Wednesday, July 15, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పొగిడితే పొంగవు తెగిడితే కృంగవు
ఏ ప్రలోభాలకూ లొంగనే లొంగవు
కలుషితాలు తొలిగించే పావన గంగవు
దత్తాత్రేయుని అవతారమేనీవు
షిరిడీ సాయిగ మాకై వెలిసావు
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆశ్రితజనాభీష్ట వర ప్రదాయకా

1.సాయి నీనామం నిరంతరం మా స్మరణం
బాబా నీ రూపం అనవరతం మా ధ్యానం
పగలూ రేయీ కలలో ఇలలో నీపై ధ్యాస
పీల్చిన వదిలిన నీదేనీదే నా ప్రతి శ్వాస
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆశ్రితజనాభీష్ట వర ప్రదాయకా

2.ఆపదలోను సంపదలోను ఆప్తుడవీవే
వేదనలోనూ మోదములోనూ నేస్తము నీవే
తల్లిదండ్రి గురువూ దైవము సర్వము నీవే నీవే
అన్యధాశరణం నాస్తి ఆదుకోగ వేగ రావే
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆశ్రితజనాభీష్ట వర ప్రదాయకా

రచన,స్వరకల్పన&గానం:డా రాఖీ

పాలకావడి పట్టుకొచ్చా పళనిమలవాసా
పంచదార మోసుకొచ్చా పార్వతి ఔరసా
ఆయురారోగ్యాలకు  నీదేలే స్వామి భరోసా
నమ్మికొలుచుకుంటున్నాను చేయకయా అడియాసా

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం స్వామినాథా సుబ్రహ్మణ్యం

1.మార్గశీర్ష శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యా నీ జన్మదినం
మనసారా చేయుదు నీకు అభిషేకం అర్చనం
అగ్నితోజోమూర్తీ వర్ణించ నా వశమా నీ కీర్తీ
నీవే ఇక నెరవేచ్చాలి తీరని నా హృదయపు ఆర్తి

2.గుహ్యతరమైనది నీ జన్మ వృత్తాంతం
భవ్యమయమైనది నీ దేవ సేనాధిపత్యం
శ్రీ వల్లీ ప్రియ మనోహరా హర కుమారా
సంతానం నీ వరప్రసాదం షణ్ముఖా కావరా

3.కుక్కుటధ్వజానీకు బహుపరాక్ బహుపరాకు
శిఖివాహన స్కందా వేలవందనాలు నీకు
వేలాయుధపాణి నీకు శతకోటి దండంబులు
కార్తికేయ శరవణభవ నీకివె నా శరణార్థులు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:ఉదయ రవిచంద్రిక

చిదిమి దీపం పెట్టుకోవచ్చు బహు చక్కని రూపం
మదిని చిత్రం నిలుపుకోవచ్చు సంశయించక ఏమాత్రం
అందానికే నీవు అసలైన కొలమానం
ఏ కవీ ఉపయోగించని అపురూప ఉపమానం

1.కళ్ళలో ఏదో అద్భుత దివ్యత్వం
చూపుల్లో జింకపిల్లలా  అమాయకత్వం
చెంపలింక సిగ్గులొలికే మంకెన మొగ్గలు
కురులైతే కారుకొనే పట్టుకుచ్చులు
దొండ పళ్ళు మరిపించే నీ పెదవులు
కౌముదే కలత చెందే నీ నగవులు

2.తలని నిమురాలనిపించే ముగ్ధత్వము
తెలవారువేళలో విరుల స్నిగ్ధత్వవము
ముట్టుకుంటె మాసిపోయే సౌందర్యము
పట్టుకుంటె కందిపోయే సౌకుమార్యము
అపరంజి బొమ్మవు నీవు లేలేత కొమ్మవు నీవు
ఆహ్లాదం కురిపించే ఏడురంగుల నింగి విల్లువు


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎద తలుపు తట్టేదెవరో
నా కవి తలపు కొచ్చేదెవరో
అతిథిగా వేంచేసేది ఏ వస్తువో
తానుగా స్పృశియించేది ఏ విషయమో
ఏ రసం వర్షిస్తుందో ఎంతగా అలరిస్తుందో

1.అన్నమయ్య ఆవహించి భక్తి వెలువరించేనో
క్షేత్రయ్య ప్రేరేపించి శృంగారం కురిపించేనో
వేమనే స్ఫూర్తినీయ సమాజమే స్ఫురించునో
దేశమాత బోధించ జాతీయత నినదించేనో
ఏ రసం వర్షిస్తుందో ఎంతగా అలరిస్తుందో

2.తొలి ప్రేమలోని బిడియాలు ఒలికేనో
దాంపత్యమందలి అనురాగం చిలికేనో
స్నేహబంధంలోని మధురిమే పలికేనో
మగతలోని మానవతనే మేలుకొలిపేనో
ఏ రసం వర్షిస్తుందో ఎంతగా అలరిస్తుందో
రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

అన్నం పరబ్రహ్మ స్వరూపం
అన్నమో రామచంద్ర అని ఘోషిస్తోంది నిరుపేద ప్రపంచం
ఆకలి ప్రేగుల నులిమేస్తుంటే
పట్టెడుమెతుకులకై  పాట్లెన్నొ పడుతోంది కడు దయనీయం

1.తలదాచుకోనడానికి పంచనేది దొరకక
కడుపుకింత తినడానికి మట్టికంచమూ లేక
కునుకైన తీయుటకొక కుక్కిమంచమూ నోచక
బ్రతుకొక శాపంగా భవిత ప్రశ్నార్థకంగా
దినదినగండం నూరేళ్ళ ఆయువుగా
కూడూ గూడూ లేని జనం గోడు వెళ్ళగ్రక్కుతోంది

2.తింటే అరగని రోగం వండి వృధాపర్చు వైనం
విందూవినోదాల్లో విచ్చలవిడి పదార్థాల వ్యర్థం
జనం విదిలించు తాలు నిలుపునెన్నొ జీవితాలు
అదుపు చేయు విలాసాలు ఏర్పరచును విలాసాలు
అందించే చేయూతలు మార్చగలుగు తలరాతలు
మనిషి కొరకు మనసుపెడితె  మనిషిలో ఋషిత్వాలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కవినైనాను నేను నీ చలవవల్లే చెలియా
కవితలే రాస్తున్నాను నా అనుభూతులే ప్రియా
కనులముందుకొస్తే ప్రణయైక కవిత
కనుమరుగైతేనో విరహాగ్నే కవిత
అహరహమూ నీదే ధ్యాస
అనవరతము నీమీదే ఆశ

1.గూఢంగా నిన్నే ఎపుడూ వెంబడించాను
మౌనంగా నిన్నే   ఆర్తితో ఆరాధించాను
చెలరేగిన భావాలన్నీ మదిలొ దాచుకున్నాను
ఏరుకొన్న నీగురుతులను పదిలపరచుకున్నాను
మనువాడగ కలలే కంటూ తాత్సారం చేసాను
రెప్పపాటులోగా నిన్ను  పరభార్యగ చూసాను

2.నాహృదయ గోదావరిని వరదలే ముంచెత్తాయి
ఊహలన్ని ఊడ్చిపెట్టి ఎడారిగా మార్చేసాయి
యాంత్రికంగ నా బ్రతుకేదో అలా గడిచి పోతోంది
నువ్వు ఎదురైనపుడల్లా లావా పెల్లుబుకుతోంది
నవ్వులనే పులుముకున్న జీవశ్చవాన్ని నేను
మరుజన్మకైనా నీవాడిగా వరము కోరుకుంటున్నాను
రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

గార్హపత్యాయ నమో
ఆవహనీయాయనమో
దక్షిణాగ్ని సంయుతా
త్రేతాగ్ని రూపాయ నమో నమో
అగ్ని దేవాయా నమో నమో నమో నమో

1.తమసోమా జ్యోతిర్గమయా వహ్నిదేవాయ నమో
యజ్ఞయాగాది క్రతు అధిప హవ్యవాహనాయ నమో
సూర్యచంద్ర తేజో ప్రదాయకాయ అనలాయనమో
అరణి మథన ఆవిర్భవ కృశానాయ నమో నమో

2.ఖాండవ వన దహనాయ ధూమధ్వజాయనమో
సర్వభక్ష ద్విశీర్శాయ స్వాహా పతయే నమో
సీతా పునీత శీలపరీక్ష సాక్షీభూతాయతే నమో
బ్రహ్మ జ్యేష్ఠ పుత్రాయ దిక్పాలక శ్రేష్టాయ హుతాశనాయ నమో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నా ప్రతిగీతం ఒక సుప్రభాతం
నా భావావేశం జోగ్ జలపాతం
జీవధార ప్రవహిస్తుంది
ఆత్మఘోష నినదిస్తుంది
అనవరతం నామనోరథం కవనపథం
నవనవోన్మేషం  నవరసభరితం ఎద ఎదకూ శుభసందేశం

1.ఉపమానాలు ఉత్పేక్షలు నాకు అపేక్షలు
పొంతనలేని ప్రతీకలు పునరుక్తులు నాకుపేక్షలు
అన్నిపాటలు అన్నిపూటలు నాకు విషమ పరీక్షలు
విద్యాబుద్ధులు గేయ సిద్ధులు వాగ్దేవి భిక్షలు

2.ఏ వస్తువు ఎదురైనా నోచేను నా ఆదరణ
ఏ విషయం పలకరించినా చేరున నాఅక్కున
మనోధర్మ మనుసరించి రూపొందును స్వరరచన
అనురాగం రంగరించగా రంజకమౌ నా కీర్తన
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

లేనివాణ్ణి ఉన్నాడన్కొని
విన్నపాల నెన్నో వేడ్కొని
వలసినన్ని పేర్లతో పేర్కొని
నమ్మినాను సేవలే చేస్కొని
తెలుసుకో మనసా నీ సమయం హుళ్ళుక్కి
ఎరుగవే మనసా దొరికిందింతే బ్రతుక్కి

1.మంగళవారం గణపతి మారుతి నరహరి యని కొలిచి
బుధవారం వాణీ మణికంఠుల ప్రణుతించి
గురువారం సాయిబాబా శరణాగతి జొచ్చి
శుక్రవారం జగన్మాతనే యథోచితంగా కీర్తించి
ఖంగుతిన్నాను మనసా ఎంతగానో భ్రమించి

2.శనివారం వేంకటపతినే కొనియాడి
ఆదివారం ఆదిత్యుని శ్రీరాముని శ్రీకృష్ణుని పాడి
సోమవారం సదాశివునితో మొరలిడి
అహోరాత్రాలు దైవచింతనే తలపులనిడి
భంగపడినాను మనసా గుడ్డిగా బోల్తాపడి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

జన్మదిన శుభవేళ శ్రీమతి Manjula Surya కు-
-డా.రాఖీ చిరుకానుక

పాలకడలి మథనాన క్షీరజ నీవై
మానస సరోవరాన నీరజ రూపై
ఆవిర్భవించితీవు  నేడే మంజులమౌ మంజులా
పరిణమించె పరవశాన అవనియే మధువనిలా

శుభాకాంక్షలందుకో మంజుల సూర్యా
శుభాశీస్సులివిగో హృదయ ఔదార్యా
హ్యాపీ బర్త్ డే టూయూ మంజులా
విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ ఈశుభవేళా

1.మందహాసమే మణిహారం
మధుర భాషణే సుధారసం
దయార్ద్రమౌ వీక్షణే పూర్ణిమ శరత్తు
కపోలాల తీక్షణే గులాబీ తటిత్తు
ఎంత శ్రద్ధ కనబరచాడో నీ సృజనలొ బ్రహ్మ
చక్కగా ముడిపెట్టాడు సంజయ్ తో నీ జన్మ

శుభాకాంక్షలందుకో మంజుల సూర్యా
శుభాశీస్సులివిగో హృదయ ఔదార్యా
హ్యాపీ బర్త్ డే టూయూ మంజులా
విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ ఈశుభవేళా

2.విరులకున్న సౌందర్యం నీ సొత్తు
కవనంతో చేస్తావు చిత్తాలనే చిత్తు
గాత్రానికి చేయాలి న్యాయం కించిత్తు
ఆపత్తులొ సంపత్తులో వీడబోకు మైత్రి పొత్తు
సౌశీల్యం సౌహార్ద్రం సమపాళ్ళుగ నీకు సంపద
శతమానం భవతిగ వర్ధిల్లు ఆదర్శమూర్తివై సదా

శుభాకాంక్షలందుకో మంజుల సూర్యా
శుభాశీస్సులివిగో హృదయ ఔదార్యా
హ్యాపీ బర్త్ డే టూయూ మంజులా
విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ ఈశుభవేళా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చరమగీతం పాడుతోంది ధరణీతలం
మన నరజాతి సమస్తం మృత్యుదూత బాధితులం
తర్కించకు నేస్తమా మనం వెక్కుతున్న వెతలం
చితికిన బ్రతుకులతో చితికి చేరుకొనే కతలం

1.ఎటుచూడు కరోనా మృత్యు పాశమౌతోంది
ఏమరుపాటైతే మరణశాసనం రాస్తోంది
ఆరోగ్యవంతుణ్ణీ రోగిగా మారుస్తోంది
శుభ్రత పాటించకుంటే ప్రాణాల్ని కబళిస్తోంది

2.పదే పదే గుర్తు చేసినా ఏ మాత్రం చికాకుపడకు
అదే పనిగ హెచ్చరించినా బేఫికరుగ వ్యవహరించకు
కరోనా కోరల చిక్కక మూసుకోర ముక్కూమూతి
భౌతిక దూరం జరుగుతు తప్పించుక తిరుగర సుమతి

PIC courtesy:Agacharya Artist