Saturday, April 30, 2022

 https://youtu.be/nDZPaoOfXf4?si=gXtGlK6cRYfUyKIG


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మల్లెపూలకు ముళ్ళున్నా నే నమ్మగలను 

మకరందం చేదని అన్నా ఒప్పుకోగలను

చందమామ నల్లబడినా నే బాధపడను

పికము గొంతు నాలా మారినా విస్తుపోను

నువు కరుణజూడవంటే విశ్వసింతునా వేంకటేశ్వరా

నువు కావగ రావంటే నేనోర్తునా మా రమేశ్వరా

నారాయణ గోవిందా నమో వాసుదేవా

శ్రీవత్సాంకిత హే ముకుంద పాహి మాధవా


1. తీయగా మార్చగలవు ఉప్పునీటి బావిని

చల్లగా చేయగలవు మండుటెండ కాయు రవిని

ఇంపుగా చేర్చగలవు గాలికి పారిజాత తావిని

అన్నమయగ దయజూతువు శరణన్న ఈ కవిని

చిత్రమే కదలవంటె ఆర్తుల మొరలు విని

వింతయే నెరవేర్చవంటె భక్తుల మనవిని

నారాయణ గోవిందా నమో వాసుదేవా

శ్రీవత్సాంకిత హే ముకుంద పాహి మాధవా


2.దరిజేరావు ఎదిరిచూచు శబరి అనునయానికి

లాలించావు  ఉడతనైనా చిరుసాయానికి

వరమిచ్చావు కుబ్జకు తగు సమయానికి

సారథివైనావు కిరీటికి అని ధర్మ విజయానికి

న్యాయమా నను పరికించగా ఈ ప్రాయానికి

భావ్యమా నను దూరం చేయగా ఆరోగ్యానికి

నారాయణ గోవిందా నమో వాసుదేవా

శ్రీవత్సాంకిత హే ముకుంద పాహి మాధవా