరు ఇలా నా తరహా


2.గుట్టంటూ ఏమీలేదు గుండెనే తెరిచేసా

నాదంటూ లేనేలేదు జీవితాన్నె పరిచేసా

నా మనసు నీకు తెలుసనీ నాకూ తెలుసు

నీ మనసు నేనెరిగిన సంగతి నీకూ తెలుసు

తెలిసినదైనా తెలియదనడమే నీ బిడియం

తెలిసినదైనా తెలియజెప్పడం నా నైజం