Saturday, August 21, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మోహన


"యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః 

తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల"


అనురాగం విరిసే వేళ

అనుబంధం మురిసే వేళ

వచ్చింది నేడే రాఖీ పండగ

శ్రావణ పౌర్ణమి వెన్నెల్లు నిండగ


1.తోబుట్టువుల మమతల వారధి

సోదరి సోదర ప్రేమల నెలవిది

రక్షాబంధన పర్వదినమిది

సంతోషాలే కొలువు దీరినది


2.ఇందిర బలికి కట్టిన గురుతిది

ద్రౌపది కృష్ణుల ఆత్మీయ చిహ్నమిది

లాభ క్షేముల ఆకాంక్షమేరకు

సంతోషిమాత పుట్టిన దినమిది


3.గాయత్రి మాతను మది కొలిచేది

నూతన యజ్ఞోపవీత ధారణచేసేది

నిత్యకర్మానుష్ఠాన ఆజ్ఞను పొందేది

ప్రాయశ్చిత్త పంచగవ్యం సేవించే రోజిది


వేనోళ్ళ స్తుతించేను శేషుడు

నిరంతరం నుతించేను నారదుడు

వేదోక్త స్తోత్రాల సర్వదా గణుతింతురు సప్త మహా ఋషులు

వేల కీర్తనలతో కొనియాడిరి నిను  త్యాగయ్యా అన్నమయలు

ఏరీతి మెప్పింతును ఏడుకొండలవాడా

ఉడతనైన బ్రోచితివి జాలిగుండె రేడా


1.మనసులోనె తలచేను ఇపుడో అపుడో

ఇంటిలొ పూజింతును వీలున్నపుడెపుడో

గుడిలోనిను దర్శింతును ఏ పండగ పబ్బానికో

తిరుమల కరయడము ఎన్నాళ్ళకొ ఎన్నేళ్ళకో

ఏరీతి మెప్పింతును ఏడుకొండలవాడా

ఉడతనైన బ్రోచితివి జాలిగుండె రేడా


2.నిర్మించలేను స్వామి నీ సుందర మందిరాలు

ఈయగలేను ప్రభూ ఏ ఘనమైన కానుకలు

చేయగలేను నేను విరివిగా దానాలు ధర్మాలు

మోయలేను గోవిందా నిస్సార సంసార భారాలు

ఏరీతి మెప్పింతును ఏడుకొండలవాడా

ఉడతనైన బ్రోచితివి జాలిగుండె రేడా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నీలాంబరి


జోలపాటనై నిను బజ్జోబెడతా

లాలిపాటనై నిను జో కొడతా

హాయిగా నిదురించు ఈ నాన్న ఎదమీద

రేయంతా ఆదమరచి సేదదీరు నిశ్చింతగా 

జో అచ్యుతానంద జోజో ముకుందా

లాలి పరమానంద రామగోవిందా జో జో


1.ఉలికి పడకు నీకే తెలియని బూచిని తలచి

కలత చెందకు కడుపులోని నలతకు వగచి

నీ జుత్తులొ వేళ్ళు జొనిపి సున్నితంగ రాస్తా తలను

నీ వెన్నుంతా నిమురుతూ హత్తుకుంటా ప్రేమతోను

జో అచ్యుతానంద జోజో ముకుందా

లాలి పరమానంద రామగోవిందా జో జో


2.కథలెన్నో చెపుతాను ఊకొడుతు నువ్వుంటే

నెమరువేస్తాను నీ అల్లరిని మైమరచి నువువింటే

నువు చేసిన మారాము నే చేసిన  గారాలు

నిదురలోకి నీవుజారితె నే ఊపిరి తీసుకుంటా

జో అచ్యుతానంద జోజో ముకుందా

లాలి పరమానంద రామగోవిందా జో జో